జిల్లాలోని పాఠశాలలకు ప్రభుత్వం అరకొరగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులను మంజూరు చేసింది.
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలోని పాఠశాలలకు ప్రభుత్వం అరకొరగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులను మంజూరు చేసింది. జిల్లాకు అవసరమైన పోస్టుల్లో మూడవ వంతు అంటే 33 శాతం పోస్టులకు ప్రభుత్వం కోత పెట్టింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో విద్యా బోధన కుంటు పడకుండా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం జిల్లాల నుంచి ప్రతిపాదనలు కోరింది.
జిల్లాలో 898 మంది అకడమిక్ ఇనస్ట్రక్టర్లు అవసరమని డీఈవో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం జిల్లాకు కేవలం 601 పోస్టులను మాత్రమే మంజూరు చేసింది. అంటే 297 పోస్టులకు కోత పెట్టింది. ఆ పోస్టులు కూడా కేవలం మూడు నెలలకే పరిమితం చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పాఠశాలలకు మరో రెండు మూడు రోజుల్లో దసరా సెలవులు ప్రకటించనున్నారు. అంటే విద్యా సంవత్సరం మొత్తంలో మూడో వంతు కాలం ముగిసినట్లే.
ప్రస్తుతం జిల్లాకు మంజూరు చేసిన పోస్టులను భర్తీ చేసేప్పటికి మరి కొంత కాలం పడుతుంది. మొత్తంగా అక్టోబర్ నుంచే అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు పాఠశాలల్లో పనిచేసే అవకాశం ఉంది. ఉన్నత పాఠశాలల్లో స్కూలు అసిస్టెంట్ గణితం పోస్టులు 18 అవసరమని ప్రతిపాదించగా 13 పోస్టులు మంజూరయ్యాయి. బయోలాజికల్ సైన్స్ 28 పోస్టులు అవసరం కాగా 20 పోస్టులు, సోషల్ స్టడీస్ 70 పోస్టులు అవసరమని ప్రతిపాదన పంపగా కేవలం 26 మాత్రమే మంజూరయ్యాయి. హైస్కూళ్లలో సోషల్ టీచర్ పోస్టులు తక్కువగా ఉన్నాయి.
వాటికి తోడు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను కూడా ఇవ్వకపోవడంతో పాఠశాలల్లో సోషల్ టీచర్లకు పనిభారం విపరీతంగా పెరిగింది. భాషా పండితులకు మొత్తం 38 పోస్టులు అవసరం కాగా కేవలం 12 పోస్టులు మాత్రమే మంజూ రు చేశారు. సెకండరీ గ్రేడ్‌లో తెలుగు, ఉర్దూ మీడియంకు సంబంధించి 723 పోస్టులు అవసరం కాగా కేవలం 530 పోస్టులు మాత్రమే మంజూరు చేశారు. వ్యాయామోపాధ్యాయ పోస్టులు 21 అవసరం కాగా ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదు.