విద్యా సంవత్సరం మొదలైంది. చిన్నారులను బడిలో చేర్పించేందుకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.
సాక్షి, ఒంగోలు: విద్యా సంవత్సరం మొదలైంది. చిన్నారులను బడిలో చేర్పించేందుకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రుల్లో సవాలక్ష ఆలోచనలు.. పిల్లలను ఏ బడిలో చేర్పిద్దామా..? అని ఆరా తీస్తున్నారు. ఇంటింటికీ తిరిగి మీ పిల్లల్ని మా బడిలో చేర్పించండంటూ.. ఫీజులో రాయితీ ఇస్తామంటూ ఆకర్షిస్తోన్న కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ప్రచారంతో ఎటూ తేల్చుకో లేకున్నారు. నాణ్యమైన గుణాత్మక విలువలతో కూడిన విద్య ప్రభుత్వ పాఠశాలల ద్వారానే అందుతోందని ఏటా ప్రచారం చేసే విద్యాశాఖ ఈసారి నోటికి తాళమేసుకుంది.
పాఠశాలల పునఃప్రారంభానికి పదిరోజుల ముందుగానే నిర్వహించే ‘విద్యా సంబరాల’కు ఆమడ దూరంలో ఉంటోంది. కార్పొరేట్, ప్రయివేటు విద్యాసంస్థల ఫీజులు భరించలేని పేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యపై అవగాహన కల్పించాల్సిన విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి. చిన్నారులను బడిలో చేర్పించే కార్యక్రమంపై మాత్రం ఎటువంటి సన్నాహకాలు లేవు. జిల్లాలో 699 ఉన్నత పాఠశాలలు, 572 ప్రాథమికోన్నత పాఠశాలలు, 3,186 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో గతేడాది 2.5 లక్షల మంది పిల్లలు చదివారు. సరిపడా విద్యార్థులు లేకపోవడంతో కిందటేడాది కొన్ని మండలాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. ఈఏడాది అంతకంటే ఘోరమైన పరిస్థితి తలెత్తే అవకాశాలున్నాయంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
విద్యా సంబరాలపై సన్నాహక కార్యక్రమాలకు సైతం షెడ్యూల్ రూపొందించకపోవడంతో విద్యాశాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ముందు వారం పదిరోజులు విద్యాసంబరాల పేరిట బడిబాట నిర్వహించేవారు. పాఠశాలల పరిధిలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు జరిగేవి. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ప్రభుత్వవిద్య పట్ల అవగాహన కల్పించేవారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీతో పాటు నాణ్యమైన విద్యనందిస్తామని ఉపాధ్యాయులు బడిబాట ద్వారా హామీనిచ్చి.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేవారు. స్థానిక ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేసేవారు. పాఠశాలలకు రంగులు వేయడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, గదులకు మరమ్మతులు చేయించడం.. ఇలా అన్ని కార్యక్రమాలు బడిబాటలో భాగంగానే పూర్తి చేసేవారు. 2008 సంవత్సరం నుంచి ఈవిధానం అమలవుతూ వస్తోంది. ఈఏడాది బడిబాట ఊసే ఎత్తడం లేదు. కనీసం, దానికి ఏర్పాట్లు కూడా చేయడం లేదు.
వలవేస్తున్న కార్పొరేట్ సంస్థలు..
కార్పొరేట్, ప్రయివేటు విద్యాసంస్థలు ఇప్పటికే భారీగా విద్యార్థులను చేర్పించుకునేందుకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. టీచింగ్ సిబ్బందికి పిల్లల అడ్మిషన్‌లపై టార్గెట్‌లిచ్చి మరీ పనిచేయించుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల నుంచి కనీసం దీనిపై సన్నాహక కార్యక్రమాలు కూడా చేపట్టకపోవడంతో విద్యార్థుల సంఖ్యపై ప్రభావం పడనున్నట్టు ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి, ఆరో తరగతికి విద్యార్థుల చేరిక కీలకం. అలాగే, గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదివిన విద్యార్థులంతా తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉండేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. తాజాగా ఇవేమీ లేకపోవడంతో.. భవిష్యత్ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన విద్యాశాఖ అధికారుల్లో కనిపిస్తోంది.
బడిబయట పిల్లల గుర్తింపేదీ..?
బడికి దూరంగా ఉన్న పిల్లలను గుర్తించడం లేదు. చాలామంది విద్యార్థులు పాఠశాలలకు దూరమై బాలకార్మికులుగా మిగులుతున్నారు. ఇలాంటి వారందరినీ బడిబాటలో గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేవారు. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం బడిఈడు పిల్లలంతా కచ్చితంగా చదువుకోవాల్సిందే.. వారిని కార్మికులుగా పంపించడం, నియమించుకోవడం కూడా నేరమేనని చట్టం చెబుతోంది.
నిర్బంధ విద్యావిధానం అమలు చేస్తోన్న ప్రభుత్వం ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల భాగస్వామ్యంతో విద్యాకమిటీలు ఏర్పాటు చేయాలి. బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009 (21) రూల్ 19 (2) ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో తప్పనిసరిగా తల్లిదండ్రుల కమిటీలు ఉండాలి. పాఠశాలల్లో అమలవుతోన్న పలు ప్రభుత్వ పథకాలు, ఇతర అంశాలపై ఈ కమిటీ చర్చించి లోటుపాట్లు సరిచేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం నుంచి ఉత్తర్వుల్లేవు..
కే విజయభాస్కర్ జిల్లా విద్యాశాఖాధికారి,
విద్యా సంవత్సరం పునఃప్రారంభంపై ఇప్పటికే మండలాల విద్యాశాఖాధికారులతో సమీక్ష నిర్వహించాం. జూన్ ఒకటో తేదీ నుంచి ఉపాధ్యాయులంతా గ్రామాల్లో పర్యటించి పిల్లల్ని బడికి రప్పించే కార్యక్రమాలు చేయాలని ఆదేశించాం. విద్యా సంబరాలు, బడిబాట తదితర కార్యక్రమాలపై మండల స్థాయిలో వారు ఎలాంటి చర్యలు చేపట్టారనే విషయంపై మరోమారు సమీక్షిస్తాం. ఈసారి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.