ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దారుణం | Public schools in academic atrocity | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దారుణం

Published Sat, Aug 17 2013 10:42 PM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM

మహారాష్ర్ట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. బోధన మరీ నాసిరకంగా ఉండటంతో స్కూళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది.

సాక్షి, ముంబై: మహారాష్ర్ట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. బోధన మరీ నాసిరకంగా ఉండటంతో స్కూళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నా ఫలితం కనిపించడంలేదు. ‘గ్రామీణాభివృద్ధి (గ్రామ్‌వికాస్) విభాగం’ నిర్వహించిన సర్వేలో జిల్లాపరిషత్ పాఠశాలల పనితీరు బయటపడింది. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తున్న తీరు, విద్యార్థుల స్థాయి, ఇతర వివరాలను బట్టి ఏ, బీ, సీ, డీ, ఈ గ్రేడ్‌లుగా పాఠశాలలను విభజించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలపై దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
 రాష్ట్రంలో మొత్తం 61,833 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 541 (0.87 శాతం) పాఠశాలలు మాత్రమే ‘ఎ’గ్రేడ్‌గా నమోదయ్యాయి. ‘బి’ గ్రేడ్ పాఠశాలలు 6,248 (10 శాతం) ఉండగా, ‘సి’ గ్రేడ్‌వి 45,101 (73 శాతం)పాఠశాలలు, ‘డి’ గ్రేడ్‌వి 9,652 (16 శాతం) పాఠశాలలున్నాయని వెల్లడైంది. వీటితోపాటు విద్యాప్రమాణాలు సున్నాశాతం ఉన్న ‘ఇ’ గ్రేడ్ పాఠశాలలు కూడా ఉన్నాయని వెల్లడైంది. ‘ఇ’ గ్రేడ్ పాఠశాలలు మొత్తం 291 ఉన్నాయి. అయితే ఈ గ్రేడ్‌ల ద్వారా రాష్ట్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు ఎలా ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు ఆధునిక బోధనా పద్ధతులను కూడా అవలంబించాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 
 
 నాందేడ్ జిల్లా భేష్..!
 పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపరిచేందుకు పలు జిల్లాలు సొంతంగా శిక్షణ తరగతులు నిర్వహించాయి. వీటిలో నాందేడ్ జిల్లా అందరికంటే మెరుగైన శిక్షణ అందించడంలో సఫలీకృతమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 541 ‘ఎ’ గ్రేడ్ పాఠశాలల్లో నాందేడ్ జిల్లాలోనే ఏకంగా 139 ఉండడం విశేషం. అయితే ఈ జిల్లాలో సి గ్రేడ్ పాఠశాలలు కూడా 1,380 ఉన్నాయి. మరోవైపు విద్యానగరంగా పేరుగాంచిన పుణే జిల్లాలో మొత్తం 3,745 పాఠశాలలుండగా కేవలం 34 పాఠశాలలు ‘ఎ’ గ్రేడ్‌కు  చెందినవి ఉన్నాయి. మరోవైపు ఠాణేలో ఒకే ఒక్క పాఠశాల ‘ఎ’ గ్రేడ్‌కు చెందింది కావడం గమనార్హం. ఇక షోలాపూర్ జిల్లాలో 39 ‘ఎ’ గ్రేడ్ పాఠశాలలు, 2,351 ‘సి’ గ్రేడ్ పాఠశాలలున్నాయి. 
 
 ‘ఎ’ గ్రేడ్ పాఠశాలలు లేని జిల్లాలు నాలుగు...
 రాష్ట్రంలోని నాలుగు జిల్లాపరిషత్ పాఠశాలల్లో అసలు ‘ఎ’ గ్రేడ్ పాఠశాలలే లేవని వెల్లడైంది. నందుర్బార్, జల్‌గావ్, హింగోళి, వాసి జిల్లాల్లో అసలు ఒక్క పాఠశాల కూడా ‘ఎ’ గ్రేడ్‌లో లేకపోవడం గమనార్హం. మరోవైపు ముంబైని ఆనుకున్న ఠాణే జిల్లాతోపాటు భండారా, ధులే, బుల్డానా మొదలగు నాలుగు జిల్లాల్లో కేవలం ఒక్కొక్కటి చొప్పున ‘ఎ’ గ్రేడ్ పాఠశాలలున్నాయి. దీంతోపాటు నాగపూర్, రత్నగిరి, సింధుదుర్‌‌గ, నాసిక్, ఔరంగాబాద్, జాల్నా, పర్భనీ, ఉస్మానాబాద్, లాతూర్, అమరావతి, చంద్రాపూర్ జిల్లాల్లో ‘ఎ’ గ్రేడ్ పాఠశాలలు ఆరు లోపే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement