ఒంగోలు వన్‌టౌన్: ఇదిగో డీఎస్సీ...అదిగో డీఎస్సీ...అంటూ ఇన్నాళ్లు ఊదరగొట్టిన ప్రభుత్వం డీఎస్సీ కింద ప్రకటించే పోస్టుల్లో కోత పెట్టి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. నాలుగు నెలలుగా డీఎస్సీపై రకరకాల ప్రచారం చేసిన ప్రభుత్వం చివరకు పోస్టుల్లో కోత పెట్టి నిరుద్యోగులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మొదట 20 వేల పోస్టులు డీఎస్సీకి ప్రకటిస్తామంటూ కోతలు కోసిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ సంఖ్యను 15 వేలకు కుదించింది. మరో నెల గడిచేటప్పటి కి ఆ సంఖ్యను మరీ కుదించి 10 వేలకు చేర్చింది. తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే నాటికి అది కాస్త 9,061 పోస్టులకు మాత్రమే పరిమితం చేసింది.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
జిల్లాలో మొత్తం 839 టీచర్ పోస్టులు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో కేవలం 688 పోస్టులను భర్తీ చేసేందుకు మాత్రమే ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. దీంతో జిల్లాలోని ఖాళీల్లో 151 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోనున్నాయి. ప్రధానంగా ప్రాథమిక పాఠశాలల్లోని ఎస్‌జీటీ పోస్టుల్లోనే ప్రభుత్వం భారీగా కోత విధించింది.
జిల్లాలో సెకండరీ గ్రేడ్ తెలుగు 715, ఉర్దూ 8 కలిపి మొత్తం 723 పోస్టులు ఖాళీగా ఉండగా, వీటిలో 579 పోస్టులు మాత్రమే భర్తీ చేసేందుకు అనుమతించారు. అంటే ఎస్‌జీటీ విభాగంలో 144 పోస్టులకు కోత పెట్టారు. అదేవిధంగా హిందీ గ్రేడ్-2 భాషా పండితులు 13 పోస్టులు ఖాళీ ఉండగా కేవలం 10 పోస్టులకు మాత్రమే అనుమతించారు. వ్యాయామోపాధ్యాయుల్లో 21 పోస్టులు ఖాళీ కాగా 17 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. స్కూలు అసిస్టెంట్ క్యాడర్‌లో మొత్తం 79 పోస్టులు ఖాళీగా ఉండగా అన్ని పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతించారు.
నిరుద్యోగ టీచర్ల నిరసన:
ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామక పరీక్ష (టెట్ కమ్ టీఆర్‌టీ)కు ప్రకటించే పోస్టుల్లో ప్రభుత్వం కోత విధించటంపై నిరుద్యోగ ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 64 డీఈడీ కళాశాలలు, 45 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. డీఈడీ కళాశాలల నుంచి ఏటా 6,400 మంది ఛాత్రోపాధ్యాయులు, బీఈడీ కళాశాల నుంచి ఏటా సుమారు 4 వేల మంది బీఈడీ పట్టాతో బయటకు వస్తున్నారు. వీరందరూ డీఎస్సీ పోస్టులపై గంపెడాశతో ఉన్నారు.
అయితే ప్రభుత్వం ఉన్న పోస్టులను కూడా కుదించి నోటిఫికేషన్ జారీ చేయడంపై నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. జిల్లాలోని పాఠశాలల్లో ఖాళీలన్నింటినీ డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని మున్సిపల్, ఐటీడీఏ పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయుల నియామకానికి డీఎస్సీ ద్వారానే చేపట్టాలని నిరుద్యోగ టీచర్లు కోరుతున్నారు.
అన్నీ కోతలే...
Published Fri, Nov 28 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM
Advertisement