సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల నియామకం కోసం తెలంగాణలో త్వరలో డీఎస్సీ వేసే అంశం సీఎం పరిశీలన లో ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. లాక్‌డౌన్ కారణంగా గతేడాది పది, ఇంటర్ విద్యార్థులను పరీక్ష లేకుండానే పాస్ చేసినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో దూరదర్శన్, డిజిశాట్ ద్వారా 85 శాతం విద్యార్థులకు పాఠాలు బోధించామన్నారు.
ఇటీవల హైదరాబాద్ వరదల్లో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి తిరిగి కొత్తవి ఇచ్చామన్నారు. రాష్ట్రంలో గురుకులాలు, మోడల్, కేజీబీవీ విద్యార్థులు అన్ని ప్రవేశపరీక్షల్లో జాతీయస్థాయిలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. వర్సిటీల్లో వీసీల నియామకాలు చేస్తామన్నారు. డీఎస్సీ అంశం సీఎం పరిధిలో ఉందని, ఆయన పరిశీలిస్తున్నారని అన్నారు. ప్రైవేటు టీచర్ల జీతాలపై తిరుపతిరావు కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
కరోనా ముప్పు పోలేదు: ఈటల
‘ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. తప్పకుండా త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తాం. సిద్దిపేట, నల్లగొండ తదితర తొమ్మిది మెడికల్ కాలేజీల్లో నిమ్స్, గాంధీ ఆసుపత్రుల స్థాయి సేవలందిస్తాం. నేరుగా పెద్ద ఆసుపత్రులకు రాకుండా పీహెచ్‌సీ, జిల్లా తరువాత నిమ్స్, గాంధీకి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. దేశంలో కుటుంబ నియంత్రణలో ముందున్నాం. వ్యాక్సినేషన్‌లో 96 శాతంతో ముందంజలో ఉన్నాం. కోవిడ్ నియంత్రణలో దేశంలో తొలిమూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.
కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. రెండోసారి సోకే ప్రమాదముంది. మాస్కులు, టెస్టులు, వెంటిలేటర్లు, మందులు దేనికీ కొరత లేదు. 5 వేలకు పైగా ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి’అని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సభ్యులకు సమాధానమిచ్చారు.
డీఎస్సీ నిర్వహించాలి
హైదరాబాద్:ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, విద్యా బోధనలో నాణ్యత పడి పోకుండా వచ్చే జూన్‌లోగా ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయాలని టీఆర్‌ఎస్ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో పారిశుధ్య సిబ్బందిని తిరిగి నియమించాలని సూచించారు. విద్య, వైద్యం, పురపాలక, ఆబ్కారీ, అటవీ, దేవాదాయ తదితర శాఖల 2021–22 వార్షిక బడ్జెట్ పద్దులపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చలో పలువురు అధికార, విపక్ష పార్టీల సభ్యులు మాట్లాడారు.
మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులు చెల్లించాలని సండ్ర కోరారు. జూనియర్ కళాశాలలు లేని మండల కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులపై ప్రభుత్వ నియంత్రణ ఉండే విధానం తీసుకురావాలన్నారు. ఎంఈఓ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిస్టులు వస్తున్నారని, ఎవరు జర్నలిస్టులనేది ప్రభు త్వం నిర్వచించాలన్నారు.
టీఆర్టీ పోస్టులకు ఎంపికైన 250 మందిని పక్కనపెట్టారని, వీరిలో అర్హులను గుర్తించి ఉద్యోగాల్లో నియమించాలని రఘునందన్‌రావు కోరారు. ప్రతి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆస్పత్రుల నిర్మాణాన్ని సత్వరం పూర్తిచేసి స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలన్నారు.
కరోనా నేపథ్యంలో గాంధీ, టిమ్స్, జిల్లా ఆస్ప త్రుల్లో నియమించిన తాత్కాలిక పారా మెడికల్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలన్నారు.ధూపదీప నైవేద్యాల పథకం కింద ఇస్తున్న నిధులను పెంచాలన్నారు. ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన దేవాలయ, వక్ఫ్ భూములను తిరిగి ఆయా సంస్థలకు అప్పగిం చాలని సూచించారు. కిడ్నీ రోగుల అవసరాలను తీర్చడానికి డయాలసిస్ కేంద్రాల్లో పరికరాల సంఖ్య పెంచాలని సంజయ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment