టీచర్ ఉద్యోగానికి ఎంపిక అయినట్లు మెసేజ్
హైదరాబాద్ వెళ్లేవారి జాబితాలోనూ పేరు
తీరా అక్కడికి వెళ్లాక మొండిచేయి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ యువకుడికి ఉద్యోగం వచ్చిందన్న ఆనందం 24 గంటలు కూడా లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన కారంగుల సాయిరెడ్డి డీఎస్సీలో మంచి మార్కులు సాధించారు. ఈ నెల 8న ఆయనకు డీఈవో కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ‘మీరు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు సోషల్ స్టడీస్‌లో సెలెక్ట్ అయ్యారు. 9న కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకోవాలి’అని ఫోన్ చేసి చెప్పారు. అదే రోజు రాత్రి ఆయన సెల్‌ఫోన్‌కు మెసేజ్ కూడా వచ్చింది. 9న ఉదయం కామారెడ్డికి చేరుకున్న సాయిరెడ్డి.. జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్ బయలు దేరారు.
బస్సుకు అతికించిన జాబితాలో కూడా సాయిరెడ్డి పేరుంది. హైదరాబాద్‌కు వెళ్లిన సాయిరెడ్డికి అక్కడ సీఎం ప్రోగ్రాం ముగిసిన తరువాత నియామక పత్రాలు ఇచ్చేటపుడు జాబితాలో పేరు లేదన్నారు. దీంతో గురువారం డీఈవో రాజును కలవగా, పొరపాటు జరిగిందని, మీరు సెలెక్ట్ కాలేదని సమాధానం ఇచ్చారు. ‘మీకన్నా ముందు ర్యాంకు వాళ్లకు వెళ్లాల్సిన మెసేజ్, ఫోన్ కాల్ మీకు వచ్చింది, సారీ’అంటూ చెప్పారు. దీంతో సాయిరెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తొలుత జాబితాలో పేరు ఉన్నట్టుగా చూపి, చివరకు ఇలా లేదని చెప్పడంలో ఏదో కుట్ర దాగుందని అనుమానం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment