Teacher jobs
-
ఆశ పెట్టి.. నిరుద్యోగితో ఆడుకున్నారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ యువకుడికి ఉద్యోగం వచ్చిందన్న ఆనందం 24 గంటలు కూడా లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన కారంగుల సాయిరెడ్డి డీఎస్సీలో మంచి మార్కులు సాధించారు. ఈ నెల 8న ఆయనకు డీఈవో కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ‘మీరు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు సోషల్ స్టడీస్‌లో సెలెక్ట్ అయ్యారు. 9న కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకోవాలి’అని ఫోన్ చేసి చెప్పారు. అదే రోజు రాత్రి ఆయన సెల్‌ఫోన్‌కు మెసేజ్ కూడా వచ్చింది. 9న ఉదయం కామారెడ్డికి చేరుకున్న సాయిరెడ్డి.. జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్ బయలు దేరారు.బస్సుకు అతికించిన జాబితాలో కూడా సాయిరెడ్డి పేరుంది. హైదరాబాద్‌కు వెళ్లిన సాయిరెడ్డికి అక్కడ సీఎం ప్రోగ్రాం ముగిసిన తరువాత నియామక పత్రాలు ఇచ్చేటపుడు జాబితాలో పేరు లేదన్నారు. దీంతో గురువారం డీఈవో రాజును కలవగా, పొరపాటు జరిగిందని, మీరు సెలెక్ట్ కాలేదని సమాధానం ఇచ్చారు. ‘మీకన్నా ముందు ర్యాంకు వాళ్లకు వెళ్లాల్సిన మెసేజ్, ఫోన్ కాల్ మీకు వచ్చింది, సారీ’అంటూ చెప్పారు. దీంతో సాయిరెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తొలుత జాబితాలో పేరు ఉన్నట్టుగా చూపి, చివరకు ఇలా లేదని చెప్పడంలో ఏదో కుట్ర దాగుందని అనుమానం వ్యక్తం చేశారు. -
గురుకుల నోటిఫికేషన్ జాడేది? 11 వేల ఉద్యోగాలకు అనుమతులు వచ్చినా!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తీవ్రంగా జాప్యమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అన్నిరకాల అనుమతులు జారీ అయి నెలలు కావస్తున్నా గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) నోటిఫికేషన్ల ఊసెత్తడం లేదు. మొత్తం 11 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేయగా.. ఇందులో 9,096 పోస్టులకు 8 నెలల క్రితమే.. మరో 2వేల పోస్టులకు నెలరోజుల క్రితం అనుమతులు వచ్చాయి. ఉద్యోగ జాతరలో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 80వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గతేడాది యుద్ధ ప్రాతిపదిక చర్యలు మొదలు పెట్టింది. అందులో ఇప్పటికే 60వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ దాదాపు 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వగా.. రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) దాదాపు 18 వేల పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ప్రకటనలు జారీ చేసింది. ఇక తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) సైతం మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు కేటగిరీల్లో 7 వేల ఉద్యోగాలకు ప్రకటనలు ఇచ్చింది. ఇలా వివిధ నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇచ్చి దరఖాస్తుల స్వీకరణ, అర్హత పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై బిజీ అవుతుండగా.. గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. నిరాశలో అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం ఐదు గురుకుల సొసైటీల పరిధిలో పోస్టుల భర్తీ బాధ్యతలను టీఆర్‌ఈఐఆర్‌బీకి అప్పగించింది. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ పక్కా వ్యూహంతో సన్నద్ధం కావాలి. బోర్డుకు చైర్మన్‌గా గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శుల్లో సీనియర్ ఒకరు వ్యవహరిస్తారు. ఆ తర్వాత మరో కార్యదర్శి కన్వీనర్‌గా, మిగతా సొసైటీలకు సంబంధించిన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. సొసైటీల కార్యదర్శులే బోర్డులో ఉండటంతో ఉద్యోగ ఖాళీలు, ఇతర అంశాల సమాచారం వేగంగా సేకరించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయినా జాప్యం తప్పడం లేదు. దీనితో గురుకుల కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. -
ఏపీ: 502 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
-
AP: 502 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖ 502 టీచర్ పోస్టులతో డీఎస్సీ లిమిటెడ్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు, మోడల్ స్కూళ్లలో 207 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే మున్సిపల్ స్కూళ్లలో 15 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ 81 పోస్టులు ఉన్నాయి. ఇదిలా ఉంటే, డీఎస్సీలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ కల్పించారు. నేటి(ఆగస్టు 23) నుంచి సెప్టెంబర్ 17 వరకు ఫీజు చెల్లింపు గడువుగా నిర్దేశించారు. ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్ 23న పరీక్ష, నవంబర్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. చదవండి: (పవన్ తనకు తాను పెద్ద పుడింగి అనుకుంటున్నాడు: మంత్రి రాజా) -
AP TET 2022: ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (ఏపీటెట్)–ఆగస్టు 2022 శనివారం (నేటి) నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21 వరకు కంప్యూటరాధారితంగా ఇవి జరుగుతాయి. ఈ పరీక్షలకు 5.25 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో 150 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. రాష్ట్రంతోపాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోనూ వీటిని ఏర్పాటుచేశారు. ఇక టెట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ చెల్లుబాటు ఇంతకుముందు ఏడేళ్లుగా ఉండేది. కానీ, కేంద్ర ప్రభుత్వం దీన్ని మార్పుచేసి చెల్లుబాటును జీవితకాలంగా ప్రకటించింది. వెయిటేజీతో పెరిగిన అభ్యర్థులు ఇక ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంటు టీచర్ పోస్టుల అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు డీఎస్సీ ఎంపికల్లో 20 శాతం వెయిటేజీ ఇవ్వనుండడంతో కొత్తగా డీఎడ్, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారితో పాటు గతంలో ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు కూడా తమ స్కోరు పెంచుకునేందుకు ఈసారి టెట్ పరీక్షలకు హాజరవుతున్నారు. టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ రిజర్వుడ్ అభ్యర్థుల అర్హత మార్కులను 45 నుంచి 40కి తగ్గించారు. దీనివల్ల కూడా అదనంగా మరో 50వేల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య పెరగడం.. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు తగినన్ని లేకపోవడంతో పలువురు అభ్యర్థులకు ఇతర రాష్ట్రాల్లోని సెంటర్లను కేటాయించారు. దీంతో వారు ఇబ్బందికి గురవుతున్నారు. -
బెంగాల్ కేబినెట్ నుంచి పార్థ ఛటర్జీ బర్తరఫ్
-
Partha Chatterjee: పార్థా ఛటర్జీపై సీఎం మమత బెనర్జీ వేటు
కోల్‌కత: టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పార్థా ఛటర్జీకీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షాకిచ్చారు. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ వేటేశారు. టీచర్ల నియామకానికి సంబంధించిన కేసులో ఛటర్జీ ఇప్పటికే అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వాణిజ్యం, పరిశ్రమల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇండస్ట్రియల్ రికన్స్ట్రక్షన్ మంత్రిగా ఉన్నారు. టీఎంసీ ప్రధాన కార్యదర్శిగానూ కొనసాగుతున్నారు. (చదవండి: పార్థా ఛటర్జీ ఇంట్లోకి దూరిన దొంగ.. ఈడీ రైడ్‌గా భావించిన స్థానికులు) అవన్నీ చెప్పలేం ‘పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నా. తప్పు చేసినవారిపై టీఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అధికారాన్ని దుర్వినియోగం చేసేవారి పని పట్టడానికి మా వద్ద చాలా ప్లాన్స్ ఉంటాయి.. అవన్నీ చెప్పలేం’ అని మమత పేర్కొన్నారు. ఛటర్జీకి ఉద్వాసన నేపథ్యంలో ఆ శాఖలు సీఎం మమత తనవద్దే పెట్టుకోనున్నారు. కాగా, టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు స్కామ్‌లో పార్థా ఛటర్జీ భారీ స్థాయిలో వెనకేసినట్టు గుర్తించిన ఈడీ కేసులు నమోదు చేసి విచారిస్తోంది. అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ వద్ద నుంచి దాదాపు రూ.50 కోట్ల వరకు నగదు, కిలోలకొద్దీ బంగారాన్ని రికవరీ చేసింది. ఇవేకాకుండా స్థిరాస్తులు, విదేశీ నగదు ఎక్చేంజీకి సంబంధించిన పత్రాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. (చదవండి: ఈడీ సోదాలపై స్పందించిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్) -
టెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్! ఒక్కసారి రాస్తే చాలు..
సాక్షి, హైదరాబాద్: టెట్‌కు సంబంధించి ఇటీవల మంత్రుల కమిటీ చేసిన కొన్ని సవరణలను ప్రభుత్వం ఆమోదించింది. గతం లో టెట్‌లో సాధించిన అర్హత కాలపరిమితి ఏడేళ్లుగా ఉండేది. దీన్ని ఇప్పుడు జీవితకాలానికి పొడిగించారు. జాతీయ ఉపాధ్యాయ మండలి (ఎన్సీటీఈ) రెండేళ్ళ క్రితం ఈ మేరకు మార్పులు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా మార్పులు చేసింది. దీని ప్రకారం 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అంటే అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటు కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్ పాసైనవారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. జూన్ 12న టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటి ఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ రాధారెడ్డి సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఈ నెల 25వ తేదీన ‘టీఎస్‌టెట్. సీజీజీ.జీవోవీ.ఇన్’వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. కాగా టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. పేపర్–1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.00 వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుంది. (చదవండి: వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు) -
బీటెక్, బీఈడీ ఉంటే టీచర్ పోస్టులకు అర్హులే
సాక్షి, హైదరాబాద్: నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) మార్గదర్శకాల మేరకు బీటెక్, బీఈడీ విద్యార్హత కలిగిన అభ్యర్థులూ పీజీటీ/టీజీటీ పోస్టులకు అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈమేరకు బీటెక్ అభ్యర్థులనూ ఈ పోస్టులకు అనుమతించాలంటూ 2019లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ‘ఎన్సీటీఈ 2010, 2014 మార్గదర్శకాల ప్రకారం బీటెక్, బీఈడీ చదివిన అభ్యర్థులూ పీజీటీ, టీజీటీ పోస్టులకు అర్హులు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్లో బీఏ, బీఎస్సీ, బీకాంతోపాటు బీఈడీ చదివిన అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొంది. ఎన్సీటీఈ మార్గదర్శకాల మేరకు బీటెక్ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పు సరైనదే’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. -
డీఎస్ఎస్ఎస్బీలో 7236 ఉద్యోగాలు
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(ఎన్సీటీ ఢిల్లీ) ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(డీఎస్ఎస్ఎస్బీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 7236 ► పోస్టుల వివరాలు: ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)–6258, అసిస్టెంట్ టీచర్ (ప్రైమరీ, నర్సరీ)–628, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్–278, కౌన్సిలర్–50, పట్వారీ–10. ► ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): సబ్జెక్టులు: హిందీ, నేచురల్ సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, బెంగాలీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఏ(ఆనర్స్), బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి. వయసు: 32 ఏళ్లు మించకూడదు. ► అసిస్టెంట్ టీచర్(ప్రైమరీ, నర్సరీ): అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: అర్హత: మెట్రిక్యులేషన్/సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి. వయసు: 18–27 ఏళ్ల మధ్య ఉండాలి. ► కౌన్సిలర్: అర్హత: సైకాలజీ/అప్లైడ్ సైకాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కౌన్సిలింగ్ సైకాలజీలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి. ► పట్వారీ: అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీతో పాటు ఉర్దూ /హిందీలో పని అనుభవం ఉండాలి. వయసు: 21–27 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: వన్ టైర్/టూ టైర్ ఎగ్జామినేషన్ స్కీమ్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 25.05.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.06.2021 ► వెబ్సైట్: dsssb.delhi.gov.in మరిన్ని నోటిఫికేషన్లు: ఐఐఐటీ శ్రీసిటీలో టీచింగ్ కొలువులు సీడ్యాక్, హైదరాబాద్‌లో 44 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు -
ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు; ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి
దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్ఎస్)లో టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3476 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రిన్సిపల్, వైస్‌ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టులున్నాయి. వీటిలో తెలంగాణకు సంబంధించి 262 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 117 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు ►ప్రిన్సిపల్–175, వైస్ ప్రిన్సిపల్–116 ► పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్–1244 ► ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్–1944 రాష్ట్రాల వారీగా ఖాళీలు ఆంధ్రప్రదేశ్–117(ప్రిన్సిపల్ 14, వైస్ ప్రిన్సిపల్ 06, టీజీటీ 97), తెలంగాణ–262(ప్రిన్సిపల్11, వైస్ ప్రిన్సిపల్ 06, పీజీటీ 77, టీజీటీ 168), ఛత్తీస్‌గఢ్–514, గుజరాత్–161, హిమాచల్‌ప్రదేశ్–08, జార్ఖండ్–208, జమ్మూ అండ్ కాశ్మీర్–14, మధ్యప్రదేశ్–1279, మహా రాష్ట్ర–216, మణిపూర్–40, మిజోరం–10, ఒడిశా–144, రాజస్తాన్–316, ఉత్తరప్రదేశ్–79, ఉత్తరాఖండ్–09, సిక్కిం–44, త్రిపుర–58. ఈఎంఆర్ఎస్ గిరిజన ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాటు చేసినవే.. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్ఎస్). ప్రస్తుతం 17 రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 3476 పోస్టుల ఖాళీల భర్తీకి కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న పాఠశాలలతోపాటు ప్రస్తుత ఏడాది ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో వీరిని భర్తీచేసే అవకాశం ఉంది. విద్యార్హతలు ► ప్రిన్సిపల్ : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 45శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ, బీఎడ్ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే హిందీ, ఇంగ్లిష్ మీడియం బోధనలో నైపుణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ► వైస్ ప్రిన్సిపల్: వైస్ ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, బీఈడ్ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ► పీజీటీ: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీతోపాటు బీఈడీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వీటితోపాటు హిందీ, ఇంగ్లిష్ మీడియం బోధనలో నైపుణ్యం ఉండాలి. ► టీజీటీ : టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీతోపాటు బీఈడీ, సంబంధిత సబ్జెక్టుల్లో సీటెట్/టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. వీటితోపాటు హిందీ, ఇంగ్లిష్ మీడియం బోధనలో నైపుణ్యం ఉండాలి. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ), ఇంటర్వ్యూల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టీజీటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూ రౌండ్ ఉండదు. ఎంపికకు సంబంధించిన అర్హత పరీక్షలను ఆయా ప్రాంతాల్లోనే నిర్వహిస్తారు. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో చేసుకోవాలి ► దరఖాస్తులకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2021 ► పరీక్ష తేదీ: జూన్ మొదటి వారంలో ► వెబ్సైట్: https://tribal.nic.in/ -
చంద్రబాబు సభలో ఆందోళన
సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలో గురువారం ఆయన పాల్గొన్న సభలో నిరుద్యోగ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఆయన ప్రసంగానికి అడ్డుతగిలి.. మెగా డీఎస్సీ వేసి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు నిర్లక్ష్యంగా, క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారనీ, సంయమనం పాటించాలని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆయన మాటలను పట్టించుకోకపోవడంతో ఆందోళన చేస్తున్న 20 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అక్రమంగా అరెస్టు చేశారని నిరుద్యోగులు వాపోయారు. 12,900 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఏడువేల పోస్టులకే నోటిఫికేషన్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా జిల్లాల కంటే చంద్రబాబు సొంతజిల్లాకు తక్కువ పోస్టులు కేటాయించారని జిల్లాకు చెందిన మహిళా నిరుద్యోగులు ఆరోపించారు. అందరికీ విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి క్రమశిక్షణ లేదంటూ వ్యాఖ్యానించడం బాధ కలిగించిందని అన్నారు. -
వసూళ్ల కేంద్రంగా సీఎంవో!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పెద్దలు, ఉన్నత వ్యక్తులే యధేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతుంటే కిందిస్థాయి సిబ్బంది కూడా అదేబాటలో నడుస్తున్నారు. పెద్దల స్థాయి పెద్దలది, మా స్థాయి మాది అన్నట్టుగా సీఎం కార్యాలయం సిబ్బంది వసూళ్లపై మాట్లాడుకోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్ర పరిపాలనా కేంద్రానికి వేదికైన సీఎం కార్యాలయమే లంచాలు, వసూళ్లకు వేదిక కావడం, దీనిపై చర్యలు తీసుకునే నాథుడే లేకపోవడం అధికార వర్గాలతోపాటు సామాన్యుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. టీచర్ ఉద్యోగాల పేరుతో సీఎం చంద్రబాబు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు నిరుద్యోగుల నుంచి రూ.కోట్లలో వసూలు చేయడం కలకలం రేపుతోంది. పాలనా కేంద్రంలో జోరుగా బేరసారాలు పాలనకు ఆయువుపట్టుగా ఉండే సీఎంవోలో వసూళ్లు, లంచాలకు సంబంధించి లావాదేవీలు జరుగుతున్నట్టు వెల్లడి కావడం అధికార వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. రాష్ట్రానికి ప్రధాన పరిపాలనా కేంద్రమైన ఇక్కడే ఇలా బేరసారాలు జరగడంపై ఉన్నతాధికార వర్గాలు విస్తుపోతున్నాయి. సీఎంవోలోనే ఇలా ఉంటే ఇక జిల్లా కేంద్రాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీచర్ ఉద్యోగాల పేరుతో దాదాపు 73 మందిని మోసగించినట్లు భావిస్తున్నారు. సీఎంవో ఉద్యోగి కావడంతో విశ్వసించిన బాధితులు నిత్యం నలుగురైదుగురు ఐఏఎస్‌లు, అదనపు కార్యదర్శులు, డిప్యూటీ సెక్రటరీలు, సహాయ కార్యదర్శులు పనిచేసే ముఖ్యమంత్రి కార్యాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా వ్యవహరించిన రాంగోపాల్ ఎయిడెడ్ స్కూళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బాధితుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా వసూలు చేసినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు తెలిసింది. సీఎం కార్యాలయం ఉద్యోగి కావడంతో అభ్యర్థులు పూర్తిగా విశ్వసించి లంచాలు చెల్లించారు. అయితే నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బాధితులు ఆందోళనకు దిగటంతో విషయం బయటకు వచ్చింది. సీఎంకు దగ్గరగా ఉంటారని.. ఏపనైనా ఇట్టే చేస్తారని! సీఎంవో కార్యాలయం ఉద్యోగి రాంగోపాల్(ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కోశాధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు) బాధితుడైన సురేష్‌బాబుకు ఇబ్రహీంపట్నంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగనాయకమ్మ ద్వారా పరిచయమయ్యాడు. సీఎంకు దగ్గరగా ఉంటారని, ఏపనైనా ఇట్టే చేసి పెడతారని చెప్పడంతో సురేష్‌బాబుకు గురి కుదిరింది. అలా కుదిరిన పరిచయంతో టీచర్ పోస్టు కోసం సురేష్‌బాబు డబ్బులు చెల్లించాడు. మరికొంత మంది నిరుద్యోగులను తీసుకొస్తే వాళ్లకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని రాంగోపాల్ చెప్పాడు. ఒక్కో ఎయిడెడ్ పోస్టుకు రూ.16 లక్షలు చెల్లించేలా బేరం కుదిరింది. తన ఖాతాలో డబ్బులు వేస్తే ఇబ్బందులొస్తాయని రాంగోపాల్ చెప్పడంతో దాసరి సురేష్ అనే వ్యక్తి ఖాతాలో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. తొలిదశలో రూ.22 లక్షలు బ్యాంకులో వేశారు. రాంగోపాల్ ఆ తర్వాత గుంటూరు కోస్టల్ బ్యాంకులోని తన భార్య ఖాతాకు రూ.10 లక్షలు మళ్లించుకున్నట్లు బాధితుడు తుళ్లూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనుమానంతో నిలదీసిన నిరుద్యోగులు ఓవైపు లావాదేవీలు జరుగుతున్నా ఎవరికీ ఉద్యోగాలు రాకపోవడం, ఆర్నెళ్లకుపైగా గడిచిపోవడంతో బాధితులు రాంగోపాల్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో తాను ఉన్నతాధికారులకు డబ్బులిచ్చానని, తొందర పెట్టొద్దని చెప్పాడు. అయితే డబ్బులు చెల్లించిన నిరుద్యోగులకు అనుమానం వచ్చి మరింత ఒత్తిడి చేయడంతో విషయం బట్టబయలైంది. డబ్బుల వసూలు వెనుక ఉన్నత స్థాయి వ్యక్తులున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాంగోపాల్‌కు కీలక నేత అండదండలు... నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన రాంగోపాల్ సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారికి అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. దీంతోపాటు ఉద్యోగుల సంఘంలో కీలక నేత అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. సీఎంవోలో ఓ కీలకౖ∙వ్యక్తితో దగ్గర సంబంధం ఉండటంతో యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు రాంగోపాల్‌కు ట్రావెల్ ఏజన్సీలతోపాటు చిట్టీల వ్యాపారం ఉన్నట్లు సమాచారం. కాగా, బాధితులు కొందరు ఫిర్యాదు చేయడానికి నేరుగా సీఎంవోకి రావడంతో పరువు పోతుందని ఆందోళన చెందిన అధికారులు రాంగోపాల్‌ను సీఎంవో నుంచి జీఏడీకి మార్చారు. తర్వాత అక్కడ నుంచి యువజన సర్వీసులకు మార్చారు. కేసు నమోదుకు ఆదేశించాం నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. రూ.22 లక్షల వరకూ వసూలు చేసినట్టు మాకు ఫిర్యాదులందాయి. కేసు నమోదు చేయాలని డీఎస్పీని ఆదేశించాం. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరాం. –నాగులాపల్లి శ్రీకాంత్, సాధారణ పరిపాలనాశాఖ కార్యదర్శి (రాజకీయ) చావే శరణ్యం వ్యవసాయం చేసుకునే తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారి రంగనాయకమ్మ ద్వారా రాంగోపాల్ పరిచయమైనట్లు బాధితుడు వి.సురేష్‌బాబు ఈనెల 2న తుళ్లూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉద్యోగమొస్తుందంటే ఆశపడి తనతోపాటు 73 మంది బాధితులు డబ్బులు కట్టారని తెలిపాడు. డబ్బు తిరిగి ఇప్పించకుంటే తన కుటుంబానికి చావే శరణ్యమని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీఎంవోలో తనకు తెలిసిన వారున్నారని రాంగోపాల్ బెదిరిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాడు. -
నకిలీ టీచర్లపై వేటు పడదేం..?
► తప్పుడు కుల, వికలాంగ ధ్రువీకరణతో 51 మందికి టీచర్ ఉద్యోగాలు ► 18 మందిని తొలగించాలని కమిషనర్ ఆదేశం ► ఇప్పటివరకు డిస్మిస్ చేసింది కేవలం ఆరుగురినే... సాక్షి, హైదరాబాద్: వైకల్యం లేదు కానీ దివ్యాంగుల కోటాలో ఉద్యోగం దక్కించుకున్నాడో ప్రబుద్ధుడు.. అగ్రకులానికి చెందిన మరోవ్యక్తి వెనకబడిన కులాల కోటా కింద చాన్స్ కొట్టేశాడు.. ఇలాంటి ఘనకార్యాలు చేసింది ఒకరిద్దరే కాదు. ఏకంగా 51 మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి టీచర్ కొలువులో కొనసాగుతున్నారు. విద్యాశాఖకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చ ల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏకంగా 51 మంది ఇలా తప్పుడు ధ్రువీకరణ ప్రతాలు సమర్పించి ఉపాధ్యాయ ఉద్యోగాలు దక్కిం చుకున్నారు. ఈ అంశంపై విద్యాశాఖ ప్రత్యేకంగా అధికారులను నియమించి విచారణ చేసి, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొంది న వారిపై వేటు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయి ఆర్నెల్లు గడిచినా క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు వేటు వేసేందుకు సాహసించకపోవడం గమనార్హం. నకిలీ టీచర్లపై విచారణ ప్రక్రియంతా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అప్పటి డీఈవో ఆధ్వర్యంలో జరిగింది. ఈక్రమంలో డీఈవో నివేదికను పరిశీలించిన విద్యాశాఖ 18 మందిని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. అయితే జిల్లా ల విభజన నేపథ్యంలో తొలగింపు ప్రక్రియ నాలుగైదు జిల్లాలకు వ్యాపించింది. విద్యాశాఖ కమిషనర్ నిర్దేశించిన ప్రకారం 18 మందిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా... ఇప్పటివరకు కేవలం ఆరుగురిని మాత్రమే విధుల నుంచి డిస్మిస్ చేశారు. మరో 12 మందిపై చర్యలు తీసుకోకుండా ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులు వాయిదాలు వేయడంపై విమర్శలు వస్తున్నాయి. డీఈవో నివేదికలో ముఖ్యాంశాలు.. ► 28 మంది ఉపాధ్యాయులు పీహెచ్ (ఫిజికల్ హేండీకాప్డ్) కేటగిరీలో ఉద్యోగాలు పొందారు. వీరిలో 11 మంది వినికిడి, ఏడుగురు అంధత్వ, 10 మంది ఆర్థో కేటగిరీలో సర్టిఫికెట్లు సమర్పించారు. వీటిని మెడికల్ బోర్డు, ప్రభుత్వ ఈఎన్టీ, సరోజినీదేవి ఆస్పత్రితో పాటు గాంధీ ఆస్పత్రుల రికార్డులతో సరిపోల్చడంతో పాటు వారికి వైద్యపరీక్షలు నిర్వహించగా వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. ► ముగ్గురు ఉపాధ్యాయులు నకిలీ కుల సర్టిఫికెట్లు సమర్పించగా వాటిని క్షేత్రస్థాయిలో ప్రత్యేకాధికారితో పరిశీలన చేయిస్తే అందులోనూ లోపాలున్నట్లు బయటపడింది. ► 16 మంది ఉపాధ్యాయులు నకిలీ బోనఫైడ్లు సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపైనా విచారణ చేపట్టినట్లు నివేదికలో పేర్కొన్నారు. ► మరో నలుగురు ఉపాధ్యాయులకు సంబంధించి సరైన సమాచారం లభించలేదని నివేదికలో వివరించారు. -
‘ఒట్టి’చాకిరే..!
విద్యాశాఖ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న డీఎస్సీ అభ్యర్థులు విద్యావాలంటీర్లుగా నియమించే యోచనపై అభ్యంతరం అప్రెంటిస్ వ్యవస్థను తిరిగితెచ్చే యత్నాలపై తీవ్ర నిరసన సోషల్ మీడియా ద్వారా మంత్రి గంటాకు వినతుల వెల్లువ ఈ నెల 29న విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో ఏకకాలంలో సమావేశాలు వినుకొండ టౌన్: జిల్లాలో సుమారు 30 వేల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసి, ఆరునెలలుగా తుది ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. 2014 నవంబర్ 19న డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా.. 2015 మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత డీఎస్సీ కీలో నెలకొన్న తప్పిదాలపై కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో తుది ఫలితాల విడుదలలో జాప్యం జరుగుతోంది. కోర్టుకేసులు తుది దశకు చేరుకున్నాయని, తుది తీర్పు ఎప్పడైనా రావచ్చని అభ్యర్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ మెరిట్ అభ్యర్థులను తుది నియామకాలు ఇచ్చేంత వరకు విద్యావాలంటీర్లుగా నియమించాలనేది ప్రభుత్వం ఆలోచన. ఈనెల 21న హైదరాబాద్‌లో జరిగిన విద్యాశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ఆలోచన చేసినట్టు తెలియడంతో డీఎస్సీ అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో విద్యాశాఖలో అప్రెంటీస్ విధానం ప్రవేశపెట్టారు. ఉపాధ్యాయులుగా నియామకం పొందిన వారు రూ.1200, రూ.1500ల నెలవారీ వేతనంతో రెండేళ్ల పాటు అప్రెంటీస్ చేయాల్సి ఉంటుంది. అప్రెంటీస్ పూర్తయిన వారినే రెగ్యులర్ ప్రాతిపదికన ఉపాధ్యాయులుగా నియమించేవారు. ఎన్నో పోరాటాలు చేసిన ఉపాధ్యాయులు, నిరుద్యోగులు ఈ అప్రెంటీస్ విధానాన్ని 2008 డీఎస్సీ నుంచి రద్దు చేయించారు. అప్పటి నుంచి పూర్తి ప్రారంభ వేతనంతో ఉపాధ్యాయ నియామకాలు జరుగుతున్నాయి. తిరిగి ఇప్పుడు డీఎస్సీ మెరిట్ అభ్యర్థులతో విద్యావాలంటీర్లుగా రూ.5వేలు.రూ.7వేల గౌరవ వేతనంతో నియమించాలని విద్యాశాఖ ఆలోచన చేస్తుండటంతో అభ్యర్థులు మండిపడుతున్నారు. విద్యావాలంటీర్లుగా నియమించడం అంటే అప్రెంటీస్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడమేనని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా నిరసన... విద్యాశాఖ ఆలోచనను నిరసిస్తూ డీఎస్సీ అభ్యర్థులు ఫేస్బుక్, వాట్స్‌యాప్‌ల ద్వారా మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు తమ నిరసన తెలుపుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే డీఎస్సీ నియామకాలు ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు కేసులు తుది దశకు వచ్చిన నేపథ్యంలో మళ్లీ విద్యావాలంటీర్ల నియామకం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల నుంచి డీఎస్సీ అభ్యర్థులు ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా మంత్రి గంటాకు తమ నిరసన తెలుపుతున్నారు. గతించిపోయిన అప్రెంటీస్ విధానాన్ని విద్యావాలంటీర్ల రూపంలో మళ్లీ తీసుకు రావద్దని వేడుకుంటున్నారు 29న డీఎస్సీ సాధన సమితి సమావేశం.. డీఎస్సీ నియామకాలు త్వరగా చేపట్టాలని, మెరిట్ అభ్యర్థులతో విద్యావాలంటీర్ల నియామక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డీఎస్సీ అభ్యర్థులు ఈ నెల 29న విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో ఏకకాలంలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు. లేకుంటే ఆందోళన చేపడతామంటున్నారు. అప్రెంటిస్ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టడమే.. గతంలో చంద్రబాబునాయుడి ప్రభుత్వంలో అప్రెంటీస్ వ్యవస్థ ఉంది. ఐదు వేల రూపాయల నెల జీతంతో విద్యా వాటంటీ ర్లుగా డీఎస్సీ మెరిట్ అభ్యర్థును నియమించటం అంటే అప్రెంటీస్ విధానం తిరిగి తీసుకురావడం లాంటిదే. ప్రభుత్వం తన నిర్ణయాన్ని విరమించుకుని డీఎస్సీ నియామకాలు చేపట్టాలి. - జి.వి.ప్రవీణ్‌కుమార్, ఎస్జీటీ అభ్యర్థి ఇప్పటికే ఎంతో నష్టం... విద్యావాలంటీర్లుగా నియమించాలన్నా మెరిట్ జాబితా ఇవ్వాలి. అదే మెరిట్ జాబితా ఇచ్చి నేరుగా నియామకాలు చేపట్ట వచ్చుకదా. ఇప్పటికే తీవ్ర ఆలస్యం జరిగి నష్టపోతున్నాం. ప్రభుత్వం నిరుద్యోగుల గోడు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలి. - జి.రామ్‌సింగ్, ఎస్జీటీ అభ్యర్థి -
టెట్‌పై సర్కారు మల్లగుల్లాలు
-
టెట్‌పై సర్కారు మల్లగుల్లాలు
ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: టీచర్ ఉద్యోగం కోసం అభ్యర్థులు ఇబ్బందులు పడుతూ రెండు పరీక్షలకు సిద్ధం కావడం అవసరమా? ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉంటుందా? ఉండదా? అనే విషయాన్ని తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి అధికారులతో చర్చించాలని భావిస్తోంది. ఒక దశలో టెట్‌ను రద్దు చేసేందుకు కూడా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నా.. విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) అమలులో భాగంగా జాతీయ ఉపాధ్యాయ, విద్యా మండలి (ఎన్సీటీఈ) టెట్‌ను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో రద్దు సాధ్యం అవుతుందా? లేదా? అనే కోణాల్లోనూ విశ్లేషిస్తోంది. ఒకవేళ రద్దు సాధ్యం కాకపోతే టెట్, డీఎస్సీ రెండూ కలిపి రెండు పేపర్లతో ఒకే పరీక్షగా నిర్వహించే అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఆర్టీఈ అమలులో భాగంగా ప్రభుత్వం టెట్‌ను ప్రవేశ పెట్టింది. ఒకటి నుంచి ఐదో తరగతికి బోధించేవారు టెట్ పేపరు-1 పరీక్ష, 6 నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునేవారు పేపరు-2లో అర్హత సాధించాలి. ఇందులో అర్హత సాధించినవారు మాత్రమే జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నిర్వహించే ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష రాసేందుకు అర్హులుగా పేర్కొంది. ఇక డీఎస్సీ పరీక్షలో సాధించే మార్కులకు 80 శాతం, టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి టీచర్ల నియామకాలు చేపడుతోంది. ఇది అర్హత పరీక్ష అయినందున టెట్‌ను ఏటా రెండుసార్లు డిసెంబర్/జనవరి నెలల్లో, జూన్/జులై నెలల్లో నిర్వహించేందుకు గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం డిసెంబరు/జనవరిలో నిర్వహించాల్సిన టెట్‌ను ఈ ఏడాది మార్చిలో నిర్వహించింది. ప్రస్తుతం పరీక్షలు పూర్తి చేసుకొని బయటకు వచ్చే లక్ష మందికి పైగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థుల కోసం, గతంలో టెట్ రాసినా అర్హత సాధించని మరో 3 లక్షల మంది కోసం ఈ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటికిప్పుడు టెట్ నిర్వహణ అవసరమా? లేదా? అనే విషయాన్ని కూడా త్వరలో నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. కాగా, తమ ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోదని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. టీచర్ ఉద్యోగానికి రెండు పరీక్షలు అవసరమా అనే కోణంలోనూ ఆలోచనలు చేస్తున్నామన్నారు.