సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలో గురువారం ఆయన పాల్గొన్న సభలో నిరుద్యోగ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఆయన ప్రసంగానికి అడ్డుతగిలి.. మెగా డీఎస్సీ వేసి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు నిర్లక్ష్యంగా, క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారనీ, సంయమనం పాటించాలని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆయన మాటలను పట్టించుకోకపోవడంతో ఆందోళన చేస్తున్న 20 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అక్రమంగా అరెస్టు చేశారని నిరుద్యోగులు వాపోయారు. 12,900 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఏడువేల పోస్టులకే నోటిఫికేషన్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా జిల్లాల కంటే చంద్రబాబు సొంతజిల్లాకు తక్కువ పోస్టులు కేటాయించారని జిల్లాకు చెందిన మహిళా నిరుద్యోగులు ఆరోపించారు. అందరికీ విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి క్రమశిక్షణ లేదంటూ వ్యాఖ్యానించడం బాధ కలిగించిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment