ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: టీచర్ ఉద్యోగం కోసం అభ్యర్థులు ఇబ్బందులు పడుతూ రెండు పరీక్షలకు సిద్ధం కావడం అవసరమా? ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉంటుందా? ఉండదా? అనే విషయాన్ని తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి అధికారులతో చర్చించాలని భావిస్తోంది. ఒక దశలో టెట్‌ను రద్దు చేసేందుకు కూడా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నా.. విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) అమలులో భాగంగా జాతీయ ఉపాధ్యాయ, విద్యా మండలి (ఎన్‌సీటీఈ) టెట్‌ను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో రద్దు సాధ్యం అవుతుందా? లేదా? అనే కోణాల్లోనూ విశ్లేషిస్తోంది. ఒకవేళ రద్దు సాధ్యం కాకపోతే టెట్, డీఎస్సీ రెండూ కలిపి రెండు పేపర్లతో ఒకే పరీక్షగా నిర్వహించే అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
ఆర్‌టీఈ అమలులో భాగంగా ప్రభుత్వం టెట్‌ను ప్రవేశ పెట్టింది. ఒకటి నుంచి ఐదో తరగతికి బోధించేవారు టెట్ పేపరు-1 పరీక్ష, 6 నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునేవారు పేపరు-2లో అర్హత సాధించాలి. ఇందులో అర్హత సాధించినవారు మాత్రమే జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నిర్వహించే ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష రాసేందుకు అర్హులుగా పేర్కొంది. ఇక డీఎస్సీ పరీక్షలో సాధించే మార్కులకు 80 శాతం, టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి టీచర్ల నియామకాలు చేపడుతోంది. ఇది అర్హత పరీక్ష అయినందున టెట్‌ను ఏటా రెండుసార్లు డిసెంబర్/జనవరి నెలల్లో, జూన్/జులై నెలల్లో నిర్వహించేందుకు గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వాటి ప్రకారం డిసెంబరు/జనవరిలో నిర్వహించాల్సిన టెట్‌ను ఈ ఏడాది మార్చిలో నిర్వహించింది. ప్రస్తుతం పరీక్షలు పూర్తి చేసుకొని బయటకు వచ్చే లక్ష మందికి పైగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థుల కోసం, గతంలో టెట్ రాసినా అర్హత సాధించని మరో 3 లక్షల మంది కోసం ఈ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటికిప్పుడు టెట్ నిర్వహణ అవసరమా? లేదా? అనే విషయాన్ని కూడా త్వరలో నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. కాగా, తమ ప్రభుత్వం విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోదని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. టీచర్ ఉద్యోగానికి రెండు పరీక్షలు అవసరమా అనే కోణంలోనూ ఆలోచనలు చేస్తున్నామన్నారు.