సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తీవ్రంగా జాప్యమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అన్నిరకాల అనుమతులు జారీ అయి నెలలు కావస్తున్నా గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) నోటిఫికేషన్ల ఊసెత్తడం లేదు. మొత్తం 11 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేయగా.. ఇందులో 9,096 పోస్టులకు 8 నెలల క్రితమే.. మరో 2వేల పోస్టులకు నెలరోజుల క్రితం అనుమతులు వచ్చాయి.
ఉద్యోగ జాతరలో భాగంగా..
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 80వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గతేడాది యుద్ధ ప్రాతిపదిక చర్యలు మొదలు పెట్టింది. అందులో ఇప్పటికే 60వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ దాదాపు 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వగా.. రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) దాదాపు 18 వేల పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు ప్రకటనలు జారీ చేసింది.
ఇక తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) సైతం మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు కేటగిరీల్లో 7 వేల ఉద్యోగాలకు ప్రకటనలు ఇచ్చింది. ఇలా వివిధ నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇచ్చి దరఖాస్తుల స్వీకరణ, అర్హత పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై బిజీ అవుతుండగా.. గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు.
నిరాశలో అభ్యర్థులు
రాష్ట్ర ప్రభుత్వం ఐదు గురుకుల సొసైటీల పరిధిలో పోస్టుల భర్తీ బాధ్యతలను టీఆర్‌ఈఐఆర్‌బీకి అప్పగించింది. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ పక్కా వ్యూహంతో సన్నద్ధం కావాలి. బోర్డుకు చైర్మన్‌గా గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శుల్లో సీనియర్ ఒకరు వ్యవహరిస్తారు. ఆ తర్వాత మరో కార్యదర్శి కన్వీనర్‌గా, మిగతా సొసైటీలకు సంబంధించిన కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.
సొసైటీల కార్యదర్శులే బోర్డులో ఉండటంతో ఉద్యోగ ఖాళీలు, ఇతర అంశాల సమాచారం వేగంగా సేకరించి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయినా జాప్యం తప్పడం లేదు. దీనితో గురుకుల కొలువుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment