హైదరాబాద్, సాక్షి: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండుసార్లు కోరి కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో బుధవారం ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమం ఆయన పాల్గొని మాట్లాడారు. ‘మిమ్మల్ని చూస్తే దసర పండగ మూడు రోజులు ముందే వచ్చిందా అనిపిస్తోంది. సాధించిన తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని గతంలో ఆశించారు. కానీ, గత సీఎం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఏనాడు చేయలేదు. మా ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం.
వివాదం లేకుండా 21వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించాం. నిరుద్యోగుల సమస్యలను బీఆర్‌ఎస్ పట్టించుకోలేదు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పా. తండ్రీ కొడుకుల కొలువులు ఊడగొడ్తే.. మీకు కొలువులు వస్తున్నాయి. ఏదో రకంగా నోటిఫికేషన్లు అడ్డుకోవాలని కుట్రలు చేశారు. ఉద్యోగాలు ఇస్తుంటే కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. తెలంగాణ సమాజం మీద మీకెందుకంత కోపం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.నేను ప్రభుత్వం పాఠశాలలోనే చదువుకున్నా. ఇకపై బీఆర్‌ఎస్ అధికారంలోకి రాదు.
ప్రభుత్వ స్కూళ్లకు పంపడానికి కొందరు నామోషీగా ఫీలవుతున్నారు. పేదోళ్లు తాళిబొట్టు తాకట్టుపెట్టి ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. బడ్జెట్‌లో విద్యారంగానికి రూ. 21 వేల కోట్లు కేటాయించాం. ఏనాడైనా నిరుద్యోగులకు ఇవ్వాలని ఆలోచనా చేశావా?. అసెంబ్లీకి రావు (కేసీఆర్).. సలహాలు, సూచనలు ఇవ్వవు. మంచి పనులు చేస్తే.. కాళ్లల్లో కట్టెలు పెట్టి అడ్డుకుంటున్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదనం చేసిన పేద ప్రజలను పట్టించుకోలేదు. కేవలం 60 రోజుల్లో డీఎస్సీ నియామకాల ప్రక్రియ పూర్తి చేశాం. నిరుద్యోగుల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ఇవాళ్టి కార్యక్రమం జరగొద్దని కుట్రలు చేసిండ్రు. పదేళ్లు ఏలిన వారు పది నెలల మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు. ఆ అవకాశం తెలంగాణ ప్రజలు వారికి ఇవ్వరు. తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు. నాతో పాటు ఇక్కడున్న చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్ళమే. తెలంగాణలో 30వేల పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుకుంటున్నారు. తెలంగాణలోని 10వేల పాఠశాలల్లో 34లక్షల మంది చదువుకుంటున్నారు.ప్రభుత్వ పాఠశాలకు పంపించడం నామోషీగా భావిస్తున్న పరిస్థితికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నాం.
ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.125 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 11న పనులు ప్రారంభించుకోబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నామని గర్వంగా చెప్పుకునేలా వ్యవస్థను తయారు చేస్తాం. ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేపట్టాం.
తెలంగాణలో ప్రతీ ఏటా 1లక్షా 10వేల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. కానీ ఉద్యోగాలు పొందలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించబోతున్నాం.త్వరలో గచ్చిబౌలిలో స్పోర్ట్స్ ఏర్పాటు చేయబోతున్నాం. మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు. తెలంగాణ పునర్మిర్మాణానికి మీవంతు కృషి చేయండి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment