ఎన్నాళ్లకెన్నాళ్లకు!
- నేడు కోదాడలో కాంగ్రెస్ సమావేశం
- ఇంకా ఏకతాటిపైకి రాని జిల్లా నాయకులు
- పార్టీ భవిష్యత్‌పై చర్చ
- ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి పెరిగిన వలసలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లా కాంగ్రె స్ తొలిసారి భేటీ కాబోతోంది. ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, జిల్లాపరిషత్, మూడు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు, మెజారిటీ ఎంపీపీలు వెరసి... జిల్లాలో కాంగ్రెస్ బలంగానే కనిపిస్తోంది. ఎమ్మెల్యే పదవులను మినహాయిస్తే, ఒకవిధంగా అధికార టీఆర్‌ఎస్ కంటే కూడా బలంగానే ఉంది. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇది మున్ముందు మరింతగా పెరిగే వీలుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు, నాయకుల్లో ఆత్మవిశ్వాసం నింపాల్సిన అవసరాన్ని ఆలస్యంగానైనా పార్టీ అగ్ర నాయకత్వం గుర్తించినట్లే కనిపిస్తోంది.
పార్టీ శ్రేణులనుఓ చోట చేర్చేందుకు శుక్రవారం కోదాడలో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అయితే, సమావేశం ఏర్పాటు చేసిన నియోజకవర్గాన్ని బట్టి కొంత ప్రతికూలత ఉంది. జిల్లా కాంగ్రెస్‌లో బలమైన వర్గంగా ఉన్న కోమటిరెడ్డి సోదరులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కోమటిరెడ్డి సోదరులకు అటు టీపీసీసీ చీఫ్ పొన్నాల, ఇటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌తో పేచీ ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే జిల్లా కాంగ్రెస్ ఏకతాటిపైన లేనే లేదు. టీసీఎల్పీ నేతగా ఉన్న పార్టీ సీనియర్ కె.జానారెడ్డి సైతం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, జిల్లా కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో టీపీసీసీ నాయకత్వం ఇప్పటిదాకా కనీస ఆలోచన చేసిన పాపాన పోలేదన్న విమర్శ పార్టీ నేతల్లో ఉంది.
ఈ కారణంగానే భువనగిరి నుంచి చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, నకిరేకల్ నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ టీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యారు. మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి కావాల్సినంత బలం ఉన్నా, సభ్యులను కాపాడుకోలేక సూర్యాపేటను కోల్పోవాల్సి వచ్చింది. కొన్ని మండలాల్లోనూ ఎంపీపీలను ఇదే తరహాలో కోల్పోయారు. చూడడానికి పదవుల రీత్యా బలంగా కనిపిస్తున్నా, టీఆర్‌ఎస్ దూకుడును అడ్డుకోవడంలో మాత్రం ఇక్కడి నాయకులు విఫలమవుతున్నారు.
ఈ పరిస్థితుల్లో జరుగుతున్న సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల, టీసీఎల్పీ నేత జానారెడ్డి, వర్కింగ్‌ప్రెసిడెంట్ ఉత్తమ్, జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి హాజరవుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్‌చైర్మన్లు ఇలా ప్రజాప్రతినిధులంతా హాజరవుతున్నారు. మరి ఈ సమావేశంలో పార్టీని బతికించుకునే దిశలో ఏమైనా చర్చిస్తారా..? కేవలం మొక్కుబడిగా కలిసి చేతులు కలిపేసుకుని వెళ్లిపోతారా..? అన్న ప్రశ్నలు సగటు కాంగ్రెస్ కార్యకర్తల మదిని వేధిస్తున్నాయి.