- జిల్లాలో పడవుల రేవుల ఆదాయం రూ. 1.24 కోట్లు
- వాటి అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చుచేయని అధికారులు
- ప్రమాద భరితంగా పడవ ప్రయాణం
పాతగుంటూరు : జిల్లాలో బల్లకట్టు, పడవల రేవుల నుంచి జిల్లా పరిషత్‌కు భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ రేవుల్లో అభివృద్ధి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు పడవల రేవుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే నిర్వహిస్తుండడంతో రేవుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రేట్లను భారీగా పెంచేస్తున్నారు. అధికారుల కన్నుసన్నల్లోనే బల్లకట్టు, పడవల్లో చార్జీలు పెంచినట్లు ఆరోపణలున్నాయి. రేవుల నుంచి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ ర్యాంపులు, రోడ్లు ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. గుంటూరు జిల్లా వైపు నుంచి కృష్ణా, నల్గొండ జిల్లాలకు కృష్ణానది గుండా ప్రజలు పడవలు, బల్లకట్టు ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.
జిల్లాపరిషత్ ఆధ్వర్యంలో 2014-15 సంవత్సరానికి జిల్లాలో బల్లకట్లు, పడవల రేవులకు మార్చిలో వేలం నిర్వహించారు. జిల్లాలో మూడు బల్లకట్టులు, 12 పడవల రేవులకు వేలం నిర్వహించగా, రూ. కోటీ 24 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఇప్పటికీ రేవుల అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల బల్లకట్టుపై పరిమితికి మించి వాహనాలను ఎక్కిస్తున్నారని, చార్జీలు కూడా పెంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల పరిషత్ అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
నిబంధనలు బేఖాతరు... నదిలో బల్లకట్టు, పడవలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నడపాలనే నిబంధన ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన చార్జీలనే తీసుకోవాలి. అయినప్పటికీ పడవల నిర్వాహకులు అధిక చార్జీలు తీసుకుంటూ రాత్రి సమయాల్లో కూడా పడవలు నడుతున్నారు. మాచవరం మండలం గోవిందాపురం, దాచేపల్లి మండలం రామయగుండం, అచ్చంపేట మండలం మాదిపాడులలో బల్లకట్టు రేవులున్నాయి. అచ్చంపేట మండలం గింజుపల్లి, మాదిపాడు, తాడువాయి, చామర్రు, చింతపల్లి, కొల్లిపర మండలం వల్లభాపురం, వెల్దుర్తి మండలం పుట్టపల్లి, గురజాల మండలం గొట్టిముక్కలలో పడవల రేవులున్నాయి. బెల్లంకొండ మండలం కోళ్ళూరు, చిట్యాల, బోధనంలలో పడవల రేవులను పులిచింతల ముంపు గ్రామాలు కావడంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం... పడవల రేవుల పర్యవేక్షణ నిర్వహిస్తున్నాం. అధిక ధరలు తీసుకుంటున్న విషయం నా దృష్టికి రాలేదు. రేవుల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఎప్పటికప్పుడు రేవులను ఎంపీడీవోలు పరిశీలించి నివేదికలు ఇస్తున్నారు. నిఘా పెట్టి.. ధరలు పెంచినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
- సుబ్బారావు, జెడ్పీ సీఈవో
ఆదాయం ఉన్నా అభివృద్ధి సున్నా
Published Mon, Aug 11 2014 12:53 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
Advertisement