జెడ్పీ ఒక్కటే! జిల్లాలు మూడు
♦ పాలకవర్గం సమయం ముగిశాకే కొత్తవి ఏర్పాటు
♦ సర్కార్ యోచన యంత్రాంగం కసరత్తు
సాక్షి, సంగారెడ్డి: దసరా నుంచి మూడు జిల్లాలు అమల్లోకి రానున్నప్పటికీ జిల్లా పరిషత్ మాత్రం ఒక్కటే ఉంటున్నట్టు తెలుస్తోంది. జెడ్పీ పాలకవర్గం సమయం ముగిశాకే కొత్త జిల్లాల్లో జెడ్పీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటులో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రస్తుత పాలకవర్గం సమయం ముగిశాకే కొత్త జెడ్పీలు ఏర్పాటు చేయనున్నట్లు వినికిడి. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా మెదక్, సిద్దిపేట జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దసరా నుంచి కొత్త జిల్లాలో పరిపాలన సాగేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్ ఆధ్వర్యంలోని పాలకవర్గం జూలై 5, 1014లో పగ్గాలు చేపట్టింది. జిల్లా పరిషత్ పాలకవర్గం సమయం ఇంకా మూడేళ్లు ఉంది. దీంతో పాలకవర్గం సమయం పూర్తిగా ముగిశాకే కొత్త జిల్లాలో జెడ్పీలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి గతంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పునర్వవస్థీకరణను అధికారులు, ప్రజాప్రతినిధులు ఉటంకిస్తున్నారు. గతంలో పంచాయతీ సమితి(బ్లాక్ సమితి)లు ఉండేవి. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బ్లాక్ సమితిల స్థానే మండల వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టూరు.
అయితే రెవెన్యూ మండలాలను తక్షణం అమల్లోకి తెచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం బ్లాక్ సమితిలను మాత్రం 1987 ప్రాంతంలో రద్దు చేసి వాటి స్థానంలో మండల ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటుకు ప్రభుత్వానికి అధికారాలు ఉన్నప్పటికీ కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటుకు వల్ల ప్రస్తుతం ఉన్న పాలకవర్గం రద్దు చేసి మూడు జిల్లాల్లో మళ్లీ వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలు ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది. దీని వల్ల సమస్యలు తలెత్తవచ్చని గుర్తించిన ప్రభుత్వం జెడ్పీ విభజన వాయిదా వేసినట్లు సమాచారం. అలాగే పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి వచ్చే పంచాయతీ, ఇంజనీరింగ్, మార్కెటింగ్ , సహకారశాఖల విభజన జరగకపోవచ్చని తెలుస్తోంది. సంక్షేమశాఖలన్నింటినీ జెడ్పీ పరిధిలోకి తీసుకువచ్చి కొత్త జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల అమలు జెడ్పీ సీఈఓకు అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
కసరత్తు పూర్తి చేసిన అధికారులు
విభజనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం జెడ్పీ విభజనకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసింది. నూతనంగా ఏర్పాటు కానున్న సిద్దిపేట, మెదక్‌లో కొత్తగా జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు సంబంధించి కార్యాలయాలను గుర్తించారు. సిద్దిపేటలో హౌసింగ్ శాఖకు సంబంధించిన నూతన భవనంలో జిల్లా పరిషత్ కార్యాలయం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే మెదక్‌లోని మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని స్త్రీ శక్తి భవనాన్ని గుర్తించారు. అలాగే సిబ్బంది విభజన ప్రక్రియను పూర్తి చేశారు.
అధికారుల సమాచారం మేరకు కొత్తగా ఏర్పాటయ్యే మెదక్, సిద్దిపేట జిల్లాలో జెడ్పీ కార్యాలయాలు ఏర్పాటు చేసినపక్షంలో కొత్తగా 60 మంది అధికారులు, సిబ్బంది అవసరం అవుతారు. రాబోయే రోజుల్లో పదోన్నతుల ద్వారా, కొత్త పోస్టుల మంజూరు ద్వారా సిబ్బంది నియామకాలు చేపట్టే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి అధికారుల కసరత్తును అనుసరించి సంగారెడ్డిలో ఉన్న జెడ్పీ సీఈఓ ఇక్కడే కొనసాగుతారు. డిప్యూటీ సీఈఓకు మెదక్ సీఈఓ బాధ్యతలు అప్పగించనున్నారు. సిద్దిపేటలో కొత్త సీఈఓ పోస్టు మంజూరు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జెడ్పీలో ఐదుగురు సూపరింటిండెంట్‌లు పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరు సూపరింటెండెంట్‌లను సంగారెడ్డికి, ఇద్దరిని మెదక్, ఒకరిని సిద్దిపేటకు సర్దుబాటు చేస్తారు. సిద్దిపేటలో అదనంగా ఒక సూపరింటెండెంట్‌ను నియమిస్తారు, సీనియర్ అసిస్టెంట్లను ఇదే పద్దతితో సర్దుబాటు చేస్తారు.