నువ్వా నేనా! | yadava reddy joined in trs party | Sakshi
Sakshi News home page

నువ్వా నేనా!

Published Thu, Jul 3 2014 12:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

yadava reddy joined in trs party

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రోజుకో మలుపుతో జిల్లా పరిషత్ రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి యాదవరెడ్డి గులాబీ గూటికి చేరడం జిల్లా రాజకీయాల్లో సరికొత్త మార్పులకు దారితీస్తోంది. జెడ్పీ సారథి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనూహ్యంగా యాదవరెడ్డి ప్రత్యర్థి పంచన చేరడం కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. యాదవరెడ్డి కారెక్కడం ఖాయమని ముందే ఊహించిన ఆ పార్టీ న ష్టనివారణ చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి సీఎల్‌పీ నేత జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ జెడ్పీటీసీ సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీడీపీ మద్దతుతో ఎలాగైనా జిల్లా పరిషత్‌ను వశం చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్.. టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ సమావేశంలో పదవీకాలం పంచుకునే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

 పోటాపోటీ!
 జిల్లా పరిషత్‌లో 33 జెడ్పీటీసీలకుగాను టీఆర్‌ఎస్ 12, కాంగ్రెస్ 14, టీడీపీకి ఏడు స్థానాలున్నాయి. నవాబుపేట జెడ్పీటీసీగా గెలుపొందిన యాదవరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన బుధవారం మండలి చైర్మన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేశారు. దీంతో జిల్లా పరిషత్‌లోనూ ఆ పార్టీకి మద్దతు పలికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన టీఆర్‌ఎస్‌కు అండగా నిలిస్తే.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల బలం సమం  అవుతుంది.

 చైర్మన్ ఎన్నిక లో తటస్థంగా ఉన్నా కాంగ్రెస్‌కు నష్టమే. టీఆర్‌ఎస్‌కంటే ఇప్పుడు రెండు సీట్లు అధికంగా ఉన్న ఆ పార్టీకి ఒక సీటు తగ్గిపోతుంది. యాదవరెడ్డి జెడ్పీలో ఓటు హక్కు వినియోగించుకున్నా ఆయన పదవికి ఎలాంటి ముప్పు ఉండదు. ఓటేసిన తర్వాత రెండింటిలో ఏదో ఒక పదవికి రాజీనామా చేస్తే సరిపోతుంది. జెడ్పీ కుర్చీని గెలుచుకోవాలంటే 17మంది సభ్యుల బలం అవసరం. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలకుటీడీపీ మద్దతు తప్పనిసరి. ఏడు జెడ్పీటీసీలున్న ‘దేశం’ ఇదే అదనుగా పావులు కదుపుతోంది.

కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో మద్దతుపై దోబూచులాడుతోంది. స్పష్టమైన అధిక్యతలేకున్నా.. కుర్చీ మాదేనని మొదట్నుంచి ధీమాతో ఉన్న గులాబీ శిబిరం తాజా పరిణామాలతో మరింత హుషారుగా కనిపిస్తోంది. ఏకంగా చైర్మన్ అభ్యర్థినే తమవైపు తిప్పుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేశామని భావి స్తున్న ఆ పార్టీ.. మరో ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల మద్దతును కూడగట్టినట్లు ప్రచారం జరుగుతోంది.  జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి బుధవారం టీడీపీ ఎమ్మెల్యేతో కూడా మద్దతు సమీకరణపై సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

 ఎవరివైపో రేపు తేలుస్తాం!
 జెడ్పీలో కీలకంగా మారిన టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బుధవారం ఆ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లా ఎమ్మెల్యేలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరుపై చర్చించారు. ఈ నేపథ్యంలో జెడ్పీ ఎన్నికలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై శుక్రవారం చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటిద్దామని స్పష్టం చేశారు. కాగా, ఈ సమావేశానికి హాజరైన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు ఇద్దామని ప్రతిపాదించగా, ఒక ఎమ్మెల్యే మాత్రం అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచే అంశాన్ని పరిశీలించాలని చంద్రబాబు వద్ద అన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement