సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం
గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు ఉత్సవ విగ్రహాలుగా మిగలవద్దు. ఎవరు ఏ బాధ్యత నిర్వహించాలనే దానిపై త్వరలోనే స్పష్టత ఇస్తాం. కొత్త పంచాయతీరాజ్ చట్టం వెలుగులో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనుగుణంగా నిర్ణయాలుంటాయి. స్థానిక సంస్థలకు అధికారాలను బదలాయిస్తాం. స్థానిక సంస్థలకు నిధుల కొరత ఉండరాదు. నిధులు, విధులు, బాధ్యతలను త్వరలో అప్పగిస్తాం’ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇటీవల స్థానిక సంస్థలకు నిధులు, అధికారాల విషయంలో చేసిన వ్యాఖ్యలివి.
సాక్షి, సంగారెడ్డి: మండల ప్రజా పరిషత్‌లు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు నెలలు కావస్తున్నా నిధుల లేమితో అభివృద్ధి పనులేమీ చేయలేకపోతున్నామని ఎంపీపీ అధ్యక్షులు నిట్టూరుస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మండలాలకు ఒక్కరూపాయి కూడా రాలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో పోటీకి దిగిన సమయంలో అవి చేస్తాం..ఇవి చేస్తామంటూ వాగ్దానాలిచ్చారు. గెలుపొందిన వారికి మాత్రం ఏం చేద్దామన్నా నిధుల కొరత అడ్డుగా మారింది. గత నెల 4న పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిధుల విషయంలో మండలాల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.
ప్రజల వద్దకు పాలన, అధికార వికేంద్రీకరణ, సత్వర అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ.రామారావు 1989లో మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిధులు ఉంటేనే మండల ప్రజా పరిషత్‌ల అధ్యక్షులు గ్రామాలకు ఏదైనా అభివృద్ధి చేయగలుగుతారు. ఖాళీ ఖజానాలే కొత్త నేతలకు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో మొత్తం 25 మండలాలున్నాయి. వీటిలో మే 6,10,14 తేదీల్లో విడతల వారీగా ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గెలుపొందిన ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులను ఎన్నుకున్నారు. ఎన్నికైన వారిలో 90 «శాతం మంది కొత్త వారే కావడం గమనార్హం.
ఎంతో అభివృద్ధి చేస్తామని పదవులను అధిష్టించినప్పటికీ నిధులు లేమితో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడిపోయారు. ఇదిలా ఉండగా రిజిస్ట్రేషన్ల ద్వారా స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయం అర్బన్ మండలాల్లో కాస్త ఎక్కువగా వస్తున్నా గ్రామీణ మండలాల్లో మాత్రం అతి తక్కువగా వస్తోందని పలువురు మండల పరిషత్ అధ్యక్షులు వాపోతున్నారు. సీనరేజీ, స్టాంప్ డ్యూటీలు మాత్రమే మండల పరిషత్‌లకు ఆదాయ వనరులుగా ఉన్నాయి. ప్రత్యేక నిధులంటూ ఏమీ లేకపోవడంతో అలంకార ప్రాయంగా తయారయ్యాయి.
వచ్చింది అరకొరనే..
జిల్లాలోని మండలాలకు ఐదేళ్లలో అరకొర నిధులే వచ్చాయి. మండల ప్రజా పరిషత్‌లకు ప్రభుత్వం నుంచి తలసరి ఆదాయం (రూ. 8 ఫర్‌క్యాపిటా) ప్రకారం జనాభా ప్రాతిపదికన మూడు నెలలకొకసారి ఏడాదిలో నాలుగుసార్లు నిధులు విడుదలవుతాయి. వీటితో పాటుగా ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. మండల ప్రజా పరిషత్‌లకు 13వ ఆర్థిక సంఘం నిధులు అరకొరగానే వచ్చాయి. కాగా 14వ ఆర్థిక సంఘం నిధులను డైరెక్ట్‌గా పంచాయతీలకే కేటాయించారు. ఇవి గాకుండా సీనరేజీ రుసుముల కింద 25:50:25 నిష్పత్తి మేరకు పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌లకు కేటాయింపులు జరుగుతాయి. ఈ లెక్కన ఒక్కో మండలానికి గత ఐదేళ్లలో రూ. 5–20 లక్షల లోపు నిధులు మాత్రమే విడుదలయ్యాయి.
వీటిలో 35 శాతం అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మండలాలకు మంజూరయ్యే నిధులకు భారీగా కోత విధించడంతో ఆశించిన అభివృద్ధి జరగలేదు. ఎంపీటీసీ సభ్యులే ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. ఐదేళ్ల పదవీకాలంలో కొందరు ఎంపీటీసీ సభ్యులు ఒక్క పని కూడా చేయలేకపోయారంటే నిధుల కొరత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. తక్కువ జనాభా ఉన్న మండల పరిషత్‌లకు రూ.లక్ష లోపు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. కొత్తగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తే తప్ప ఏ పనులు చేపట్టలేని దయనీయ పరిస్థితి మండలాల్లో ఉంది. నిలిచిపోయిన నిధులను గతంలో కేంద్ర ప్రభుత్వం బీఆర్‌జీఎఫ్ పేరిట ప్ర«త్యేకంగా కేటాయించేది.
ఈ నిధులను గత ప్రభుత్వం రద్దు చేసింది. వీటి స్థానంలో మళ్లీ ఏ నిధులూ విడుదల కాలేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఏడాదిలో రెండు సార్లు మంజూరు అవుతుంటాయి. మండలాలను బట్టి రూ. 50 వేలు నుంచి రూ. 2 లక్షల వరకు కేటాయిస్తారు. ఇవి కూడా మూడేళ్లుగా రావడం లేదు. సీనరేజీ నిధులు సంబంధిత శాఖనే నేరుగా పంచాయతీలకు కేటాయిస్తుండటంతో అవి కూడా మండలాలకు అందకుండా పోయాయి. గత ఏడాది అసలే నిధులు రాలేదు. మండల పాలకవర్గాలు ఏర్పాటు చేసిన తరువాత ఆర్థిక వనరులు సమకూరిస్తే ప్రయోజనం ఉంటుంది. లేనట్లయితే గతంలో మాదిరిగా ఎంపీటీసీ సభ్యులతోపాటు మండలాధ్యక్షులు సైతం నిధులు, విధులు లేక ఖాళీగా ఉండాల్సి వస్తుంది.
ఎంపీ, ఎమ్మెల్యేలే దిక్కు..
మండల పరిషత్ ద్వారా అభివృద్ధి పనులు చేయాలంటే ఎంపీ, ఎమ్మెల్యేల ద్వారా కేటాయించే నిధులే దిక్కయ్యే పరిస్థితి నెలకొంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ల లో అభివృద్ధి పనులకు ఖర్చు చేసేందుకు (సీడీఎఫ్) శాసనసభ, లోక్‌సభ సభ్యులకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తారు. వీళ్లు మండల నేతల ప్రాతినిధ్యం మేరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. గతంలో కొన్ని మండల పాలకవర్గాలు తమ పరిధిలో పనులు చేయించేందుకు వాళ్ల ద్వారా నిధులు తీసుకునేవారు. ప్రస్తుతం సీడీఎఫ్ (నియోజకవర్గ అభివృద్ధి నిధులు) కూడా విడుదల కాలేదు.
నిధులుంటేనే అభివృద్ధి
నిధులు ఉంటేనే ఏదైనా అభివృద్ధి పని చేయడానికి సాధ్యమవుతుంది. స్థానిక సంస్థలకు విరివిగా నిధులివ్వాలి. స్థానిక సంస్థలకు త్వరలో నిధులు, విధులు, అధికారాలు ఇస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. గ్రామాలకు వెళ్లినప్పుడు సమస్యల గురించి ప్రజలు, ప్రజాప్రతినిధులు విన్నవిస్తున్నారు. వాటిని పరిష్కరించాలంటే నిధులు కావాలి. మండల పరిషత్‌లకు ప్రభుత్వం నిధులను విడుదల చేయాలి. అప్పుడే ఏదైనా అభివృద్ధి పని చేయడానికి వీలవుతుంది.
– మనోజ్‌రెడ్డి, ఎంపీపీ అధ్యక్షుడు, కొండాపూర్
Comments
Please login to add a commentAdd a comment