సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా పరిషత్ రాజకీయం కొత్త మలుపు తిరిగింది. జెడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఏకంగా వారం రోజుల పాటు వాయిదాపడడంతో ఆయా పార్టీల్లో మరింత ఉత్కంఠ పెరిగింది. మొత్తం 33 జెడ్పీటీసీలకుగాను కాంగ్రెస్ 14, టీఆర్‌ఎస్ 12, టీడీపీ 7 స్థానాలను కైవసం చేసుకున్నాయి. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల అనంతరం మారిన సమీకరణల నేపథ్యంలో నవాబుపేట జెడ్పీటీసీ యాదవరెడ్డి టీఆర్‌ఎస్ పక్షాన చేరారు. దీంతో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు సంఖ్యాబలం సమానమైంది.
ఆదివారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజేంద్రనగర్ జెడ్పీటీసీ ముంగి జ్యోతి జైపాల్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర మంత్రులు మహేందర్‌రెడ్డి, ఈటెల రాజేందర్‌ల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. దీంతో జెడ్పీలో టీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్య 14కు చేరింది. ఇక జెడ్పీ పీఠం మాదే అనే ధీమా టీఆర్‌ఎస్ నేతల్లో పెరిగింది.
‘వాయిదా’ తెచ్చిన తంటా
జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునే క్రమంలో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు జతకట్టాయి. పదవీకాలాన్ని విభజించి ఇరు పార్టీలు పంచుకునే ఒప్పందంతో ఒక్కటైన వాటికి కొత్త చిక్కులు వచ్చాయి. వాస్తవానికి ఈ రెండు పార్టీలు కలిస్తే జెడ్పీ కుర్చీ కైవసం చేసుకోవడం నల్లేరు మీద బండి నడకే. ఇందులో భాగంగా శనివారం నాటి ఎన్నిక ప్రక్రియపై కాంగ్రెస్, టీడీపీలు ధీమాగా ఉన్నాయి. కానీ మెజార్టీ సభ్యులు ఎన్నికకు గైర్హాజరయ్యారు.
కోరం లేని కారణంగా ఎన్నికను ఏకంగా వారం పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ వాయిదా వ్యవహారం ఆ పార్టీలకు గుబులు పుట్టిస్తోంది. సభ్యుల గోడ దూకే అవకాశం ఉండడంతోఅన్ని పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన రాజేంద్రనగర్ జెడ్పీటీసీ ముంగి జ్యోతి భర్త జైపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్ కండువా వేసుకున్నారు. మాజీ మంత్రి సబిత అనుచరుల్లో ఒకరైన జైపాల్‌రెడ్డి, ఆయన సతీమణి రాజేంద్రగనగర్ జెడ్పీటీసీ జ్యోతి పార్టీ మారడం.. ఆమె అనుచరులుగా ఉన్న మరో ఇద్దరు జెడ్పీటీసీలు సైతం పార్టీ మారే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి.
బలపడిన టీఆర్‌ఎస్..
మారుతున్న సమీకరణలతో తెలంగాణ రాష్ట్ర సమితికి ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం టీఆర్‌ఎస్ సం ఖ్యాబలం 14కు చేరింది. దీంతో జెడ్పీలో మెజార్టీ స్థానాలున్న పార్టీగా ఎదిగింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు ఇంకా ఏడు రోజులు గడువుండడంతో.. పీఠాన్ని దక్కించుకునేందుకు ఆ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలువురు టీడీపీ, కాంగ్రెస్ జెడ్పీటీసీలతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
కానీ ఇలాంటివేవీ లేవంటూ కాంగ్రెస్, టీడీపీలు ప్రకటనలు చేస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థి జంగారెడ్డి పేరును కొందరు సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
గులాబీ జోరు
Published Sun, Jul 6 2014 11:32 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement