
కొలువుదీరనున్న కొత్త ‘పరిషత్’
మూడేళ్లకు పైగా విరామం తర్వాత.. జిల్లా పరిషత్ పాలకవర్గం ఆదివారం కొలువుదీరనుంది. అంతకు ముందు జెడ్పీ సమావేశం 2011 జూన్ 27న జరిగింది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :మూడేళ్లకు పైగా విరామం తర్వాత.. జిల్లా పరిషత్ పాలకవర్గం ఆదివారం కొలువుదీరనుంది. అంతకు ముందు జెడ్పీ సమావేశం 2011 జూన్ 27న జరిగింది. రాష్ట్ర, జిల్లాస్థాయిలలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో.. ఆదివారం జరగనున్న జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం తొలి సర్వసభ్య సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశాలకు ఆదివారం సెలవు కావడంతో దాదాపు జిల్లా ఎమ్మెల్యేలంతా సమావేశానికి హాజరవుతున్నారు.
జరిగేది తొలి సమావేశమే అయినా ప్రజల సమస్యలపై ఎలుగెత్తేందుకు ప్రతిపక్షం సిద్ధమవుతోంది. గత నెల 5న జెడ్పీ పాలకవర్గం ఏర్పాటైన తరువాత ప్రమాణ స్వీకారంతో సభను ముగించారు. కొత్త పాలకవర్గం ఏర్పాటయ్యాక జరుగుతున్న తొలి సర్వసభ్య సమావేశమే సమస్యల సెగతో వేడెక్కే అవకాశం ఉంది. ఉదయం 10.30 గంటలకు స్థాయీ సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అనంతరం సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్ నామన రాంబాబు అధ్యక్షతన జరగనుంది. సమావేశంలో వ్యవసాయ, ఉద్యానవన తదితర 40 శాఖల అంశాలను, మరో మూడు తీర్మానాలను అజెండాలో చేర్చారు.
జిల్లాలో 38 సమగ్ర మంచినీటి సరఫరా పథకాల నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.2,618.18 లక్షలతో ప్రతిపాదించారు. కాకినాడ మేడలైన్ ఏరియాలో 2000 చదరపు గజాల జెడ్పీ స్థలాన్ని ఎన్టీఆర్ ట్రస్టు భవన నిర్మాణ ం నిమిత్తం లీజుకుఇవ్వాలన్న జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి అభ్యర్థననూ, చైర్‌పర్సన్‌కు కొత్త ఇన్నోవా కారు కొనుగోలు అంశాన్నీ అజెండాలో చేర్చారు.జెడ్పీకి చెందిన రెండు ఎకరాల లీజుకు అధికారపక్షం చేసిన ప్రతిపాదనపై ఆసక్తికరమైన చర్చకు తెరలేవనుంది. ట్రస్టు పేరుతో టీడీపీ కార్యాలయానికి ఆ భూమిని అప్పగిస్తే ఇప్పటికే అక్కడ జీప్లస్-2 ఇళ్ల కోసం జెడ్పీ ఉద్యోగులు పెట్టుకున్న ప్రతిపాదన, కమ్యూనిటీ హాలు, పాఠశాల, హాస్టల్ నిర్మాణం కోసం స్థానికులు ఎప్పటి నుంచో అక్కడ చేస్తున్న డిమాండ్‌లు ఏమవుతాయో సభలో తేలనుంది.
ప్రతిధ్వనించనున్న ప్రజా సమస్యలు..
అజెండాతో సంబంధం లేకుండా పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లేందుకు వైఎస్సార్ సీపీకి చెందిన ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్ సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్టీ జెడ్పీటీసీ సభ్యులతో ఆయన శనివారం చర్చించారు.
మెట్ట ప్రాంత మండలాల్లో శివారు ఆయకట్టుకు నీరందక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. నాట్ల సమయం పూర్తి అయిపోయినా పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా మెట్ట ప్రాంతంలో శివారు ఆయకట్టుకు నీరు సరఫరా కాక వరి పంట ప్రశ్నార్థకంగా మారినా పట్టించుకోని అధికారులు నిర్లక్ష్యాన్ని ఎండగట్టనున్నారు.
35 వేల ఎకరాలకు నీరందించే చాగల్నాడు ఎత్తిపోతల పథకం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారిన విషయాన్ని ఎత్తిచూపనున్నారు. రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో ఆయకట్టుకు నీరందించే ఈ పథకం నుంచి మూడు రోజులుగా నీటి విడుదల నిలిచిపోయినా పట్టించుకున్న వారే కరువయ్యారు. రూ.7 కోట్లు వ్యయం కాగల ప్రతిపాదనలకు అతీగతీ లేకపోవడం, ఫ్యూజు పోయినా కనీసం వేసే వారే లేకపోవడాన్ని ప్రతిపక్షం నిలదీయనుంది.
వర్షాభావ పరిస్థితులు, అటకెక్కిన రుణమాఫీతో పంట రుణాలు అందక డెల్టా, మెట్ట మండలాల్లో రైతాంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు, రుణమాఫీకి ప్రధాన అడ్డంకిగా మార్చిన జీఓ:174 సవరణకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని రైతాంగం కోరుతోంది.
జిల్లా అంతటా ప్రధాన సమస్యగా మారిన ఆక్వా చెరువుల వ్యవహారాన్ని కూడా చర్చించాలని రైతులు కోరుతున్నారు. సాగుభూముల్లో అనుమతులు లేకుండా చేస్తున్న ఆక్వాసాగును నియంత్రించాలంటున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో విద్యార్థులు భోజనం చేసేందుకు చాలా పాఠశాలల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులూ చర్చకు రానున్నాయి. జీతాలు పెంచుతామని ఎన్నికల్లో చెప్పి ఇప్పుడు అడ్డగోలుగా జిల్లాలో వందమందికి పైగా కార్యకర్తలపై వేటు వేయడంపై సభ్యులు చర్చించాలని అంగన్‌వాడీలు కోరుతున్నారు.