భారత్‌ పరివర్తన్‌ మిషన్‌గా బీఆర్‌ఎస్‌ | CM KCR Says BRS as Bharat Parivartan Mission | Sakshi
Sakshi News home page

భారత్‌ పరివర్తన్‌ మిషన్‌గా బీఆర్‌ఎస్‌

Published Thu, Apr 27 2023 4:20 AM | Last Updated on Thu, Apr 27 2023 10:56 AM

CM KCR Says BRS as Bharat Parivartan Mission - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో గుణాత్మక మార్పు కోసం భారత్‌ రాష్ట్ర సమితి ‘భారత్‌ పరివర్తన్‌ మిషన్‌’గా పని చేస్తుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. మే 7 నుంచి జూన్‌ 7 వరకు నెల రోజుల్లో మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్‌ఎస్‌ కమిటీలు వేస్తామని, జూన్‌లో 10 లక్షల నుంచి 12 లక్షల మంది రైతులతో భారీ కిసాన్‌ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.

నాగపూర్, ఔరంగాబాద్‌లో బీఆర్‌ఎస్‌ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మహారాష్ట్రను తీర్చిదిద్దుతామని, ఓట్లు వేస్తేనే ఎవరైనా సహాయం చేయగలరు అంటూ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్, యావత్మాల్, గడ్చిరోలి ప్రాంతాలకు చెందిన వివిధ పార్టీల నేతలు బుధవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. 

దేశ సంస్కరణ లక్ష్యంతో ముందుకు..  
‘దేశంలో ఎన్నో పార్టీలు, ఎందరో రాజకీయ నాయకులు, ఎన్నో ప్రాంతీయ, జాతీయ పార్టీలున్నా.. దేశ పరిస్థితులపై అవగాహన ఉన్నా సరైన రీతిలో స్పందించడం లేదు. మనది వింత దేశం, ప్రజలు కూడా వింతైన వారు. మనం కుట్రలో ఇరుక్కుపోవడానికి గల కారణాలను చర్చించాలి. ఎన్నికల కోసమో, ఎవరినో నాయకుడిని చేయాలనే లక్ష్యంతోనో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించలేదు.

భారతదేశాన్ని సంస్కరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. దేశంలో అపూర్వ సంపద ఉన్నా నీరు, విద్యుత్తు వంటి సమస్యలను తెలంగాణ మినహా మహారాష్ట్ర సహా యావత్‌ దేశం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆనకట్టల ద్వారా నీటిని బంధించి, తాగునీరు, సాగు నీరు ఇవ్వడం ద్వారా రైతులు సిరిసంపదలతో తులతూగేలా చేసే లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది..’అని కేసీఆర్‌ అన్నారు. 

మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు ఎందుకు? 
‘మహారాష్ట్ర పుణ్యభూమిలో గోదావరి, కృష్ణా,    వెన్‌గంగ, పెన్‌గంగ, వార్ధా, మూల, ప్రవర,పంచగంగ, మంజీర, భీమా లాంటి ఎన్నో నదులు పుడుతున్నాయి. అయినా ఔరంగాబాద్‌లో ఎనిమిది రోజులకోసారి తాగునీరు అందిస్తున్నారు. అకోలాలోనూ ఇలాంటి పరిస్థితే ఉండాల్సిన ఆగత్యం ఎందుకు? మహారాష్ట్రలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? తెలంగాణలో మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు, వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్నాం.  

అవినీతి నేతలే దివాళా తీస్తారు.. 
తెలంగాణలో అమలవుతున్న ఈ పథకాలు మహారాష్ట్రలో అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని పుకార్లు పుట్టిస్తున్నారు. కానీ మేము ఏండ్లుగా అమలు చేస్తున్నా తెలంగాణ ఆర్థికంగా బాగానే ఉంది. మహారాష్ట్ర కంటే చిన్న రాష్ట్రం కావడంతో పాటు ఆర్థికంగా మహారాష్ట్ర తర్వాతే నిలిచే రాష్ట్రమైన తెలంగాణ దివాళా తీయనప్పుడు మహారాష్ట్ర ఎలా దివాళా తీస్తుంది? అవినీతికి పాల్పడే నాయకులే దివాళా తీస్తారు.ౖమహారాష్ట్రలో భూ క్రయవిక్రయాల్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు తెలిసింది. తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను సంస్కరించి, పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అంతా ముగిసేటట్లుగా విధానాలు తీసుకొచ్చాం..’అని తెలిపారు. 

ఫడ్నవీస్‌ నుంచి జవాబు లేదు 
‘మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ఏం పని అని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ అన్నారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్‌ అమలు చేస్తే మధ్యప్రదేశ్‌కు వెళ్లిపోతామని చెబితే ఇప్పటివరకు ఫడ్నవీస్‌ నుంచి సమాధానం లేదు. తెలంగాణలో సాధ్యమైనవన్నీ మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కావు? అని ప్రజలు ప్రశ్నించుకోవాలి..’అని కేసీఆర్‌ అన్నారు.  

పెద్ద సంఖ్యలో చేరికలు 
బీఆర్‌ఎస్‌లో చేరిన మహారాష్ట్ర నేతల్లో ఆల్‌ ఇండియా డీఎన్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు, ఒబీసీ వెల్ఫేర్‌ సంఘ్‌ నాయకుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆనంద్‌ రావ్‌ అంగళ్వార్, వంచిత్‌ ఆఘాడీ ఉమెన్, చంద్రాపూర్‌ బంజారా ఉమెన్‌ అధ్యక్షురాలు, ఎమ్మెల్యేగా పోటీచేసిన రేష్మ హాన్‌ ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొ.బల్బీర్‌ సింగ్‌ గురు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌ సింగ్‌ సలూజా, గడ్చిరోలి మాజీ జెడ్పీ చైర్మన్‌ పసుల సమ్మయ్య, గడ్చిరోలి మాజీ జడ్పీ సభ్యులు సంజయ్‌ చర్దుకె, యువ స్వాభిమాన్‌ పార్టీ రజురా జిల్లా అధ్యక్షుడు సూరజ్‌ థాకరే, చంద్రాపూర్‌ డీసీసీ అధ్యక్షుడు దిలీప్‌ పల్లేవార్, బిర్సాముండా క్రాంతిదళ్‌ అధ్యక్షుడు సంతోష్‌ కులమతే, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కంపెల్లి మల్లేష్, ఆప్‌ బల్లార్పూర్‌ విభాగ్‌ అధ్యక్షుడు ప్రశాంత్‌ గడ్డల, భారత్‌ ముక్తి మోర్చా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శనిగరపు శంకర్, యువ స్వాభిమాన్‌ పార్టీ కార్యదర్శి ఆదిత్య భాకె, శివసేన గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు మిలింద్‌ భాసర్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు.

చంద్రాపూర్‌ డీసీసీ మాజీ అధ్యక్షుడు అరికిల్ల హనుమంతు, డబ్ల్యూసీఎల్‌ ఐటీటీయూసీ అధ్యక్షుడు నర్సింగ్‌ రాజం దొంత, విదర్భ తెలుగు సమాజ్‌ ప్రధాన కార్యదర్శి రాజేషం పుల్లూరి, తేలి సమాజ్‌ జిల్లా అధ్యక్షుడు రవి జుమ్డే, విదర్భ ముక్తి మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ తిరమల్‌ ముంజమ్, శివసేన పార్టీ రాజుర పట్టణ అధ్యక్షుడు రాకేష్‌ చికుల్వార్, శివసేన బల్లార్షా అధ్యక్షుడు సన్నీ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వెరెన అజ్మీరా, యువ స్వాభిమాన్‌ గడ్చిరోలి ఉపాధ్యక్షుడు అజయ్‌ చన్నే, చంద్రాపూర్‌ డ్రైవర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌ వ్యవస్థాపకుడు అభిలాష్‌ సింగ్‌తో పాటు మరో నలభై మందికి పైగా నేతలు కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement