సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా పాత జిల్లా పరిషత్‌ల విధానమే కొనసాగనుంది. ప్రస్తుత జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల పదవీకాలం ముగిసే వరకు పాత జిల్లాల విధానంలోనే ఆయా పదవుల్లో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగో తేదీ నుంచి ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రస్తుత జిల్లా ప్రజా పరిషత్‌ల పదవీ కాలం ముగిసే వరకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వాటి పరిధి, అధికారాలపై కొత్త జిల్లాల ఏర్పాటు ఎలాంటి ప్రభావం చూపదు అని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
2026 సెప్టెంబరు వరకు..
గతేడాది సెప్టెంబర్ 25న రాష్ట్రంలో జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుత జిల్లా పరిషత్‌ల పదవీ కాలం 2026 సెప్టెంబరు 24 వరకు ఉంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్పటి వరకు పాత జిల్లాల ప్రాతిపదికనే జిల్లా పరిషత్‌ల పాలన కొనసాగనుంది. పాత జిల్లాల ప్రాతిపదికనే జెడ్పీ సీఈవో కార్యాలయాలు కొనసాగుతాయి. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలలో జెడ్పీ కార్యాలయాలు ప్రత్యేకంగా ఉండవు. అడ్వకేట్ జనరల్ సూచనల మేరకు న్యాయ వివాదాలు తలెత్తకుండా జిల్లా పరిషత్తులపై ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
తెలంగాణలోనూ..
తెలంగాణలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. తెలంగాణలో 2016లో దసరా రోజు కొత్త జిల్లాలు ఏర్పాటు కాగా అప్పటికి జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరిగి రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. దీంతో 2014లో ఎన్నికైన జెడ్పీ చైర్మన్లే 2019లో పూర్తి పదవీకాలం ముగిసే వరకు కొనసాగారు. 2019లో జెడ్పీటీసీ ఎన్నికలకు ముందు మాత్రమే 33 జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్‌లను విభజించి ఎన్నికలు నిర్వహించారు.
ఇది చదవండి: ఏపీలో కొత్త డివిజన్లకు ఆర్‌డీవోల నియామకం
Comments
Please login to add a commentAdd a comment