నంబర్ గేమ్! | elections notification released for chairman positions | Sakshi
Sakshi News home page

నంబర్ గేమ్!

Published Fri, Jun 27 2014 11:11 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నంబర్ గేమ్! - Sakshi

నంబర్ గేమ్!

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో రాజకీయం వేడెక్కింది. స్థానిక సంస్థల సారథుల ఎంపికకు ముహూర్తం ఖరారుకావడమే తరువాయి.. రాజకీయపక్షాలు ‘కుర్చీలాట’లో పైచేయి సాధించేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. నంబర్‌గేమ్‌లో ముందు వరుసలో ఉండేం దుకు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. మున్సిపాలిటీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో శుక్రవారం ప్రధాన పార్టీలు అంతర్గత సమావేశాల్లో బిజీగా గడిపాయి. సొంత పార్టీ సభ్యులను క్యాంపులకు తరలించడం మొదలు ఇతర పార్టీల సభ్యుల మద్దతు కూడగట్టే అంశంపై చర్చోపచర్చలు సాగించాయి.
 
మండలాల్లో పాగా వేసే దిశగా వ్యూహారచన చేస్తున్న ఆశావహులు.. ఎంపీటీసీలను మరోసారి యాత్రలకు పంపారు. స్థానిక సంస్థల పీఠాలను కైవసం చేసుకునే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్న అధిష్టానాలు.. సొంత పార్టీ సభ్యులను కాపాడుకునే బాధ్యత కూడా వారికే కట్టబెట్టారు. నగర పంచాయతీ/మున్సిపాలిటీల చైర్మన్ల ఎంపికపై టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్నాయి. పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నంలో స్పష్టమైన అధిక్యత లభించడంతో ఈ రెండింటి చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. బడంగ్‌పేటలో కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ లభించింది. అలాగే తాండూరులో టీఆర్‌ఎస్, మజ్లిస్‌లు పోటాపోటీగా కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్నాయి.
 
ఎన్నికల అనంతరం ఈ ఇరుపార్టీల మధ్య బంధం బలపడిన నేపథ్యంలో ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించే వాతావరణం కనిపిస్తోంది. ఇక వికారాబాద్‌లో మాత్రం ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అత్యధిక సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలను అనుకూలంగా మలుచుకునే దిశగా టీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది. టీడీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న ఆ పార్టీ.. ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఓటు హక్కు కలిగియున్న ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా వికారాబాద్ మున్సిపాలిటీనే ఆఫ్షన్‌గా ఇచ్చారు. దీంతో సంఖ్యాబలం అటు ఇటు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
 
జోరుగా మంతనాలు!
సుదీర్ఘ విరామం తర్వాత అత్యధిక జెడ్పీటీసీలు సాధించిన కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా జిల్లా పరిషత్ పీఠాన్ని అధిరోహించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే  రంగంలోకి దిగిన ఆ పార్టీ అగ్రనేతలు విభేదాలు పక్కనపెట్టి శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఆ పార్టీ చైర్మన్ అభ్యర్థి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రసాద్‌కుమార్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డితో సమావేశమైన సీఎల్‌పీ నేత జానారెడ్డి.. ఎట్టి పరిస్థితుల్లో జెడ్పీ చేజార్చుకోవద్దని తేల్చిచెప్పారు. సొంత పార్టీ సభ్యులను సమన్వయపరిచే బాధ్యతను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్‌లకు అప్పగించిన జానా.. ఇతర పార్టీల మద్దతు కూడగట్టే అంశాన్ని కేఎల్లార్‌కు కట్టబెట్టారు. మరోవైపు శంషాబాద్‌లో ఆ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు సమావేశమై.. తాజా పరిణామాలను చర్చించుకున్నారు. యాదవరెడ్డి తప్పుకుంటే బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నానని ఎనుగు జంగారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో హైకమాండ్‌తో ఈ అంశంపై శనివారం చర్చించాలని నిర్ణయించారు.
 
కాగా, మంచిరెడ్డితో భేటీ అయిన కేఎల్లార్, ప్రసాద్‌లకు స్పష్టమైన హామీ లభించలేదు. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అంశంపై పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ముందు మీ పార్టీలో ఏకాభిప్రాయం సాధించండి.. అప్పుడు మా నిర్ణయాన్ని వెల్లడిస్తామని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇదిలావుండగా.. జిల్లా పరిషత్ కుర్చీ దక్కించుకునేందుకు దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్.. కాంగ్రెస్, టీడీపీల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. కాంగ్రెస్‌లో అనైక్యతతో మేజిక్ ఫిగర్‌ను సాధిస్తామని భావిస్తున్న ఆపార్టీ.. టీడీపీలో ఒక వర్గం తమకు అనుకూలంగా ఉంటుందని అంఛనా వేస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలతో మంత్రి పి.మహేందర్‌రెడ్డి చర్చించినట్లు తెలిసింది. సాధ్యమైనంతవరకు అధిక సంఖ్యలో మండల పరిషత్‌లను కైవసం చేసుకునే దిశగా వ్యూహరచన చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement