సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఏ పార్టీకీ స్పష్టమైన అధిక్యత రాకపోవడంతో కొత్త సమీకరణలకు తెరలేస్తోంది. జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు నువ్వా నేనా అన్నట్లు తలపడినా నిర్దేశిత సంఖ్యాబలాన్ని సాధించలేకపోయాయి. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 14 జెడ్పీటీసీలను గెలుచుకోగా, టీఆర్‌ఎస్ 12 స్థానాల్లో విజయం సాధించింది. ఇక మూడు దశాబ్దాలపాటు జెడ్పీని ఏలిన తెలుగుదేశం ఏడు స్థానాలతో ఈ సారి మూడో స్థానానికి పరిమితమైంది. మరోవైపు జెడ్పీ కుర్చీకి అవసరమైన 17 జెడ్పీటీసీల సంఖ్యాబలాన్ని సమకూర్చుకోవడం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు ఇబ్బందికరంగా మారింది.
ఈ నేపథ్యంలో జెడ్పీ గద్దెను అధిరోహించాలంటే ఏదో పార్టీ మద్దతు తప్పనిసరి. దీంతో అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్ పార్టీలు టీడీపీ మద్దతుపై కన్నేశాయి. మరోవైపు చైర్మన్ రేసులో ఉన్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సహా టీడీపీ కూడా తమ జెడ్పీటీసీలను శిబిరాలకు తరలిస్తోంది. ప్రత్యర్థులకు చిక్కకుండా.. సొంత సభ్యులను కాపాడుకునేందుకు అన్ని పార్టీలు క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేశాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీల అగ్రనేతలు ఆయా పార్టీల జెడ్పీటీసీలతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించారు.
కొత్త సమీకరణలు!
ప్రతిష్టాత్మక జెడ్పీ చైర్మన్ గిరిని దక్కించుకోవాలనుకున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు త్రిశంకు ఫలితాలు రావడంతో కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మేజిక్ ఫిగర్‌ను చేరుకునేందుకు టీడీపీ ఒక్కటే కనిపిస్తుండడంతో ఆ పార్టీని చేరదీసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. బద్ధశత్రువైన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే విషయంలో ‘దేశం’ వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నా, ఇప్పుడిప్పుడే జిల్లాలో బలీయశక్తిగా ఎదుగుతున్న టీఆర్‌ఎస్‌ను నిలువరించాలంటే చిరకాల శత్రువుతోనైనా చెలిమి మంచిదనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకునేందుకు టీడీపీ మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.
అయితే, శుక్రవారం వెలువడే సార్వత్రిక ఫలితాలు, ఆ తర్వాత ఏర్పడే ప్రభుత్వాన్ని పరిగణనలోకి తీసుకున్న అనంతరమే జెడ్పీలో ఎవరికి మద్దతివ్వాలన్న విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు టీడీపీతో జతకట్టేందుకు కాంగ్రెస్ సంకేతాలిస్తోంది. టీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలంటే తమతో దోస్తీ కట్టాలని సూచిస్తోంది. తద్వారా కారు జోరుకు బ్రేకులు వేయవచ్చని చెబుతోంది. ఈ తరుణంలో జెడ్పీలో మద్దతు కోసం సంప్రదింపులు మొదలుపెట్టింది. చైర్మన్ పదవికి సహకరిస్తే వైస్ చైర్మన్ పదవి ఇస్తామని ఆఫర్‌ను ప్రకటించింది. ఇదే తరహాలో మండల పరిషత్‌లలోనూ పదవుల పంపకాలను చేసుకుందామని ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
మేడ్చల్‌లో ఎంపీపీ పదవి టీడీపీకి దక్కేలా సహ కరిస్తామని, ఘట్‌కేసర్‌లో చెరో రెండున్నరేళ్లు పద విని పంచుకునేలా ప్రతిపాదనలను ఇరుపార్టీలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా, టీడీపీ సహకారంతో జెడ్పీని కైవసం చేసుకునే అంశంపై కాంగ్రెస్‌లో భిన్నస్వరాలు వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధిపత్య పోరు నేపథ్యంలో ఒకవర్గం ఈ ప్రతిపాదనలు తెస్తోందని, ఇది ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో ఇప్పుడే చెప్పలేమని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇదిలావుండగా, టీఆర్‌ఎస్ ఆకర్షణలకు లొంగకుండా టీడీపీ సభ్యులను కూడా తమ కనుసన్నల్లోనే క్యాంపులకు తరలించే ఏర్పాట్లను కాంగ్రెస్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టీఆర్‌ఎస్ దూకుడు!
డజను జెడ్పీటీసీలను గెలుచుకున్న టీఆర్‌ఎస్ జోరుమీదుంది. జెడ్పీ సీటుకు అవసరమైన మరో ఐదుగురిని సమీకరించేందుకు ఇప్పటికే తెరవెనుక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రత్యర్థి శిబిరాల్లో తటస్థులను ఆక ర్షించడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని యోచిస్తోంది. జెడ్పీ చైర్‌పర్సన్‌గా సునీతా మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి దాదాపు గ్రీన్‌సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి మరోసారి క్యాంపు రాజకీయాలకు సన్నాహాలు చేస్తున్నారు. పాతమిత్రుల మద్దతు తమకే దక్కుతుందని గంపెడాశతో ఉన్న మహేందర్, టీడీపీలో చీలిక తేవడానికి వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే పలువురు జెడ్పీటీసీలతో మంతనాలు సాగించిన ఆయన కాంగ్రెస్ శిబిరంలో లుకలుకలను ఆసరాగా చేసుకొని జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎత్తుగడ వేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం నాడే జెడ్పీటీసీలను టూర్‌లకు తరలించాలని భావించినా, సభ్యులందరూ సమకూరకపోవడంతో వాయిదా వేశారు. ప్రధాన శత్రువైన కాంగ్రెస్‌తో జతకట్టేందుకు టీడీపీ ఆసక్తి చూపదని, ఒకవేళ బలవంతంగా ఆ పార్టీ అధిష్టానం ఆ నిర్ణయానికి వస్తే వ్యతిరేకించడం ద్వారా తమకు అండగా నిలుస్తారని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది.
దోస్త్ మేరా దోస్త్!
Published Thu, May 15 2014 12:04 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement