అమలాపురం : ‘సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది’అన్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీరు. కేంద్రం నుంచి వచ్చే నిధులతో చేపట్టే అభివృద్ధి పనులు తన ఖాతాలో వేసుకునేందుకు కొత్త పథకానికి తెర తీసింది. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా విడుదల కాదు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు నిలిపివేసి ఆ సొమ్ములకు త్వరలో వచ్చే 14వ ఆర్థిక సంఘం నిధులను, గ్రామ, మండల, జిల్లా పరిషత్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను కలిపి ఈ రోడ్లకు వినియోగించాలనుకుంటోంది.
తూర్పుగోదావరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గ్రామాల్లో విరివిగా సీసీ రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేజర్,మీడియం పంచాయతీల్లో కనీసం కిలో మీటరు నిడివితో సీసీ రోడ్ల నిర్మాణం చేయనున్నారు. పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం వరకు బాగానే ఉన్నా.. సీసీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయాపైసా కూడా విడుదల కాకపోవడం గమనార్హం. 13వ ఆర్థిక సంఘం నిధులతో ఇప్పుడు జరుగుతున్న పనులను అర్ధాంతరంగా నిలిపివేయాలని, త్వరలో విడుదల కానున్న 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, జెడ్పీ, మండల పరిషత్ నిధులతో సీసీ రోడ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది.
ఒక్క పైసా కూడా విడుదల చేయకుండా స్థానిక సంస్థలకు కేంద్రం వచ్చిన నిధుల మీద రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టకుండా వివిధ కారణాల వల్ల ఆలస్యమైన పనులు నిలిపివేయాలని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లు సర్క్యులర్ ఇవ్వాలని ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీరాజ్ శాఖమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. దాంతో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్ని పంచాయతీలకు సర్క్యులర్ జారీ చేయగా సర్పంచ్‌లు మండిపడుతున్నారు.
యూక్షన్ ప్లాన్ మాటున తమ వారికే పనులు..
గ్రామ పంచాయతీల్లో చేపట్టే సీసీ రోడ్ల నిర్మాణ పనులను గుర్తించి యాక్షన్ ప్లాన్ తయారు చేసి పంపించాల్సిందిగా సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఎంపీడీవోలు ఈ మేరకు పనులు గుర్తించి పంచాయతీరాజ్ శాఖకు పంపుతున్నారు. ఇప్పటికే చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు మండలాల వారీగా సర్పంచ్‌లకు, కార్యదర్శులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎంపిక చేసిన పనులు, నిధులపై ఆరా తీయడంతోపాటు, తమకు కావాల్సిన వారికి, నచ్చిన ప్రాంతాల్లో పనులు కట్టబెట్టేలా సిఫార్సులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు చాలా పంచాయతీల్లో ఇంకా ఖర్చు కాలేదు. గ్రామంలో జనాభాను బట్టి మనిషికి రూ.279 చొప్పున 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్నాయి. పంచాయతీని బట్టి రూ.2.50 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు రానున్నాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలో రూ.13 కోట్లకు పైగా నిధులు రానున్నాయి. వీటికి ఉపాధి హామీ పథకం, జెడ్పీ, మండల పరిషత్ నిధులు, పంచాయతీ నిధులు కలిపితే నియోజకవర్గంలో కనీసం రూ.15 కోట్లకు పైగా నిధులతో రోడ్ల పనులు చేపట్టే అవకాశముంది. ఇదే అధికార పార్టీ ఎమ్మెల్యేలను బాగా ఆకర్షిస్తోంది. ఎమ్మెల్యేలు లేని చోట టీడీపీ ఇన్‌చార్జిలు చెప్పిన చోట, వారు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే రోడ్లు వేయడానికి సిద్ధమవుతున్నారు.
స్థానిక సంస్థల నిర్వీర్యానికే..
ఇలా చేయడం ద్వారా ఎమ్మెల్యేలకు పలు రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఏసీడీపీ నిధులు విడుదల చేయడం మానేసింది. ఎన్నికై ఏడాది దాటినా తాము ఫలానా మేలు చేశామని చెప్పుకునేందుకు ఏమీ కనిపించడం లేదు. ప్రస్తుతం వివిధ నిధులతో చేపట్టే సీసీ రోడ్ల పనులు తామే చేయించామని చెప్పుకునేందుకు వీలు చిక్కుతోంది. పనుల కేటాయింపులకు సిఫార్సు లేఖలు ఇవ్వడం ద్వారా పర్సంటేజీలు రాబట్టుకోవచ్చు. ప్రతిపక్షానికి చెందిన సర్పంచ్‌లున్న చోట వారి ప్రణాళికతో సంబంధం లేకుండా తమ పార్టీ నాయకుల సిఫార్సుల మేరకు రోడ్లు ఎక్కడో నిర్ణరుుంవచ్చు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుందని, తద్వారా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని సర్పంచ్‌లు మండిపడుతున్నారు. దీనిపై అధికార పార్టీ సర్పంచ్‌లు కూడా ఆగ్రహంతో ఉండడం కొసమెరుపు.
అభివృద్ధి కుంటుపడుతుంది..
ఆర్థిక సంఘం నిధుల్ని ప్రభుత్వం సీసీ రోడ్లకు మళ్లిస్తే పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడుతుంది. ఇప్పటికే పంచాయతీలు నిర్వీర్యం అయిపోయాయి. కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతోనే తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ బిల్లులు కట్టుకుంటున్నాం. ఇప్పుడు వాటినీ లాక్కుంటే అవన్నీ కష్టమవుతారుు.
- నక్కా సంపత్‌కుమార్, సర్పంచ్,
ఈదరపల్లి, అమలాపురం రూరల్
రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు..
ఆర్థిక సంఘం నిధులపై పెత్తనం చలాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులేదు. ఈ నిధులు పంచాయతీల్లో పాలవర్గాల తీర్మానాల మేరకే ఖర్చు చేయాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్పంచ్‌లందరూ కలిసి తీర్మాణాలు చేయనున్నాం.
- బొంతు విజయకుమారి, సర్పంచ్,
ఇందుపల్లి, అమలాపురం రూరల్
‘బాటల’ మాటున బూటకం
Published Wed, Aug 12 2015 2:00 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM
Advertisement
Advertisement