అభివృద్ధే లక్ష్యం | Development goal | Sakshi
Sakshi News home page

అభివృద్ధే లక్ష్యం

Published Mon, Mar 16 2015 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

Development goal

నెల్లూరు(రెవెన్యూ) : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ నూతన భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జెడ్పీ సాధారణ సర్వ సభ్య సమావేశంలో చైర్మన్ మాట్లాడారు. రాబోవు ఎండకాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయామని ప్రభుత్వానికి నివేధికలు పంపామన్నారు. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు బోరింగులు మంజూరు చేయాలని అడుగుతున్నారన్నారు. నిధులు విడుదల చేస్తే కొత్త బోర్లు వేసేలాచర్యలు తీసుకుంటామన్నారు. తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు  ప్రాధాన్యం ఇస్తామన్నారు. సుమారు 200కుపైగా గ్రామాల్లో నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన లభ్ధిదారులందరకీ ఒకే విధంగా పేమెంట్లు చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన సకాలంలో సాగునీరు అందక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. అధికారులు సర్వే నిర్వహించి ఎండిన పంటల వివరాలు సేకరించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం మంజూరు చేయించేలా చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే సీజన్ ప్రారంభానికి ముందే సాగునీటి కాలువలకు మరమ్మతులు పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పింఛన్లు కొల్పోయిన లబ్ధిదారుల్లో అర్హులకు పునరుద్ధరించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ ఎం. జానకి మాట్లాడుతూ తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో వాహనాల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు సకాలంలో పేమెంట్లు చెల్లించేలా ఇప్పటి వరకు రూ.5 కోట్లు ఎంపీడీఓల అకౌంట్లలో జమ చేశామన్నారు. పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతక ముందు జిల్లా పరిషత్ నూతన భవన ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు.
 
ప్రొటోకాల్‌పై రగడ
గ్రామీణ ప్రాంతాల్లోని జెడ్పీ పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలకు జెడ్పీటీసీ సభ్యులను ఆహ్వానించడంలేదని సభ్యులు వాదనకు దిగారు. తమకు గౌరవం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ విషయంపై జెడ్పీలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ప్రొటోకాల్ పాటించని అధికారులు, పాఠశాలల హెచ్‌ఎంలపై చర్యలు తీసుకోవాలని సభ్యులు పట్టుపట్టారు. సభ్యులకు శాసనసభ్యులు మద్దతు తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ ఇకపై ప్రొటోకాల్ ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో సభ్యులు శాంతించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, జెడ్పీ సీఈఓ ఎం.జితేంద్ర, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ శిరిషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
జెడ్పీ గెస్ట్‌హౌస్ ప్రారంభం
నెల్లూరు(రెవెన్యూ): జెడ్పీ గెస్ట్‌హౌస్‌ను సొంత ఇంటిలా చూచుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఆధునీకరించిన జెడ్పీ గెస్ట్‌హౌస్‌ను ఆదివారం జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేళ్ల నుంచి జెడ్పీ గెస్ట్‌హౌస్ మూతపడిందన్నారు. తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత గెస్ట్‌హౌస్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గెస్ట్‌హౌస్‌లో ఉన్న పాత వాహనాలు, వస్తువులను విక్రయించామన్నారు. రూ.30 లక్షలు ఖర్చు చేసి గెస్ట్‌హౌస్‌ను ఆధునీకరించామని తెలిపారు.  ఆరు సూట్లు సిద్ధం  చేశామన్నారు.

దీనికి సంబంధించి రోజుకు రూ.500 అద్దె చెల్లించాల్సి ఉంటుందన్నారు. జెడ్పీటీసీ సభ్యులు పార్టీకలకతీతంగా పని చేసి జిల్లాను అభివృద్ధి పథంలో నిలపాలన్నాపారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ నగరం నడిబొడ్డులో ఇటువంటి గెస్ట్‌హౌస్ ఉండడం ఆనందంగా ఉందన్నారు.

నగరానికి వచ్చే సభ్యులు ఉండేందుకు అన్ని వసతులతో గెస్ట్‌హౌస్ అందుబాటులో తీసుకురావడం అభినందనీయమన్నారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు నిధులు లేక పనులు చేయలేకపోతున్నామన్నారు. చైర్మన్ జెడ్పీటీసీ సభ్యులకు నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. జెడ్పీ సీఈఓ ఎం.జితేంద్ర, డీఎంహెచ్‌ఓ డాక్టర్ భారతీరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement