
జిల్లా ప్రజానీకం, రాజకీయ నాయకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జిల్లా పరిషత్ త్వరలో ఏర్పాటు కానుంది. పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్న విధంగా నూతన జిల్లా పరిషత్ ఏర్పాటు కోసం చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్‌ను విభజించి కొత్తగా మెదక్, సిద్దిపేట జెడ్పీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును అధికారులు ప్రారంభించారు. ఈనెల 25వ తేదీలోగా నూతన జెడ్పీ, జెడ్పీటీసీలు, ఎంపీపీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ జెడ్పీ సీఈఓకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా పరిషత్ అధికారులు ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధం అవుతున్నారు.
సాక్షి, మెదక్: జిల్లా పరిషత్ సభ్యుల పదవీకాలం జూలైతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. నూతన జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణకు వీలుగా సాధ్యమైనంత త్వరగా కొత్త జెడ్పీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా మొదట మెదక్ జిల్లాలో కొత్త జెడ్పీటీసీలు, ఎంపీపీల ఏర్పాటు కోసం అధికార యంత్రాంగం ప్రతిపాదనలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 46 జెడ్పీటీసీలు, 46 మంది మండల పరిషత్ అధ్యక్షులున్నారు. కాగా కొత్తగా ఏర్పాటైన మెదక్ జిల్లా నుంచి ప్రస్తుతం 15 మంది జెడ్పీటీసీలు, 15 మంది ఎంపీపీలు జెడ్పీ సమావేశాలకు హాజరవుతున్నారు.
కాగా జిల్లాల పునిర్వభజన సమయంలో మండలాల సంఖ్య పెరిగింది. జిల్లాలో ఇది వరకు 15 మండలాలు ఉండగా కొత్తగా హవేళిఘణాపూర్, నిజాంపేట, చిలిపిచెడ్, నార్సింగి, మనోహరాబాద్ మండలాలు ఏర్పడ్డాయి. దీంతో మండలాల సంఖ్య 20కి చేరింది. కొత్త రెవెన్యూ మండలాల ఆధారంగా జిల్లాలో జెడ్పీటీసీల సంఖ్య కూడా 20కి చేరనుంది. అలాగే మండల పరిషత్‌లు కూడా 20 ఏర్పాటు కానున్నాయి. దీంతో పాటు ఎంపీటీసీల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీ) విభజన చేపట్టనున్నారు. 2011 జనాభా ఆధారంగా ఎంపీటీసీల విభజన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కొత్తగా ఐదు మండలాలు ఏర్పడినందున ఎంపీటీసీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఉద్యోగుల కేటాయింపు
కొత్తగా ఏర్పాటయ్యే జెడ్పీలకు ఉద్యోగుల కేటాయింపుపైనా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటు చేసే మెదక్, సిద్దిపేట జెడ్పీలకు ఉద్యోగులను కేటాయించనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖ జెడ్పీలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరిస్తోంది. జిల్లా పరిషత్ ఆధీనంలో మండల పరిషత్, గ్రామీణ నీటిసరఫరా, పంచాతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాలు పనిచేస్తున్నాయి. కాగా కొత్తగా జిల్లాల ఏర్పాటు సమయంలో మండల పరిషత్, గ్రామీణ నీటిసరఫరా, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను కొత్త జిల్లాలకు ఆపాయింట్ చేశారు. దీంతో మూడు శాఖల ఉద్యోగులు విభజన ప్రస్తుతం ఉండదని, కేవలం కొత్త జెడ్పీకి సీఈఓ, డిప్యూటీ సీఈఓ, సూపరింటెండెంట్లు, మినిస్టీరియల్ స్టాఫ్‌ను మాత్రమే నియమిస్తారని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, మినిస్టీరియల్ స్టాఫ్‌ను మాత్రమే మూడు జిల్లాలకు విభజించే అవకాశం ఉంది.
పదవులపై నాయకుల్లో ఆశలు
కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పడుతుండడంతో పాటు కొత్తగా ఐదు జెడ్పీటీసీ, ఐదు ఎంపీపీ పదవులు వస్తున్నందున నాయకుల్లో పదవులపై ఆశలు పెరుగుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్ నాయకులు కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకుంటున్నారు. రిజర్వేషన్‌లు కలిసివస్తే జెడ్పీటీసీలు పోటీచేసేందుకు అనువైన మండలాలను ఎంపిక చేసుకునేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు సిద్ధం అవుతున్నారు. హవేళిఘణాపూర్, చిల్పిచెడ్, నార్సింగి, మనోహరాబాద్, నిజాంపేట మండలాల్లోని కొత్తగా జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులు రానున్నాయి. దీంతో ఆయా పదవులపై నాయకులు ఇప్పటి నుంచే కన్నేసి ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment