కస్తూర్బా గాంధీ పాఠశాలల్లోని విద్యార్థినులకు ఇక మంచి పోషకాహారం అందనుంది. చికెన్, మటన్, గుడ్డు, నెయ్యి అందించేలా సర్కార్ చర్యలకు ఉపక్రమించనుంది. వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో చికెన్, గుడ్డు అందిస్తున్నారు. ఇకపై నెలలో రెండు వారాలు మటన్, నిత్యం నెయ్యి అందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈనేపథ్యంలో ఎదిగే విద్యార్థినులకు మంచి పౌష్టికాహారం అందనుంది.
వికారాబాద్, యాలాల(తాండూరు): బడిబయటి పిల్లలతో పాటు చదువును మధ్యలో ఆపేసిన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం)ల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కస్తూర్బా పాఠశాలల్లోని విద్యార్థినులు ఆరోగ్యపరంగా రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన అధికారులు వారికి నాణ్యమైన మాంసకృత్తులు అందించడం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్తూర్బాల్లో చికెన్‌తో పాటు మేక మాంసం, ప్రతిరోజు గుడ్డు, నెయ్యితో మెనూను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే వారానికొకసారి అందించే చికెన్‌తో పాటు మేకకూర ప్రతిరోజు నెయ్యి, గుడ్డు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయ ప్రత్యేక అధికారులతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్వహించిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇందుకు కోసం కొత్త సంవత్సరం నుంచి కేజీబీవీల్లో కొత్త మెనూ అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా ఎదిగేందుకు అస్కారం ఉంటుంది.
జిల్లాలోని కసూర్బా పాఠశాలలు..
జిల్లాలోని 18 మండలాల్లో కస్తూర్బా గాంధీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 3,374 మంది విద్యార్థినులు విద్యభ్యాసం చేస్తున్నారు. వీరికి ప్రతిరోజూ నాణ్యమైన భోజనంతో పాటు వారంలో ఒకరోజు(ఆదివారం)చికెన్ అందిస్తున్నారు. భోజనంతో పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సమయాల్లో స్నాక్స్ ఇతరత్రా ఆహార పదార్థాలు అందజేస్తున్నారు. ఇలా ఒక్కో విద్యార్థికి రూ.33 పర్ కేపిటాగా నెలకు రూ.990లు ఖర్చు చేస్తున్నారు. అయితే, కొత్త సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్న నూతన మెనూలో భాగంగా మటన్, నెయ్యి, గుడ్డు విషయంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బహిరంగంగా మార్కెట్‌లో మటన్ కిలోకు దాదాపు రూ.400, నెయ్యి కిలోకు రూ.400, గుడ్డు ఒక్కోటి రూ.5గా ఉంది.
కొత్త సంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్న మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.45 పర్ కేపిటాగా ఖర్చు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎదిగే బాలికలు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుకుండా, రక్తహీనత బారినపడకుండా ఉండేందుకు ఈ కొత్త మెనూ దోహదపడుతుందని కేజీబీవీ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అమలు అవుతున్న మెనూలో భాగంగా నెలకు నాలుగుసార్లు చికెన్‌తో పాటు రెండుసార్లు మేక మాంసాన్ని మెనూ లో ప్రవేశపెట్టనున్నారు. ప్రతినెలా రెండు, నాలుగో ఆదివారం మేక మాంసం అందించేలా ప్రణాళికలు చేపడుతున్నారు. ఇదే అమలు అయితే విద్యార్థినులు ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడుతుంది.
ఆరోగ్యంగా ఎదిగేందుకు అవకాశం
కేజీబీవీల్లో కొత్తగా ప్రవేశపెట్టనున్న మెనూతో విద్యార్థులకు మేలు జరుగుతుంది. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన బాలికలు ఇక్కడ చదువుకుంటారు. ఇక్క డ కేజీబీవీల్లో విద్యార్థినులు రక్తహీనత, ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమవుతుంటారు. కొత్త మెనూ ప్రకారం మేక మాంసం, నెయ్యి, గుడ్డుతో ఎంతో మేలు కలుగుతుంది. తద్వారా విద్యార్థినులు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటికే మెనూపై విద్యార్థుల తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలి.
–సుధాకర్‌రెడ్డి, ఎంఈఓ, యాలాల
Comments
Please login to add a commentAdd a comment