విద్యార్థులకు అస్వస్థత
కస్తూర్బా పాఠశాల యాజమాన్యం తీరుపై తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. అస్వస్థతకు గురైన తమ పిల్లల ఆసుపత్రుల్లో ఉన్నప్పటికీ తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటూ ఎస్‌వో ఉమాదేవి, ఎస్‌ఎస్‌ఏ పీవో బి. నగేష్‌లను నిలదీశారు. యాజమాన్యం, భోజన నిర్వాహకుల తీరు సక్రమంగా లేదని వారిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఆర్డీవో పద్మావతి వారితో చర్చలు జరిపారు. ఇకపై సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో, ఎస్‌ఎస్‌ఏ పీవో హామీతో ఆందోళన విరమించారు. ఎంపీడీవో స్వరూపరాణి, తహశీల్దార్ గంగాధరరావు, ఎంఈవో సత్యనారాయణ , జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు దిన్‌బాబు, వైస్ ఎంపీపీ కె. అనిత బాధిత విద్యార్థినులను పరామర్శించారు.
- తప్పిన ప్రమాదం
- రాంబిల్లి కస్తూర్బా పాఠశాలలో ఘటన
- వంటలో తేడా వల్లేనని వైద్యాధికారుల వివరణ
- పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన
- ఎస్‌ఎస్‌ఏ పీవో సమాధానంతో విరమణ
రాంబిల్లి: వంటకంలో తేడాతో రాంబిల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో 25 మంది విద్యార్థినులు సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 9గంట ల సమయంలో విద్యార్థినులు తీవ్ర కడుపునొప్పి, వాంతులకు గురయ్యారు. పాఠశాలలో ఒక్కసారిగా కలకలం చోటుచేసుకుంది. అదే సమయంలో సీట్ల ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు పాఠశాలకు వచ్చి న మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు కొవిరి రామకృష్ణ ఎస్‌వో ఉమాదేవి, ఉపాధ్యాయినుల సాయంతో వారిని రాంబిల్లి పీహెచ్‌సీకి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన తొమ్మిది మందిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అంతా కోలుకుంటున్నారు. ఆదివారం రాత్రి విద్యార్థినులకు అన్నంతోపాటు బెండకాయ కూర, రసం వడ్డించారు.
సోమవారం ఉదయం మెనూ ప్రకారం పులిహోరకు బదులు వాముజావ పెట్టారు. రాత్రి అన్నం ఉడకలేదని, కూర, రసంలో మసాల, కారం అధికంగా వేసి వంట చేశారని విద్యార్థినులు వాపోయారు. పాఠశాలలో సక్రమంగా భోజనం తయారుచేయడం లేదని, ఎస్‌వో ఉమాదేవికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థినులు ఆర్డీవో పద్మావతి, డిప్యూటీ డీఈవో రేణుక, ఎస్‌ఎస్‌ఏ పీవో బి. నగేష్‌ల వద్ద వాపోయారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను డిప్యూటీ డీఎంహెచ్‌వో పి. నాగేశ్వరరావు పరిశీలించారు. కలుషిత ఆహారం కారణమని తొలుత ప్రకటించారు. ఆహారం తయారీలో లోపమంటూ తర్వాత వివరణ ఇచ్చారు. 182 మంది విద్యార్థినులు ఆహారం తినగా వారిలో 25 మంది మాత్రమే అస్వస్థతకు గురయ్యారని ఆహారం కలుషితమైతే మొత్తం విద్యార్థినులంతా ఇబ్బందిపడేవారని రాంబిల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ రేష్మ విలేకరులకు తెలిపారు.