అమ్మో దెయ్యం.. మాకు భయం
చింతపల్లి: విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి కస్తూర్భా గాంధీ గురుకుల విద్యాలయంలోని 50 మంది బాలికలు శనివారం దెయ్యం తిరుగుతోందంటూ ఇంటి బాట పట్టారు. పాఠశాలలో రాత్రి పూట కొందరు బాలికలకు దెయ్యం పడుతోందని, ఆ భయంతోనే వెళ్లిపోయారని కొందరు చెబుతుండగా, సంఘటన వెనుక కొందరు స్వార్థపరులు కథ నడుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 185 మంది బాలికలు చదువుతున్నారు. కొంత కాలంగా పాఠశాలలోని బోధకులు మధ్య విభేదాలు ఉన్నాయని, ఇందులో భాగంగా ప్రత్యేక అధికారిణి లక్ష్మిని ఆ బాధ్యతల నుంచి తప్పించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు కొందరు విద్యార్థినులను పావులుగా వాడుకుంటున్నట్లు పలువురు చెబుతున్నారు.
ఏటీడబ్ల్యువో విచారణ
తాజంగి కస్తుర్భా బాలికలు ఇంటి బాట పట్టడంపై ఏటీడబ్ల్యువో దేముళ్లు విచారణ జరిపారు. విద్యార్థినులు వెళ్లి పోవడానికి గల కారణాలను సిబ్బంది, బాలికలను అడిగి తెలుసుకున్నారు. సంఘటన వెనుక వినిపిస్తున్న కథనంపై కూడా ఆయన ఆరా తీస్తున్నారు. ఇళ్లకు వెళ్లిపోయిన బాలికలందరినీ వెనక్కు రప్పించేందుకు ప్రత్యేక అధికారి లక్ష్మి చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు.