ఈ సరస్సు చూడచక్కగా ఉంటుంది. ఇందులోని నీళ్లు స్వచ్ఛంగా తళతళలాడుతూ ఉంటాయి. అయినా, జనాలు ఈ సరస్సు పేరు వింటేనే భయపడతారు. గుండెధైర్యం ఉన్న కొద్దిమంది ఇక్కడకు పిక్నిక్‌లకు వస్తుంటారు. అలాంటి వారు కూడా ఈ సరస్సు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సరస్సులో దయ్యం ఉందన్న ప్రచారమే జనాల భయానికి కారణం. అమెరికాలోని లాంగ్ ఐలండ్‌లో ఉన్న ఈ సరస్సు పేరు ‘రోంకోంకోమా లేక్’. ఇక్కడి స్థానికులు ఈ సరస్సు నీళ్లల్లో అరికాళ్ల మునివేళ్లను ముంచడానికి కూడా భయపడతారు.
రోంకోంకోమా సరస్సులో దయ్యం ఉందనే గాథకు మూలాలు పదిహేడో శతాబ్ది చివరికాలం నుంచి ఉన్నాయి. ఇక్కడి స్థానిక మూలవాసులైన ‘సెటాకెట్’ తెగకు చెందిన యువరాణి టుస్కావాంటా ఈ ప్రాంతంలో కట్టెలు కొట్టుకునేందుకు వచ్చే తెల్లజాతి యువకుడితో ప్రేమలో పడింది. టుస్కావాంటా తండ్రి వారి ప్రేమను నిరాకరించడంతో ఆమె సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఈ సరస్సులోనే ఉందని, సరస్సులోకి వచ్చే పురుషులను బలిగొంటూ ఉందని లాంగ్ ఐలండ్ జనాలు చెప్పుకుంటుంటారు.
గడచిన శతాబ్దకాలంలో ఈ సరస్సులో పడి 160 మందికి పైగా యువకులు అంతుచిక్కని పరిస్థితుల్లో మరణించారు. ఈ సరస్సులోని దయ్యం ఏడాదికి కనీసం ఒక యువకుడినైనా బలిగొంటుందని ఇక్కడి జనాల నమ్మకం. ఈ సరస్సు తీరంలో డేవిడ్ ఇగ్నేరీ (74) దాదాపు ముప్పయి ఏళ్ల పాటు లైఫ్‌గార్డ్‌గా పనిచేశాడు. తాను పనిచేసిన కాలంలోనే ఈ సరస్సులో పడి ముప్పయి మంది మరణించారని, వారందరూ యువకులేనని అతడు చెబుతున్నాడు.
స్థానికుల నమ్మకాలు, భయాలకు తోడు ఈ సరస్సులో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడంతో ఇక్కడి జనాలు సరస్సులో పడి ఆత్మాహుతి చేసుకున్న యువరాణి కట్టెబొమ్మను భారీసైజులో ఇక్కడ నెలకొల్పారు. అమెరికా పర్యాటక శాఖ ఇక్కడ ఈ గాథను వివరిస్తూ, పెద్ద పెద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment