Women sarpanch
-
విద్యాప్రవీణ
మద్యానికి బానిసై తండ్రి చనిపోయాడు. కష్టాల మధ్య పెరిగిన ప్రవీణ పశువుల కాపరిగా పనిచేసింది. కూలిపనులు చేసింది. చదువు ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను 23 సంవత్సరాల వయసులో సర్పంచ్‌ని చేసింది. బాలికల విద్య నుంచి స్త్రీ సాధికారత వరకు ఎన్నో విషయాలపై స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తోంది ప్రవీణ. రాజస్థాన్‌లోని పలి జిల్లా సగ్దార గ్రామానికి చెందిన ప్రవీణ తన గ్రామంలోనే కాదు చుట్టుపక్కల ఎన్నో గ్రామాల ప్రజలకు స్ఫూర్తిదాయక మహిళగా మారింది. మూడోక్లాసులో ఉన్నప్పుడు ప్రవీణను చదువు మానిపించారు. దీంతో తనకు ఇష్టమైన చదువుకు దూరం అయింది. చదువుకు దూరం అయిన ప్రవీణ పశువులను మేపడం నుంచి కూలిపనుల వరకు ఎన్నో చేసింది. రెండు సంవత్సరాల తరువాత ఆమె జీవితాన్ని మార్చే సంఘటన జరిగింది. తమ ఊరికి నలభై కిలోమీటర్ల దూరం లో ఉన్న గ్రామంలోని రెసిడెన్షియల్ స్కూల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ (కేజీబీవి)లో చదువుకునే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. అయితే మొదట్లో కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. ‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఒక ఫీల్డ్ వర్కర్ కృషివల్ల ఎట్టకేలకు బడిలో ప్రవీణను చేర్పించడానికి ఒప్పుకున్నారు. స్కూల్ చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరగడం మాత్రమే కాదు, ఆడపిల్లలు చదువుకోవడం వల్ల ఎంత మేలు జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగింది ప్రవీణ. చదువు పూర్తయిన తరువాత ఒక కన్స్ట్రక్షన్ వర్కర్‌తో ప్రవీణ పెళ్లి జరిగింది. ‘చదువుకున్న అమ్మాయి’గా అత్తగారి ఇంట్లో ప్రవీణకు తగిన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. తాను తీసుకునే నిర్ణయాలకు అండగా నిలబడేవారు. ‘సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నాను’ అన్నప్పుడు అందరూ అండగా నిలబడ్డారు. కొంతమంది మాత్రం వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. అయితే అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. సర్పంచ్‌గా విజయం సాధించింది. చదువు విలువ తెలిసిన ప్రవీణ సర్పంచ్ అయిన రోజు నుంచి బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇంటింటికి వెళ్లి చదువుకోవడం వల్ల ఆడపిల్లలకు కలిగే ఉపయోగాల గురించి ప్రచారం చేసేది. బాల్యవివాహాలు జరగకుండా అడ్డుకునేది. ‘అప్పుడెప్పుడో మా అమ్మాయిని చదువు మానిపించాం. ఇప్పుడు తిరిగి బడిలో చేర్చాలనుకుంటున్నాం’ అంటూ ఎంతోమంది తల్లిదండ్రులు ప్రవీణ సలహాల కోసం వచ్చేవారు. సర్పంచ్‌గా ఆడపిల్లలకు ప్రత్యేకంగా స్కూలు కట్టించింది ప్రవీణ. బాలికల విద్య కోసం పనిచేస్తున్న సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ప్రవీణ ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు ఉపాధ్యాయులు తమ స్కూలుకు తీసుకువెళ్లి ఆడపిల్లలకు పరిచయం చేసేవారు. ‘చదువుకోకపోతే ప్రవీణ కూలిపనులు చేస్తూ ఉండిపోయేది. చదువుకోవడం వల్ల ఆమెలో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ ఆత్మవిశ్వాసమే ప్రవీణను సర్పంచ్‌ను చేసి పదిమందికి ఉపయోగపడే మంచి పనులు చేసేలా చేసింది. మీరు బాగా చదువుకుంటే సర్పంచ్ మాత్రమే కాదు కలెక్టర్ కూడా కావచ్చు’... ఇలాంటి మాటలు ఎన్నో చెప్పేవారు. ఆడపిల్లల చదువు కోసం పనిచేస్తున్న‘ఎడ్యుకేట్ గర్ల్స్’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రచార చిత్రాలలో ప్రవీణ ఫొటోలను ఉపయోగించుకుంటుంది. దీంతో ఎన్నో గ్రామాలకు ఆమె సుపరిచితం అయింది. ‘ఏదైనా గ్రామానికి వెళ్లినప్పుడు స్కూల్లో చదివే అమ్మాయిలతో మాట్లాడుతుంటాను. మీ గురించి ఫీల్డ్ వర్కర్స్ మా పేరెంట్స్‌కు చెప్పి స్కూల్‌కు పంపించేలా ఒప్పించారు... అని ఎంతోమంది అమ్మాయిలు అన్నప్పుడు గర్వంగా అనిపించేది. ఆడపిల్లల విద్యకు సంబంధించి భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను’ అంటుంది ప్రవీణ. -
Neeru Yadav: హాకీ వాలీ సర్పంచ్
రాజస్తాన్‌లో ఆడపిల్ల పుడితే ఇంకా కొన్ని పల్లెల్లో బంధువులు వెళ్లి ‘శోక్ ప్రకటన్’ (శోక ప్రకటన) చేసే ఆనవాయితీ ఉంది. మొదట కొడుకు పుట్టేశాక రెండో సంతానంగా ఆడపిల్ల పుడితే బిడ్డ బాగోగులు నిర్లక్ష్యం చేసే ఆనవాయితీ ఉండటంతో ప్రభుత్వం ఏకంగా రెండో సంతానం కోసమే ‘మాతృత్వ పోషణ్ యోజన’ పేరుతో తల్లికి 6 వేల రూపాయలు ఇస్తోంది. అలాంటి చోట ఒక మహిళా సర్పంచ్ హల్చల్ చేస్తోంది. తను సర్పంచ్ కావడమే ఊరిలోని ఆడపిల్లలతో ఒక హాకీ టీమ్ ఏర్పాటు చేసి ‘హాకీ వాలీ సర్పంచ్’ అనే పేరు గడించింది. తాజాగా హాకీ బ్యాట్ పట్టుకుని తిరుగుతూ పెళ్లిళ్లలో చెత్త చెదారం వేసినా, ఆహారాన్ని వ్యర్థం చేసినా డొక్క చించుతానని కొత్త ఆర్డర్ పాస్ చేసింది. ప్రజల కోసం సొంత డబ్బు కూడా ఖర్చు పెడుతున్న నీరూ యాదవ్ పరిచయం. జిల్లా అధికారులతో ఎప్పుడు మీటింగ్ జరిగినా నీరూ యాదవ్ లేచి గట్టిగా మాట్లాడుతుంది. అక్కడున్న వాళ్లు ఆమెను ‘మహిళ అయినా’ ఎంత గట్టిగా మాట్లాడుతోందని ఆశ్చర్యంగా, మెచ్చుకోలుగా చూస్తారు. ‘నేను మహిళనే. కాని బాగా చదువుకున్నాను. మీరు గోల్మాల్ చేసిన బిల్లుల మీద సంతకం పెట్టమంటే పెట్టను. అవినీతి చేయను. నా పంచాయితీలో జరగనివ్వను’ అని తిరగబడుతుంది. అంతే కాదు అది వీడియో తీసి యూట్యూబ్‌లో పెడుతుంది కూడా. రాజస్థాన్‌లోని ‘ఝుంజును’ జిల్లాలోని ‘లంబి అహిర్’ అనే పంచాయితీ ఈ నీరూ యాదవ్ అనే సర్పంచ్ వల్ల అందరినీ ఆకర్షిస్తోంది. లంబి అహిర్ రాజస్థాన్‌లో ఉన్నా హర్యాణ సరిహద్దులో ఉంటుంది. ఆ ఊళ్లో యాదవులు ఎక్కువ. నీరూ యాదవ్ ఊళ్లోకెల్లా బాగా చదువుకోవడం వల్ల సర్పంచ్‌గా సులభంగా ఎంపికైంది. మరి... ఎం.ఎస్సీ, ఎం.ఇడి చేసి పిహెచ్.డి కూడా చేసిన నీరూ ఊరికి సేవ చేస్తానంటే ఎవరు వద్దంటారు? ► అమ్మాయిల ప్రగతే ముఖ్యం 2020లో సర్పంచ్ అయిన నాటి నుంచి నీరూ యాదవ్ ముఖ్యంగా అమ్మాయిల ప్రగతి గురించి దృష్టి పెట్టింది. తన పంచాయతీలోని స్త్రీల పట్ల ఉన్న కట్టుబాట్లను బాగ ఎరిగిన నీరూ వారు అన్ని విధాలుగా వికాసం చెందాలంటే విద్యతో పాటు ఇంటి నుంచి బయటకు కదలడం ముఖ్యమే అని ఊరికి చూపించదలుచుకుంది. అందుకే స్కూలు, కాలేజీ వయసున్న ఆడపిల్లల ఇంటింటికి వెళ్లి వారికి, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఒక మహిళా హాకీ జట్టుగా జమ చేసింది. సర్పంచ్‌గా తనకొచ్చే జీతంతో ఒక కోచ్‌ను ఏర్పాటు చేసింది. పంచాయతీ నిధులతో గ్రౌండ్‌ను శుభ్రం చేసి ఏర్పాటు చేసింది. ‘మీరు ఉత్తమ హాకీ టీమ్‌గా విజయాలు సాధించాలి’ అనంటే ఆ ఆడపిల్లలు ఉదయం, సాయంత్రం ప్రాక్టీసు చేస్తూ, ఆటను ఆస్వాదిస్తూ ఇవాళ జిల్లా స్థాయిని దాటి స్టేట్ లెవల్లో ఆడేదాకా ఎదిగారు. ఇది ఊరందరికీ నచ్చి నీరూ యాదవ్ అసలు పేరు మరిచి ‘హాకీ వాలీ సర్పంచ్’ అని పిలవడం మొదలెట్టారు. అయితే ఆటలు మాత్రమే కాదు బాలికల చదువుకు, టెక్నికల్ విద్యకు కూడా నీరూ ప్రోత్సాహం అందిస్తోంది. కొంతమంది యువతులను షార్ట్‌టెర్మ్ టెక్నికల్ కోర్సులకు పంపి వారికి ఉద్యోగాలు దొరికేలా చూస్తోంది. తన సొంత డబ్బుతో చదివిస్తోంది. ► పెళ్ళిళ్ల వృధాకు విరుగుడు ఊళ్లో పెళ్లిళ్లు, మీటింగులు, ఇతర ఫంక్షన్ల వల్ల భోజనాల సమయంలో పేరుకు పోతున్న చెత్తను గమనించిన నీరూ యాదవ్ తాజాగా ‘చెత్త రహిత వివాహాలు’ అనే ప్రచారాన్ని మొదలెట్టింది. పెళ్లిళ్ల సమయంలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, బాటిళ్లు వాడి పారేయడం వల్ల పేరుకుపోతున్న చెత్తకు విరుగుడుగా స్టీలు పళ్లేలు, గ్లాసులు, బకెట్లు, వంట పాత్రలు కొని పంచాయితీ ఆఫీసులో పెట్టింది. ఊళ్లో ఏ ఫంక్షన్‌కైనా వీటిని ఉచితంగా ఇస్తారు. అయితే నీరూ యాదవ్ తయారు చేసిన మహిళా కార్యకర్తలు వచ్చి వడ్డిస్తారు. ఎంత తింటే అంత పెట్టడం వల్ల ఆహారం వృధా కాకుండా చూడాలనేది ఆలోచన. అంతేకాదు ఒకవేళ ఆహారం వృధా అయితే దానిని ఎరువుగా మార్చి రైతులకు ఇవ్వాలనే కార్యాచరణ కూడా నీరూ మొదలెట్టింది. ‘మన దేశంలో ఒక మనిషి సంవత్సరానికి సగటున 50 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నాడు. ప్రపంచంలో చైనా తర్వాత ఆహారాన్ని వృధా చేస్తున్నది మనమే’ అంటుంది నీరూ. పిల్లల ఆట కోసం చేతిలో సరదగా హాకీ బ్యాట్ పట్టుకున్నా అది పట్టుకుని ఆమె చేస్తున్న సంస్కరణలు జనం వింటున్నారు. ► రైతుల కోసం నీరూ యాదవ్ పల్లెకు ఆయువుపటై్టన రైతును ఎలా నిర్లక్ష్యం చేస్తుంది. రైతులకు కావాలసిన ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహారక మందుల ఏర్పాటు కోసం పండించిన పంటకు సరైన మద్దతు ధర దొరకడం కోసం ఊరి రైతులతో ఎఫ్.పి.ఓ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) ఏర్పాటు చేసింది. దాంతో రైతులు సంతృప్తిగా ఉన్నారు. నీరూ యాదవ్‌ను మెచ్చుకుంటున్నారు. ‘హాకీ వాలీ సర్పంచ్’ నీరూ యాదవ్ రాబోయే రోజుల్లో సర్పంచ్ కంటే పై పదవికి వెళ్లకుండా ఉండదు. ఆమె చేయాలనుకున్న మంచి పనుల లిస్టులో ఇవి కొన్నే. అన్ని పనులు జరగాలంటే అలాంటి వాళ్లు ఇక్కడితో ఆగకపోవడమే కరెక్ట్. మన దేశంలో ఒక మనిషి సంవత్సరానికి సగటున 50 కిలోల ఆహారాన్ని వృధా చేస్తున్నాడు. ప్రపంచంలో చైనా తర్వాత ఆహారాన్ని వృధా చేస్తున్నది మనమే. -
‘అంతుచూస్తాం.. దిక్కున్న చోట చెప్పుకో’.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు
కేవీబీపురం(చిత్తూరు జిల్లా): మహిళా సర్పంచ్‌పై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయి. ఫ్లెక్సీల తొలగింపుపై ప్రశ్నించినందుకు పచ్చతమ్ముళ్లు విచక్షణ, మర్యాద మరచి అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలు.. అంజూరు సర్పంచ్ శ్రీజయ ప్రజలకు నూతన సంవత్సరం, సంక్రాతి శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీన్ని సహించలేని స్థానిక టీడీపీ నేత శివయ్య తన అనుచరులతో బ్యానర్లను ధ్వంసం చేయించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ శ్రీజయ సంబంధిత వ్యక్తులను ప్రశ్నించారు. చదవండి: బోడికొండపై 'దండు'యాత్ర.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు శివయ్య, మోహన్, అనుచరులు దిక్కున చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి సర్పంచ్ ఇంటిపై రాళ్లతో దాడులకు దిగారు. తమకు అడ్డొస్తే చంపేస్తామని బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో జయశ్రీ కింద పడిపోయారు. ఆమె భర్త సురేష్ టీడీపీ మూకలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రంగ ప్రవేశంతో అల్లరి మూకలు పరారయ్యాయి. ఈ ఘటనకు పాల్పడిన వారిలో మాతయ్య అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. శివయ్య, మోహన్ల ప్రోద్భలంతోనే తాను బ్యానర్లను తొలగించినట్లు పోలీసులకు తెలిపాడు. టీడీపీ నేతల నుంచి తమకు రక్షణ కల్పించాలని సర్పంచ్ జయశ్రీ పోలీసులను రాత పూర్వకంగా కోరారు. దీనిపై ఎస్ఐ నాగార్జునరెడ్డిని వివరణ కోరగా.. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. -
పదవి భార్యది.. సర్పంచ్ కుర్చీ భర్తది!
పెదకాకాని (పొన్నూరు): గుంటూరు జిల్లా పెదకాకాని సర్పంచ్ మండే మాధవీలతకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని ఆమె భర్త నాగేశ్వరరావు పెత్తనం చెలాయిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా సమావేశంలో డీపీవో కేశవరెడ్డి మాట్లాడుతూ.. మహిళలు గెలుపొందిన పంచాయతీల్లో వాళ్లే సర్పంచ్ స్థానాల్లో కూర్చోవాలని.. ఎట్టిపరిస్థితిలోనూ వాళ్ల భర్తలకు పెత్తనం ఇవ్వొద్దని పంచాయతీ కార్యదర్శులకు స్పష్టంగా చెప్పారు. అయితే అధికారుల ఆదేశాలను ఏ మాత్రం లెక్కచేయకుండా పెదకాకాని పంచాయతీలో మహిళా సర్పంచ్ అధికారాన్ని ఆమె భర్త లాక్కోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు. -
మహిళా సర్పంచ్‌కు కలెక్టర్ ప్రశంస
ఒడిశా: కరోనా కట్టడిలో గ్రామపంచాయతీ సర్పంచ్‌లను భాగస్వాములను చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొంతమంది సర్పంచ్‌లు కరోనా కట్టడి చర్యల్లో నిమగ్నమవుతూ వైరస్ వ్యాప్తి నియంత్రణకు తమవంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రాయగడ సమితి, నారాయణపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జమునాదేవి ప్రధాన్‌ను కలెక్టర్ అనుపమకుమార్ సాహా ప్రశంసించారు. గ్రామంలోని వార్డు సభ్యులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కరోనా నివారణలో ఆమె చేస్తున్న కృషిని ఇప్పుడు అధికారులు మెచ్చుకుంటున్నారు. చదవండి: ఏపీ ప్రభుత్వ పథకాలకు జాతీయస్థాయి ప్రశంసలు ఇంట్లో స్వయంగా మాస్క్‌లు కుడుతున్న సర్పంచ్ దాదాపు 1000 మాస్కులు కొనుగోలు చేసి, వాటిని గ్రామస్తులకు ఉచితంగా పంచిపెట్టారు. అలాగే ఒక్కొక్కసారి ఇంట్లో ఖాళీ సమయంలో మాసు్కలు స్వయంగా కుట్టి, గ్రామస్తులకు అందజేస్తున్నారు. వీటితో పాటు ఓ ఆటో బుక్ చేసి మరీ మైక్సెట్లో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఎప్పటికప్పుడు ఆమె చేస్తున్న ప్రచారం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కరోనా నివారణలో ఈమె నిబద్ధతను చూసిన అధికారులు మిగతా సర్పంచ్‌లు కూడా ఈమె లాగా కృషి చేయాలని కోరుతున్నారు. చదవండి: ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్‌కు నోటీసులు -
జేసీబీకి వేలాడిన మహిళా సర్పంచ్
జైపూర్ : రాజస్తాన్‌లో ప్రస్తుతం అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో తమ గ్రామ పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఓ మహిళా సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి వచ్చిన జేసీబీలకు ఎదురొడ్డి వాటిని వెనక్కి పంపించారు. వివరాలు... రాజస్తాన్‌లోని మండ్వాలా గ్రామానికి రేఖా దేవి అనే మహిళ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అక్కడున్న భవనాలను అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ అధికారులు కూల్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆగ్రహించిన రేఖా దేవి జేసీబీలకు ఎదురుగా నిల్చుని వెనక్కి వెళ్లాల్సిందిగా సూచించారు. కానీ వాళ్లు ఇందుకు నిరాకరించడంతో జేసీబీ కొక్కాన్ని పట్టుకుని వేలాడారు. దీంతో ఆందోళనకు గురైన జేసీబీ డ్రైవర్లు వెంటనే వాటిని వెనక్కి తీసుకువెళ్లారు. ఈ విషయం గురించి సర్పంచ్ రేఖా దేవి మాట్లాడుతూ.. ‘ అది గ్రామ పంచాయతీకి చెందిన భూమి. దానిని ఆక్రమించుకునేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. మేం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాం. అయితే మరోసారి దురాక్రమణకు పాల్పడేందుకు అక్కడున్న కట్టడాలు కూల్చివేస్తున్నారు. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు చర్యలు తీసుకోవడం లేదు అని పేర్కొన్నారు. -
మహిళా సర్పంచ్‌లకు సన్మానం
సాక్షి, మునిపల్లి(అందోల్): నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఉంది. ఈ సందర్భంలో మహిళల ప్రాధాన్యతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహిళలు అన్నిరంగాల్లో రాణించేందుకు మగవారితో పోటీ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. నేడు మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారు. కానీ మండలంలో తాము రాజకీయంగా మాత్రం రాణించలేకపోతున్నామని కొందరు మహిళల్లో ఆందోళన వ్యక్తమవడంతో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ను ఆయా గ్రామాల సర్పంచ్‌లు కోరారు. మగవారికన్నా మహిళలే అన్ని రంగాల్లో ముందుంటున్నారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఈ నెల 2వ తేదీన మునిపల్లి మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో మునిపల్లి మండలంలో 12 మంది ఎంపీటీసీ స్థానాలుండగా వాటిలో ఆరుగురు మహిళలకు రిజర్వేషన్లను ఖరారయ్యాయి. 30 మంది సర్పంచ్‌లకు గాను 18 మంది మహిళా సర్పంచ్‌లు ఉన్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ సందర్భంగా కొత్తగా సర్పంచ్‌లుగా ఎన్నికైన ఆయా గ్రామాల మహిళా ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజాప్రతినిధులుగా ఎంపికైన వారే సక్రమంగా అన్ని పనులు నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళలందరూ స్వతంత్రంగా వారే నిర్ణయాలు తీసుకునేవిధంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. ప్రభుత్వ కార్యక్రమంలో కూడా మహిళా ప్రజాప్రతినిధులే పాల్గొనాలని, వారి భర్తలు పాల్గొనకుండా చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితమన్న మాట మర్చిపోయి మగవారితో సమానంగా రాజకీయాలలో అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని మహిళా ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ, స్వాతంత్రం ఉన్నప్పటికీ రాజకీయాలలో రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. మహిళా దినోత్సవాలను జరుపుకోవడం అనవాయితీగా వస్తోంది. కానీ ప్రజాప్రతినిధులుగా మహిళలు ఎన్నికైనప్పటికీ పూర్తి స్థాయిలో అధికారం చేయలేకపోతున్నామని వాపోతున్న సంఘటనలున్నాయి. మహిళలకు 65 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. అదేవిధంగా మహిళా ప్రజాప్రతినిధుల హక్కులు, విధులను మహిళలే నిర్వహించుకునే విధంగా చూడాల్సిన అవసరం కేంద్ర, రాష్త్ర్‌ట ప్రభుత్వాలపై ఉందని మహిళా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీ ఈశ్వరమ్మ -
మహిళా సర్పంచ్ గ్రామ బహిష్కరణ
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): వ్యవసాయ భూమి విషయంలో చెప్పినట్లుగా వినడం లేదనే కక్షతో కొందరు ఓ దళిత మహిళా సర్పంచ్‌నే కుల, గ్రామ బహిష్కరణ చేసిన ఘనట నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఊరికి సమస్యలు వస్తే సర్పంచ్‌గా పరిష్కరించే తనకు ఊరి నుంచే కొందరి వల్ల సమస్య ఎదురు కావడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ సర్పంచ్ సోమవారం కుటుంబీకులతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి న్యాయం చేయాలని కలెక్టర్‌ను వేడుకుంది. జిల్లాలోని మెండోర మండలం బుస్సాపూర్ సర్పంచ్ జక్కుల మమత, ఆమె కుటుంబం తాతల కాలం నాటి నుంచి ఉన్న 20 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గ్రామంలోని కొందరు అగ్ర కులాల వారు ఆ భూమిని గతంలోనే తమకు విక్రయించారని, కాగితాలపై సంతకాలు చేయాలని సర్పంచ్ మమత, ఆమె భర్త శ్రీనివాస్‌పై ఒత్తిడి చేశారు. ఈ విషయంలో ఇరువర్గాలకు చాలాసార్లు వాగ్వాదం జరిగింది. సంతకం పెట్టనందుకు మొదటగా కుల బహిష్కరణ, ఆ వెంటనే గ్రామ బహిష్కరణ చేశారని బాధిత సర్పంచ్ మమత కలెక్టర్ రామ్మోహన్‌రావుకు ఫిర్యాదు చేసింది. తనతో తన కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడినా.. పొలాల్లో పనులకు వచ్చినా.. వారికి రూ.5 వేల జరిమానా విధిస్తామని చాటింపు వేశారని వివరించారు. -
ఈ సర్పంచ్‌లు సాధించారు..
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్వచ్ఛత సాధించేందుకు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నడుం బిగించారు ఇద్దరు మహిళా సర్పంచ్‌లు. టాయిలెట్ల నిర్మాణం చేసుకోవాలంటూ ఇం టింటా తిరిగి చెప్పారు. ఆరుబయటకు వెళ్లొ ద్దంటూ ఉదయాన్నే డప్పు చాటింపు వేయించారు. టాయిలెట్లు నిర్మించుకోం అని ఎవరైనా అంటే వారికి కరెంటు కనెక్షన్ నిలిపి వేయించారు. ఆఖరికి టాయిలెట్ల నిర్మాణానికి నిధులు తక్కువైతే ఒకరు ఒంటిపై బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి మరీ నిర్మించారు. మరొకరు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం సర్పంచ్ కొర్రా భారతి, బొల్లోనిపల్లి సర్పంచ్ పొన్నం వనజ తమ గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, ఓడీఎఫ్) గ్రామాలుగా మార్చి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ముహూర్తాలు లేవు.. ముత్తారం గ్రామపంచాయతీ çపరిధిలో 1,200 మంది జనాభా, 329 గడపల ఇళ్లు ఉన్నాయి. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం కాలకృత్యాలు తీర్చుకునేందుకు పొలం గట్లు, ఊరిబయట నిర్జన ప్రదేశాలు, బావి గట్లకు వెళ్లడం రివాజు. స్వచ్ఛభారత్ మిషన్ మొదలుకాక ముందు ముత్తారంలో 70 ఇళ్లలో టాయిలెట్లు ఉన్నాయి. ఆ తర్వాత మరో 100 టాయిలెట్ల నిర్మాణం జరిగింది. మిగిలిన వారిలో కొందరికి ఆర్థిక కారణాలు అడ్డంపడితే, మరికొందరికి టాయిలెట్ల నిర్మాణం ఓ అనవసర అంశంగా మారింది. 2 నెలలుగా ఇళ్లలో టాయిలెట్లు నిర్మించుకోవాలంటూ సర్పంచ్ భారతి ఇంటింటికి ప్రచా రం నిర్వహించారు. ఈ క్రమంలో మా ఇళ్లలో టాయిలెట్లు కట్టాలంటూ ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు. ఇందులో మీకు ఏం లాభం ఉంది అంటూ ప్రజలు ప్రశ్నించారు. మరికొన్ని చోట్ల మా ఇంట్లో వాస్తు ప్రకారం టాయిలెట్ కట్టకూడదంటూ ఎదురు తిరిగారు. ఇప్పుడు మంచి ముహూర్తాలు లేవు. మంచి టైం చూసి కట్టుకుంటామంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. డప్పు పట్టుకుని.. రోజూ తెల్లవారుజామున 4 నుంచి 7 గంటల వరకు గ్రామంలో డప్పు కొడుతూ, విజిల్స్ వేస్తూ ఎవరూ ఆరుబయటకు వెళ్లొద్దంటూ భారతి పంచాయతీ సిబ్బందితో దండోరా వేయించారు. రెండు నెలల పాటు ఈ తంతు కొనసాగింది. ఇంటింటికీ తిరుగుతూ టాయిలెట్ నిర్మాణం కోసం కుటుంబాల వారీగా దరఖాస్తులు చేయించారు. ఎవరైనా మొండికేస్తే కరెంటు కనెక్షన్ తొలగించారు. దీంతో కొందరు గ్రామస్తుల్లో వ్యతిరేకత వచ్చినా క్రమంగా టాయిలెట్లు నిర్మించుకునేందుకు ముందుకొచ్చారు. ఎస్సీ కాలనీలో నిధుల కొరతతో పనుల పురోగతి లేదు. దీంతో గ్రామంలో మరో 50 ఇళ్లకు టాయిలెట్లు లేని పరిస్థితి నెలకొంది. బొల్లోనిపల్లిలో.. బొల్లోనిపల్లి సర్పంచ్ పొన్నం వనజ ఇదే తీరుగా 100 శాతం ఓడీఎఫ్ కోసం శ్రమించారు. ఈ గ్రామంలో 180 కుటుంబాలుండగా అందులో 70కి పైగా కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. దీంతో ఇతరుల వద్ద రూ. 30 వేలు అప్పు తెచ్చింది. మరుగుదొడ్ల నిర్మాణంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు చేయూతనందించింది. దీంతో ఈ గ్రామంలోని అన్ని ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించగలిగారు. పదిరోజుల్లో 2017, అక్టోబరు 17న వరంగల్‌లో ఓడీఎఫ్‌పై జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సతీశ్‌బాబు, జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి.. గ్రామంలో అన్ని ఇళ్లకు మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ భారతి మాట్లాడుతూ పది రోజుల్లో లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. దీంతో అప్పటికే పంచాయతీ పరిధిలో మరో యాభై ఇళ్లకు టాయిలెట్ల నిర్మాణం మధ్యలో ఉంది. అప్పటికే భారతి శ్రమను చూసిన గ్రామస్తులు ముందు పెట్టుబడి పెడితే బిల్లులు వచ్చాక డబ్బులు తిరిగి ఇస్తామంటూ హామీ ఇచ్చారు. దీంతో చివరి ప్రయత్నంగా తన మూడు తులాల బంగారం తాకట్టు పెట్టగా వచ్చిన రూ. 43 వేలతో అప్పటికప్పుడు మెటీరియల్ తెప్పించింది. నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం అన్ని ఇళ్లలో టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేశారు. ముల్కనూరు డెయిరీకి పాలు అమ్మగా వచ్చిన రూ. 2 లక్షలతోపాటు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మొత్తం రూ.4 లక్షల వరకు గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి భారతి వెచ్చించింది. -
లైంగిక వేధింపులు.. కీచక ఎస్ఐపై వేటు
నెల్లూరు: మహిళా సర్పంచ్‌ను లైంగికంగా వేదించిన ఎస్ఐ ఏడు కొండలుపై సస్పెన్షన్ వేటుపడింది. నెల్లూరు జిల్లాలోని సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు తన పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్‌పై లేగింక వేదింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఎస్ఐ ఏడుకొండలును సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు వూటుకూరు సర్పంచి పద్మజను గత కొంతకాలం నుంచి వేధిస్తున్నాడు. ఏడుకొండలు తనను అసభ్య పదజాలంతో వేధిస్తున్నాడని తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మహిళా సర్పంచ్‌పై వేధింపులు నిజమేనని తేలిన నేపథ్యంలో సైదాపురం ఎస్ఐని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించినట్లు సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో మహిళా సర్పంచ్ మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కింద పడ్డ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా గండే డ్ మండలం మహ్మదాబాద్ గ్రామ సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.,.. మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలం పల్లెల్ర గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి(31) తన సోదరుడు అనిల్(24)తో కలిసి మహబూబ్‌నగర్ నుంచి కోస్గి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన రెండు బైకులు పరిగి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడ్డాయి. దీంతో విజయలక్ష్మి, అనిల్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
మహిళా మణులు
నిర్మల్ గ్రామ పురస్కారాలు అందుకున్న మహిళా సర్పంచ్‌లు జిల్లాలో ఇద్దరికి.. ఆ రెండూ చల్లపల్లి మండలానికే పురస్కారాలతో మరింత బాధ్యత పెరిగిందని వెల్లడి ఆ ఇద్దరు మహిళలు శివారు గ్రామపంచాయతీలకు సర్పంచ్‌లు. అన్ని వసతులు ఉండి విద్యావంతులు, నిధులు దండిగా ఉండే పంచాయతీలు చేయలేని పనిని సవాల్‌గా చేసి చూపించారు. గ్రామీణ ప్రాంతం, అందునా నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే శివారు పంచాయతీలైన యార్లగడ్డ, వెలివోలు సర్పంచ్‌లు యార్లగడ్డ సాయిభార్గవి, తలశిల విజయకుమారి పూర్తిస్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా ఇటీవల నిర్మల్ గ్రామపురస్కారాలను అందుకున్నారు. జిల్లాలో రెండు పంచాయతీలకు ఈ పురస్కారాలు లభించగా, ఆ రెండూ చల్లపల్లి మండలానివే కావడం, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఇద్దరూ మహిళలు కావడం అభినందనీయం. సమర్థవంతమైన పాలకులు ఉంటే పల్లెలు సైతం పట్టణాలకు తీసిపోవని నిరూపిస్తున్న ఈ ఇద్దరు మహిళామణులపై ప్రత్యేక కథనం. - చల్లపల్లి చల్లపల్లి : రాష్ట్రంలో 2013 సంవత్సరానికి గాను నిర్మల్ గ్రామ పురస్కారాలకు 27 పంచాయతీలను ఎంపిక చేయగా అందులో రెండు జిల్లాకు దక్కాయి. ఆ రెండూ చల్లపల్లి మండలంలోని యార్లగడ్డ (యార్లగడ్డ సాయిభార్గవి-సర్పంచ్), వెలివోలు (తలశిల విజయకుమారి-సర్పంచ్) గ్రామపంచాయతీలకు రావడం, అందునా మహిళా సర్పంచ్‌లకు ఈ గౌరవం దక్కడం విశేషం. ఈ పురస్కారం ద్వారా యార్లగడ్డకు రూ.6 లక్షలు, వెలివోలుకు రూ.3 లక్షలు చొప్పున నగదు అవార్డు లభించింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు సిహెచ్.అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ ఇద్దరు సర్పంచ్‌లు అవార్డులను అందుకున్నారు. తొలి విడతగా యార్లగడ్డకు రూ.1.50 లక్షలు, వెలివోలుకు రూ.75 వేలు చొప్పున చెక్కులు అందజేశారు. యార్లగడ్డకు పురస్కారం ఇలా.. యార్లగడ్డ గ్రామపంచాయతీ 1950లో ఏర్పాటైంది. ప్రస్తుత జనాభా 1,950 మంది ఉండగా, యార్లగడ్డ సాయిభార్గవి సర్పంచ్‌గా ఉన్నారు. పంచాయతీ పరిధిలో 415 మరుగుదొడ్లు ఉండగా, 2013లో జాతీయ ఉపాధిహామీ పథకం కింద 47 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినందుకు గాను నిర్మల్ గ్రామ పురస్కారం లభించింది. ఈ అవార్డు కింద ఇచ్చే రూ.6 లక్షలను పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పంచాయతీ ప్రత్యేకతలు ఇవే.. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య స్వగ్రామమిది. గ్రామంలో ఎటు చూసినా పచ్చని చెట్లు, పంట పొలాలతో అలరారుతుంటుంది. పంచాయతీ కార్యాలయానికి సమీపంలో ఉన్న 18 ఎకరాల చెరువు గ్రామానికి మణిహారంలా ఉంటుంది. చుట్టూ కొబ్బరిచెట్లతో ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. గ్రామంలో ఎక్కడ చూసినా సీసీ, పక్కా రహదారులు దర్శనమిస్తుంటాయి. ఇటీవల గ్రామంలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. మరింత బాధ్యత పెరిగింది నిర్మర్ పురస్కారంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. గ్రామంలో గతంలో గ్రంథాలయం ఉండేది, ఇప్పుడు పనిచేయడం లేదు. దాన్ని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. గ్రామంలో మరిన్ని మొక్కలను నాటి సంరక్షణకు చర్యలు చేపడతాం. చెరువు మధ్యలో ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. - యార్లగడ్డ సాయిభార్గవి, సర్పంచ్, యార్లగడ్డ వెలివోలును వరించిందిలా.. వెలివోలు గ్రామపంచాయతీని 1958లో ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీలో 1,650 మంది జనాభా ఉండగా, సర్పంచ్‌గా తలశిల విజయకుమారి పాలన సాగిస్తున్నారు. గ్రామంలో 362 మరుగుదొడ్లు ఉండగా, 2013లో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 42 మరుగుదొడ్లను నిర్మించడం ద్వారా నిర్మల్ గ్రామపురస్కారం లభించింది. దీని ద్వారా రూ.3 లక్షల నగదు అందజేస్తారు. పంచాయతీ ప్రత్యేకలు ఇవే ఈ పంచాయతీలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉంది. మూడు కిలోమీటర్ల మేర గ్రామంలో 14 సిమెంట్ రహదారులున్నాయి. జెడ్పీ పరిధిలో శ్రీకాకుళం-నడకుదురులో రెండు కిలోమీటర్ల మేర తారు రోడ్డు, ఎనిమిది అంతర్గత రహదారులున్నాయి. మెట్ట పంటలకు ప్రసిద్ధి పొందిన ఈ పంచాయతీలో చెరుకు, అరటి వంటి వాణిజ్య పంటలు, ఉద్యాన వన పంటలతో పాటు పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి గాంచింది. పంచాయతీ భవనం నిర్మించాలి గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దాని స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాల్సి ఉంది. వ్యవసాయ, వాణిజ్య పంటలతో పాటు పట్టు పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తాను. - తలశిల విజయకుమారి, సర్పంచ్, వెలివోలు -
మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
తాగునీటి సమస్యపై నిలదీయడంతో మనస్తాపం మర్పల్లి : గ్రామ పంచాయతీలకు నిధుల లేమి కారణంగా ఏ పని చేపట్టలేకపోయాననే మనోవేదనతో ఓ మహిళా సర్పంచ్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. రంగారెడ్డి జిల్లా మర్పల్లి మండలం రావులపల్లిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గత ఎన్నికల్లో నాదిరిగ కములమ్మ(45) కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్‌గా గెలుపొందారు. సర్పంచ్‌గా ఎన్నిక కాగానే సొంత ఖర్చుతో గ్రామంలో మురుగునీటి కాలువలను శుభ్రం చేయడంతోపాటు, వీధి దీపాలు, పైప్‌లైన్ పనులు చేయించారు. అయితే ఇటీవల లోఓల్టేజి కారణంగా తరుచూ తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మోటార్లు కాలిపోవడంతో గ్రామంలోని ఐదోవార్డులో తాగు నీటి సమస్య తలెత్తింది. దీంతో ఆ వార్డుకు చెందిన పలువురు సోమవారం ఉదయం సర్పంచ్ ఇంటికెళ్లి తాగునీటి సమస్యపై నిలదీశారు. నిధులు రావడం లేదని కములమ్మ చెబుతున్నా వినకుండా వాగ్వాదానికి దిగి దుర్భాషలాడారు. దీంతో మనస్తాపం చెందిన కములమ్మ ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగి కాలనీవాసుల ముందే పడిపోయింది. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
పేరుకే ఆమె.. పెత్తనం ఆయనది
యాచారం: ఆకాశంలో సగం.. అన్నింటా సగం అంటున్నా.. అవకాశాలను అందిపుచ్చుకుని అడుగు ముందుకేసినా.. విమానాలు నడిపినా.. విల్లు ఎక్కుపెట్టినా.. రాజ్యాధికారం దక్కించుకున్నా.. అధికార పీఠమెక్కినా ఇంకా భర్త చాటు భార్యలే అవుతున్నారు. నడిచేది ఆమే అయినా వెనుకుండి నడిపించేది ఆయనే అవుతున్నాడు. రిజర్వేషన్లతో అధికారం చేజిక్కించుకున్నా పెత్తనం మాత్రం వారిదే. స్థానిక, ప్రాదేశిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించుకోగలిగినా... చాలామంది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఇప్పటికీ వంటిం టికే పరిమితమవుతున్నారు. గ్రామాల్లో పర్యటించినా.. సమస్యలపై అధికారుల వద్దకు వెళ్లినా.. ఓ ఎమ్మెల్యేనో.. ఎంపీనో.. మంత్రినో... కలిసినా మహిళా ప్రజాప్రతినిధుల భర్తలో.. లేక బంధువులో దర్శనమిస్తున్నారు. ప్రజలు తమ బాధలు చెప్పుకోవాలన్నా వారికే చెప్పుకోవాలి. పనులు కావాలన్నా వారే చేయాలి. మండలంలోని 20 గ్రామాల్లో తొమ్మిది మంది మహిళా సర్పంచ్‌లుగా ఎన్నికవగా, 14 ఎంపీటీసీ స్థానాల్లో ఏడుగురు మహిళలు ఎన్నికయ్యారు. ఎంపీపీ పీఠం సైతం మహిళనే వరించింది. ప్రజాప్రతినిధులుగా గెలిచినా వారు తమ అధికారాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. గ్రామ, మండల సమావేశాల్లోనో.. ప్రభుత్వ కార్యక్రమాల్లోనే అధికారికంగా కనిపిస్తున్నారు. అధికారం మాత్రం సతులకు బదులు పతులే చలాయిస్తున్నారు. అధికారులు అత్యవసర సమయాల్లో మహిళా ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని ఫోన్ చేసినా చెప్పండి పరవాలేదు అంటూ వారి గొంతే వినిపిస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది పెద్దగా చదువుకోకపోవడం కూడా వారికి కలిసివస్తోంది. మహిళా సాధికారతను కాలరాయడమే.. ‘‘రిజర్వేషన్లతో వచ్చిన అవకాశాన్ని మహిళా ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలి. పాలనా వ్యవహారాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తలు, బంధువుల జోక్యాన్ని సహించొద్దు. స్వతహాగా పరిపాలన చేసేలా చైతన్యం రావాలి. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. సమావేశాల్లో, సదస్సుల్లో బాగా మాట్లాడాలి. గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా కృషి చేయాలి’’ ఈనెల 24న మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ‘మన ఊరు-మన ప్రణాళిక ’ సమావేశంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మహిళా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన మాటలివి. ఈ మాటలు మండలంలో చర్చనీయాంశమయ్యాయి. పాలనాపరమైన అనుభవలేమి నేపథ్యంలో కొంతవరకు కుటుంబ సభ్యులు సహాయపడినా పరవాలేదు కాని మొత్తంగా అధికారాన్నే లాగేసుకోవడం మహిళా సాధికారతను కాలరాయడమే అనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా మహిళా ప్రజాప్రతినిధులు రిజర్వేషన్లతో తమకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని భావితరాలకు ఆదర్శంగా ఉండాలని తోటి మహిళలు కోరుతున్నారు.