
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): వ్యవసాయ భూమి విషయంలో చెప్పినట్లుగా వినడం లేదనే కక్షతో కొందరు ఓ దళిత మహిళా సర్పంచ్‌నే కుల, గ్రామ బహిష్కరణ చేసిన ఘనట నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఊరికి సమస్యలు వస్తే సర్పంచ్‌గా పరిష్కరించే తనకు ఊరి నుంచే కొందరి వల్ల సమస్య ఎదురు కావడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ సర్పంచ్ సోమవారం కుటుంబీకులతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి న్యాయం చేయాలని కలెక్టర్‌ను వేడుకుంది. జిల్లాలోని మెండోర మండలం బుస్సాపూర్ సర్పంచ్ జక్కుల మమత, ఆమె కుటుంబం తాతల కాలం నాటి నుంచి ఉన్న 20 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
గ్రామంలోని కొందరు అగ్ర కులాల వారు ఆ భూమిని గతంలోనే తమకు విక్రయించారని, కాగితాలపై సంతకాలు చేయాలని సర్పంచ్ మమత, ఆమె భర్త శ్రీనివాస్‌పై ఒత్తిడి చేశారు. ఈ విషయంలో ఇరువర్గాలకు చాలాసార్లు వాగ్వాదం జరిగింది. సంతకం పెట్టనందుకు మొదటగా కుల బహిష్కరణ, ఆ వెంటనే గ్రామ బహిష్కరణ చేశారని బాధిత సర్పంచ్ మమత కలెక్టర్ రామ్మోహన్‌రావుకు ఫిర్యాదు చేసింది. తనతో తన కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడినా.. పొలాల్లో పనులకు వచ్చినా.. వారికి రూ.5 వేల జరిమానా విధిస్తామని చాటింపు వేశారని వివరించారు.