
జైపూర్ : రాజస్తాన్‌లో ప్రస్తుతం అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఈ క్రమంలో తమ గ్రామ పంచాయతీ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఓ మహిళా సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి వచ్చిన జేసీబీలకు ఎదురొడ్డి వాటిని వెనక్కి పంపించారు. వివరాలు... రాజస్తాన్‌లోని మండ్వాలా గ్రామానికి రేఖా దేవి అనే మహిళ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అక్కడున్న భవనాలను అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ అధికారులు కూల్చేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆగ్రహించిన రేఖా దేవి జేసీబీలకు ఎదురుగా నిల్చుని వెనక్కి వెళ్లాల్సిందిగా సూచించారు. కానీ వాళ్లు ఇందుకు నిరాకరించడంతో జేసీబీ కొక్కాన్ని పట్టుకుని వేలాడారు. దీంతో ఆందోళనకు గురైన జేసీబీ డ్రైవర్లు వెంటనే వాటిని వెనక్కి తీసుకువెళ్లారు.
ఈ విషయం గురించి సర్పంచ్ రేఖా దేవి మాట్లాడుతూ.. ‘ అది గ్రామ పంచాయతీకి చెందిన భూమి. దానిని ఆక్రమించుకునేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయి. మేం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాం. అయితే మరోసారి దురాక్రమణకు పాల్పడేందుకు అక్కడున్న కట్టడాలు కూల్చివేస్తున్నారు. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు చర్యలు తీసుకోవడం లేదు అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment