నూటికి నూరు శాతం అంకితం చదువుల తల్లి సరస్వతే అయినా ఆడపిల్ల చదువుకు వెనుకా ముందు ఆలోచించేవారు ఇంకా ఉన్నారు. అలాంటి వారందరూ అంకితను చూసి ఆలోచన మార్చుకోవాలి. ఎందుకంటే కర్నాటక రైతు బిడ్డ అంకిత పదవ తరగతి ఫలితాల్లో 625కు 625 మార్కులు తెచ్చుకుంది. రాష్ట్రం మొత్తం మీద సెంట్ పర్సెంట్ వచ్చింది అంకితకే. ఇలాంటి అంకితలు ఎందరో ఉంటారు చదువులో ్ర΄ోత్సహిస్తే.
మే 9 వ తేదీ. ఆ ఫోన్ వచ్చేసరికి బసప్ప పొలంలో ఉన్నాడు. అవతలి వైపు ఉన్నది స్కూల్ టీచరు.
‘బసప్ప గారు మీ అమ్మాయికి పదవ తరగతిలో స్టేట్ ఫస్ట్ మార్కులు వచ్చాయి’
‘ఓ.. ఎన్ని మార్కులు వచ్చాయి సార్?’
‘ఎన్ని వచ్చాయి ఏంటి బసప్ప గారు. అంతకు మించి వేయలేక 625కు 625 వేశారు. అంత బాగా చదివింది మీ అమ్మాయి. ఇన్ని మార్కులు ఇంకెవరికీ రాలేదు’...
కర్నాటకలోని బాగల్‌కోట్‌కు దాదాపు గంట దూరంలో ఉండే చిన్న పల్లె వజ్రమట్టి. ఆ ఊరే బసప్పది. ఆరెకరాల రైతు. పెద్దమ్మాయి అంకిత. ఇంకా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వార్త తెలిశాక ఇంటికి ఆఘమేఘాల మీద చేరుకున్నాడు. మరి కాసేపటిలో ఊరు ఊరంతా ఆ ఇంటి ముందే ఉంది. సందడి చేసింది. కోలాహాలం సృష్టించింది. పులకరించింది. మరి ఒక చిన్న పల్లెటూరి నుంచి అంత బాగా చదివితే ఆ అమ్మాయిని ఆశీర్వదించకుండా ఎలా? అంకితను చూసి ప్రతి ఒక్కరూ మెటికలువిరవడమే.
హాస్టల్‌లో ఉండి
అంకిత తన ఊరికి నలభై నిమిషాల దూరంలో ఉన్న ముధోల్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుకుంది. స్కూల్ హాస్టల్‌లో ఉండి చదువుకుంటూనే సెలవుల్లో ఇంటికి వచ్చేది. ‘నేను సెల్‌ఫోన్ వాడను. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకుంటాను. డిజిటల్ లైబ్రరీలో అదనపు మెటీరియల్ చదివాను. ఉదయం ఐదుకు లేస్తాను. మళ్లీ రాత్రి చదువుతూనే నిద్ర΄ోతాను. ఇంట్లో ఉంటే ఇంటి పనులు ఏవో ఒకటి చేయాల్సి వస్తుంది.
కాని హాస్టల్‌లో ఉంటే చదువు తప్ప వేరే పనేముంది. నా పాఠాలు అయ్యాక ఆడుకోవడం కూడా నేను మానలేదు. మా స్కూల్ టీచర్లు ముందు నుంచి నాకు మంచి మార్కులు వస్తాయని ఊహించారు. వారు నాకు అన్ని విధాల స΄ోర్ట్ చేస్తూ వచ్చారు. నాకు సెంట్ పర్సెంట్ వచ్చినందుకు ఆనందమే. కాని నా కంటే మా అమ్మా నాన్నలు, స్కూల్ టీచర్లు ఎక్కువ సంతోషపడటం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. మా స్కూల్‌లో మంచి క్రమశిక్షణ ఉంటుంది. అందువల్లే నేను బాగా చదివాను‘ అని చెప్పింది అంకిత.
ఐ.ఏ.ఎస్. కావాలని
‘మా అమ్మాయి బాగా చదువుతుందనుకున్నాము గాని ఇంత బాగా చదువుతుందని అనుకోలేదు. మేము ఇక ఆమె ఎంత చదవాలంటే అంత చదివిస్తాము. ఏది చదవాలన్నా ఎంత కష్టమైనా చదివిస్తాము’ అన్నారు బసప్ప, అతని భార్య గీత. భర్తతో పాటు పొలానికి వెళ్లి పని చేసే గీత కూతురిని చూసి మురిసి΄ోతోంది. ‘నేను ఇంటర్‌లో సైన్స్ చదివి ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఐ.ఏ.ఎస్. చేస్తాను’ అంది అంకిత.
ముఖ్యమంత్రి ప్రశంస
అంకితకు వచ్చిన మార్కుల గురించి విని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభినందనలు తెలియచేశారు. ఇంకా బాగల్‌కోట్ ప్రభుత్వ అధికారులు ప్రశంసలు తెలియచేశారు. ఇక కర్నాటక డెప్యూటీ చీఫ్ మినిస్టర్ డి.కె.శివకుమార్ తానే స్వయంగా ఇంటికి వచ్చి అభినందిస్తానని కబురు పంపారు. అంకిత విజయం బాగా చదివే అమ్మాయిలందరికీ అంకితం.
Comments
Please login to add a commentAdd a comment