‘ల్యాప్‌టాప్ అనేది నా శరీరంలో ఒక భాగం అయింది’ ఇచట, అచట అనే తేడా లేకుండా ఎప్పుడూ ఆఫీసు పనిలో తలమునకలయ్యే ఉద్యోగి మాట ఇది. ‘మాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు’ అని కవి అన్నట్లు పనిభారంతో ఒత్తిడికి గురవుతున్న చాలామంది ఉద్యోగులకు జీవితం లేకుండాపోతోంది. పని కోసం జీవితాన్నే పణంగా పెట్టాల్సి వస్తోంది.
26 ఏళ్ల తన కుమార్తె మరణానికి ‘అధిక పనిభారం’ కారణం అని ఆరోపిస్తూ ఆమె తల్లి ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ చైర్మన్‌కు రాసిన లేఖ ఇంటర్‌నెట్ సెన్సేషన్ అయింది. విషపూరిత పని సంస్కృతిని ఎత్తి చూపేలా ఉన్న ఈ లేఖపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది...
కొచ్చికి చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ కొన్ని నెలల క్రితం పుణెలోని ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ కంపెనీలో చేరింది. అధిక పనిభారం కారణంగా అన్నా సెబాస్టియన్ ఆరోగ్యం త్వరగా క్షీణించిందని ఆమె తల్లి అనితా అగస్టీన్ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ హెడ్ రాజీవ్ మెమానికి రాసిన లేఖలో ఆరోపించింది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)
‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం రావడంతో అన్నా సెబాస్టియన్ చాలా సంతోషించింది. అయితే ఆ సంతోషం కొద్ది నెలల్లోనే ఆవిరై΄ోయింది. ‘అధిక పని వల్ల రాత్రి ΄÷ద్దు΄ోయే వరకు, వారాంతాల్లో కూడా పనిచేసేది. ఎప్పుడూ అలిసి΄ోయి కనిపించేది’ అని కుమార్తె గురించి రాసింది అనిత అగస్టీన్.
‘నా బిడ్డ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లిస్తుందని అనుకోలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అయింది అనిత. ‘ఎక్స్’లో ఆమె రాసిన లేఖకు రెండు మిలియన్‌లకు పైగా వ్యూస్ వచ్చాయి.
అనిత అగస్టీన్ లేఖ నేపథ్యంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో, అన్నా మృతికి సంతాపం తెలుపుతూ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించడానికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చింది.
అయితే వారి హామీ నెటిజనుల ఆగ్రహాన్ని తగ్గించలేదు.‘కంపెనీ నుండి ఎవరూ నా కుమార్తె అంత్యక్రియలకు హాజరు కాలేదు’ అంటూ అనిత వెల్లడించిన తరువాత నెటిజనుల కోపం మరింత ఎక్కువ అయింది. ‘కంటి తుడుపు మాటలు కాదు కార్యాచరణ ముఖ్యం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనితా అగస్టీన్ లేఖపై కళాకారులు, రచయితలు స్పందించారు. ‘చిన్న వయసులోనే కూతురుని కోల్పోయిన అనితను చూస్తుంటే, ఆమె రాసిన లేఖ చదువుతుంటే కన్నీళ్లు ఆపుకోవడం కష్టంగా మారింది. ఆమె అంత్యక్రియలకు హాజరు కావాలనే కనీస మర్యాద లేని యజమానులు ఉండడం సిగ్గు చేటు. కార్పొరేటు శక్తుల కోసం మీ ఆరోగ్యాన్ని, మీ జీవితాన్ని బలి చేసుకోవద్దు’ అని స్పందించింది రచయిత్రి నందితా అయ్యర్. ఒకానొక సమయంలో రోజుకు 14 గంటలకు పైగా పనిచేసిన సింగర్ పౌశాలి సాహు తన గతాన్ని గుర్తు తెచ్చుకుంది.
‘అన్నా సెబాస్టియన్ గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు భారం అవుతోంది. నా గత కాలం గుర్తుకు వస్తుంది. తీరిగ్గా కూర్చోలేని పని ఒత్తిడి... చివరికి వీకెండ్స్‌లో కూడా పనిచేయాల్సి వచ్చేది. అప్పటి పనిభారం ఇప్పటికీ ఏదో రూపంలో నాపై ప్రభావం చూపుతూనే ఉంది’ అంటూ స్పందించింది పౌశాలి సాహు.
‘మన దేశంలో పని భారం భయంకరంగా ఉంది. వేతనం నిరాశాజనకంగా ఉంది. నిత్యం కార్మికులను వేధిస్తున్న యజమానులలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు’ అని ఒక యూజర్ స్పందించాడు. అన్నా సెబాస్టియన్ మరణం హాస్టల్ కల్చర్, విషపూరిత పని ప్రదేశాల ప్రమాదాల గురించి కూడా చర్చను రేకెత్తించింది.
Comments
Please login to add a commentAdd a comment