Work stress
-
ఒత్తిడిలో ఉన్నారా...? ఉద్యోగం ఉఫ్
సంస్థలో సరదాగా అంతర్గత సర్వే అంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఖచ్చితంగా స్పందిస్తారు. సర్వేలో అడిగే ప్రశ్నలు వివాదాస్పదమైనవి కాకుండా సాధారణంగా ఉంటే ఏ ఉద్యోగి అయినా స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా సమాధానమిస్తారు. తమ అభిప్రాయాలను సంస్థ యాజమాన్యంతో పంచుకుంటారు. అలా ఉద్యోగులు చెప్పిన విషయాలే తమ ఉద్యోగం ఊడటానికి కారణమని సదలు ఉద్యోగులు తెల్సుకుని షాక్‌కు గురయ్యారు. ఉద్యోగుల్ని తొలగించే ఉద్దేశ్యం ఉంటే నేరుగా ఆ ఉద్యోగులకు చెప్పాలిగానీ ఇలా సర్వే వంకతో ఉద్యోగం నుంచి తొలగించడమేంటని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నోయిడా కేంద్రంగా పనిచేసే ఒక అంకుర సంస్థ చేసిన నిర్వాకం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. యస్ అని చెబుతున్నారా? పనివేళల్లో పని కారణంగా మీరు ఒత్తిడికి గురి అవుతున్నారా? అంటూ ‘యస్మేడమ్’అనే అంకురసంస్థ తన ఉద్యోగులతో అంతర్గత ఈమెయిల్ సర్వే చేపట్టింది. ఈ సంస్థ ఇంటి వద్ద హెయిర్ కటింగ్, మసాజ్, ఇతరత్రా బ్యూటీ, వెల్నెస్ సేవలను అందిస్తోంది. ఈ సర్వేలో భాగంగా చాలా మంది ఉద్యోగులు తమ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేశారు. వీటిని సేకరించిన సంస్థ.. ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాం అని సమాధానం చెప్పిన వారందరినీ తొలగిస్తున్నట్లు వాళ్లకు విడిగా ఈమెయిల్ సందేశాలు పంపింది. ఇతర ఉద్యోగులకు వివరణ సందేశాలు పంపింది. ‘‘ఒత్తిడి ఉందా అని మేం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి సర్వేలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీ స్పందనకు మేం చాలా విలువ ఇస్తున్నాం. పనిచేసేటప్పుడు ఒక్కరు కూడా ఒత్తిడిగా ఫీల్ అవ్వకూడదు అనేది సంస్థ సిద్ధాంతం. ఈ మేరకు ఉద్యోగుల విషయంలో సంస్థ ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. తదుపరి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’అని కంపెనీ పేర్కొంది. కంపెనీ మానవవనరుల విభాగ సారథి అషు అరోరా ఝా పేరిట వచ్చిన ఈమెయిల్ సందేశాలను చూసి సదరు ఉద్యోగులు అవాక్కయ్యారు. ‘‘ఒత్తిడిగా ఉందని చెబితే పిలిచి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలిగానీ ఇలా ఏకంగా ఉద్యోగం ఊడపీకేస్తారా? అంటూ జాబ్ కోల్పోయిన ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు. సర్వేలో ‘యస్’అని చెప్పిన దాదాపు 100 మందిని సంస్థ తొలగించిందని తెలుస్తోంది. ఇండిగో డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ డైరెక్టర్ శితిజ్ డోగ్రా చేసిన ఒక పోస్ట్‌తో ఈ ‘ఉద్యోగుల ఉద్వాసన పర్వం’వెలుగులోకి వచ్చింది. ‘‘నిజాయతీగా సమాధానం చెబితే సంస్థ ఇలాంటి మతిలేని నిర్ణయం తీసుకుంటుందా?’’అని చాలా మంది నెటిజన్లు సంస్థ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఘటనపై ఆలిండియా ఎంప్లాయీ అసోసియేషన్ స్పందించింది. ‘‘కార్మిక వ్యవస్థలోని లోపాలను కొన్ని సంస్థలు పూర్తిగా దురి్వనియోగం చేస్తున్నాయి. ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే స్తోమత లేకపోతే ముందుగా అసలు ఉద్యోగాల్లోకి తీసుకోకండి. ఆరోగ్యకరమైన ఉద్యోగ వాతావరణాన్ని కల్పించలేకపోతే ఎవరికీ ఉద్యోగం ఇవ్వకండి. పిచ్చిపిచ్చి కారణాలు చెప్పి ఉద్యోగులను మానసికంగా వేధించకండి’’అని వ్యాఖ్యానించింది. ‘‘హేతుబద్దత లోపించిన అనైతిక నిర్ణయం ఇది. ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునేందుకు సంస్థలు ఇలాంటి చవకబారు నిర్ణయాలు తీసుకుంటారని ఇప్పుడే చూస్తున్నాం. ఉద్యోగలు పనిసమయాల్లో ఒత్తిడిగా ఫీల్ అయ్యారోలేదో తెలీదుగానీ ఈ వార్త తెల్సి నిజంగా చాలా ఒత్తిడికి గురై ఉంటారు. ఇది అందరూ ఒత్తిడిగా ఫీల్ అయ్యే ఘటన’’అని పలువురు పెదవి విరిచారు. -
ఇవి ఉద్యోగాలా.. నరకంలో శిక్షలా?
పని ఒత్తిడితో 26 ఏళ్ల ఈవై కంపెనీ ఉద్యోగి విషాద మరణం దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. ఈ ఉదంతం తర్వాత పని గంటలు, విషపూరిత పని వాతావరణంపై అనేక దారుణ కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాము పనిచేసిన చోట ఎదుర్కొన్న చేదు అనుభవాలను పలువురు పంచుకుంటున్నారు.బెంగుళూరుకు చెందిన నయనతార మీనన్ అనే చెఫ్, న్యూట్రిషన్ కోచ్ తాను పనిచేసిన ఓ విలాసవంతమైన హోటల్లో ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను ఓ మ్యాగజైన్‌కు వివరిస్తూ పేర్కొన్నారు. అక్కడ ఉద్యోగులతో రోజుకు 18 నుండి 20 గంటలపాటు పని చేయిస్తారని, వ్యక్తిగత అత్యవసర పరిస్థితులకు కూడా సమయం ఇవ్వరని చెప్పారు.ఇక విధులకు ఆలస్యంగా వచ్చిన సిబ్బందిని దారుణంగా శిక్షిస్తారని తెలిపారు. రెండు గంటల పాటు చేతులు పైకెత్తి నిలబెడతారని, ఒట్టి చేతులతో రిఫ్రిజిరేటర్లను శుభ్రం చేయిస్తారని చెప్పుకొచ్చారు.నరకానికి స్వాగతం"నన్ను ఒక లగ్జరీ హోటల్లో చేర్చుకున్నప్పుడు, ప్రోగ్రామ్ డైరెక్టర్ మాకు 'వెల్కమ్ టు హెల్' అని చెప్పారు. ఆ మాటలు నిజమేనని తర్వాత తెలిసొచ్చింది. అక్కడ ఉద్యోగులకు 18-20 గంటల వర్ఖ్ షిఫ్టులు ఉన్నాయి. సీనియర్లు యువత శ్రమను వాడుకుంటారు. లైంగిక వేధింపులు సైతం ఉన్నాయి" అని నయనతార అక్కడి దారుణ పరిస్థితులను వెల్లడించారు. -
పని ఒత్తిడి పనిపడదాం..!
కొచ్చికి చెందిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ అనే మహిళ పనిభారం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. బాధితురాలి తల్లే స్వయంగా తన కూతురు మరణానికి పని ఒత్తిడి అంటూ ఆమె పనిచేసే ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీకి లేఖ రాయడంతో ఒక్కసారిగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చి సంచలనమయ్యింది. ఆ ఘటన మరువక ముందే లక్నోలో జరిగిన మరో ఘటన అందర్ని ఉలక్కిపడేలే చేసింది. ప్రైవేట్ బ్యాంకులో మంచి పొజిషన్లో పనిచేస్తున్న సదాఫ్ ఫాతిమా విధుల నిర్వర్తిస్తూనే కుర్చీలోనే కూలబడింది. ఇటీవలే ఆమెకు ప్రమోషన్ రావడంతో పని ఒత్తిడి ఎక్కువయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో మంచి పని వాతావరణం ఉద్యోగులకు కల్పించే దిశగా కొన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. అలాగే పనిచేసే మహిళలు కూడా పనిచేసే చోట ఎదురయ్యే ఒత్తిడిని, ఇంటి బాధ్యతలను ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిపై అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని మానసిక నిపుణులు అంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో అన్నింటిలో తానే బెస్ట్‌గా ఉండాలనే తాపత్రయం పని ఒత్తడికి ప్రధాన కారణం అని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ పని ఒత్తిడి ఎలా హ్యాండిల్ చేసి ఆహ్లాదభరితమైన హ్యాపీ వర్క్‌ప్లేస్‌గా మార్చకోవచ్చు అనే దాని గురించి నిపుణుల మాటల్లో సవివరంగా తెలుసుకుందాం. హ్యాపీ వర్క్‌ప్లేస్.. ఇలా!పని ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. మీరు ఏ పని విషయంలో ఒత్తిడికి గురవుతున్నారో ముందుగా గుర్తించగలగాలి. ఈ క్రమంలో అది మీకు భారంగా, మీ ఆలోచన స్థాయికి మించినట్లుగా అనిపిస్తే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పడం మంచిది. లేదంటే ఒత్తిడి తప్పదు.పని పూర్తవ్వాలని గంటల తరబడి కూర్చోకుండా.. ప్రాధాన్యమున్న పనుల్ని ముందు పూర్తి చేసుకోవాలి. తద్వారా సమయానికి పనులు పూర్తయ్యేలా చూసుకోవచ్చు.. దీనివల్ల మన కోసం మనం కేటాయించుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఇదీ ఓ మార్గమే అంటున్నారు నిపుణులు.నిరంతరాయంగా పనులు చేయడం కాకుండా గంట/రెండు గంటలకోసారి ఓ ఐదుపది నిమిషాలు విరామం తీసుకోవడం మంచిది. తద్వారా మనసుకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అలాగే ఈ సమయంలో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే శారీరకంగానూ అలసిపోకుండా జాగ్రత్తపడచ్చు.ఎంత పనున్నా నిద్ర, ఆహారం విషయాల్లో అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే ఈ రెండూ కూడా ఒత్తిడిని దూరం చేసి ఆరోగ్యాన్ని చేరువ చేసేందుకు దోహదం చేస్తాయి.పని ప్రదేశంలో అటు కొలీగ్స్‌తో, ఇటు పైఅధికారులతో ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకు భారంగా అనిపించిన పనులు, ఇతర విషయాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడచ్చు. దీనివల్లా చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది.యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు.. వంటివి కూడా ఒత్తిడిని చిత్తు చేసే సాధనాలే! కాబట్టి వీటిని రోజూ సాధన చేయడం మంచిది.ఇలా ఉద్యోగులే కాదు.. సంస్థలూ తమ ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉద్యోగులపై అదనపు పని భారాన్ని తగ్గించడంతో పాటు వేళకు పని పూర్తి చేసేలా వాళ్లను ప్రోత్సహించాలి. ఒత్తిడిని దూరం చేసేందుకు సంబంధిత నిపుణులతో ప్రత్యేక సెషన్స్ నిర్వహించడం, అప్పుడప్పుడూ వినోద కార్యక్రమాల్ని ఏర్పాటుచేయడం.. వంటివీ వారికి మేలు చేస్తాయని చెబుతున్నారు మానసిక నిపుణులు.(చదవండి: మహిళలు తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే..!) -
‘EY ఉద్యోగి చావుకు కారణం ఆ మేనేజర్ క్రికెట్ పిచ్చి’
యర్నెస్ట్ అండ్ యంగ్ (EY) సీఏ అన్నా సెబాస్టియన్ మరణం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ పని సంస్కృతిపై పెను చర్చకు దారితీసింది. ఆమె 'అధిక పని' కారణంగానే మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన అన్నా సెబాస్టియన్ పెరాయిల్ తండ్రి సీబీ జోసెఫ్ కొత్త విషయాలు చెప్పారు. ఆమె మేనేజర్‌కు ఉన్న క్రికెట్ పిచ్చే తమ కుమార్తెపై పని ఒత్తిడి పెంచిందంటూ ఆరోపిస్తున్నారు."ఆమె (అన్నా సెబాస్టియన్) మార్చి 18న అక్కడ (EY) చేరింది. ఒక వారం తర్వాత, ఆమె సాధారణ ఆడిటింగ్‌ను ప్రారంభించింది. EY పూణేలో 6 ఆడిట్ బృందాలు ఉన్నాయి. ఆమెను 6వ టీమ్‌లో చేర్చారు. ఆడిట్ మేనేజర్ పనిని సమీక్షించారు. ఆమె అర్ధరాత్రి వరకు పని చేయాల్సి వచ్చింది. ఆమె పీజీకి చేరుకున్న తర్వాత కూడా అదనపు పనిని చేయవలసి వచ్చింది.నిద్రించడానికి, తినడానికి కూడా ఆమెకు సమయం లేదు. ఆమె పని ఒత్తిడిని కలిగి ఉంది. మేనేజర్ సమయానికి పనిని సమీక్షించలేదు. అతను క్రికెట్ అభిమాని. మ్యాచ్ షెడ్యూల్‌కు అనుగుణంగా తన షెడ్యూల్‌ను మార్చాడు. దాని కారణంగా ఆమె తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి చాలా సేపు ఆలస్యంగా కూర్చోవలసి వచ్చింది.అంతటి ఒత్తడితో తాను అక్కడ పనిచేయలేనని ఏడ్చేది. రాజీనామా చేసి వచ్చేయాలని మేం కోరాం. కానీ ఆమె ఈవైలో కొనసాగాలని నిర్ణయించుకుంది. దురదృష్టవశాత్తు జూలై 21న ఆమె తన గదిలో కుప్పకూలిపోయి ఆసుపత్రికి చేరుకునేలోపు మరణించింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీబీ జోసెఫ్.#WATCH | EY employee's death allegedly due to 'overwork' | Ernakulam, Kerala: Father of EY employee Anna Sebastian Perayil, Sibi Joseph says, "... She joined there on March 18... After one week, she started the regular auditing. There are 6 audit teams in EY Pune and she was… pic.twitter.com/aMTabuAei0— ANI (@ANI) September 21, 2024 -
పని.. ప్రాణం మీదకు, ‘అన్నా’ మృతిపై ఎవరేమన్నారంటే!
‘ల్యాప్‌టాప్ అనేది నా శరీరంలో ఒక భాగం అయింది’ ఇచట, అచట అనే తేడా లేకుండా ఎప్పుడూ ఆఫీసు పనిలో తలమునకలయ్యే ఉద్యోగి మాట ఇది. ‘మాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు’ అని కవి అన్నట్లు పనిభారంతో ఒత్తిడికి గురవుతున్న చాలామంది ఉద్యోగులకు జీవితం లేకుండాపోతోంది. పని కోసం జీవితాన్నే పణంగా పెట్టాల్సి వస్తోంది.26 ఏళ్ల తన కుమార్తె మరణానికి ‘అధిక పనిభారం’ కారణం అని ఆరోపిస్తూ ఆమె తల్లి ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ చైర్మన్‌కు రాసిన లేఖ ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది. విషపూరిత పని సంస్కృతిని ఎత్తి చూపేలా ఉన్న ఈ లేఖపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది...కొచ్చికి చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ కొన్ని నెలల క్రితం పుణెలోని ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ కంపెనీలో చేరింది. అధిక పనిభారం కారణంగా అన్నా సెబాస్టియన్ ఆరోగ్యం త్వరగా క్షీణించిందని ఆమె తల్లి అనితా అగస్టీన్ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ హెడ్ రాజీవ్ మెమానికి రాసిన లేఖలో ఆరోపించింది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం రావడంతో అన్నా సెబాస్టియన్ చాలా సంతోషించింది. అయితే ఆ సంతోషం కొద్ది నెలల్లోనే ఆవిరై΄ోయింది. ‘అధిక పని వల్ల రాత్రి ΄÷ద్దు΄ోయే వరకు, వారాంతాల్లో కూడా పనిచేసేది. ఎప్పుడూ అలిసి΄ోయి కనిపించేది’ అని కుమార్తె గురించి రాసింది అనిత అగస్టీన్.‘నా బిడ్డ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లిస్తుందని అనుకోలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అయింది అనిత. ‘ఎక్స్’లో ఆమె రాసిన లేఖకు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.అనిత అగస్టీన్ లేఖ నేపథ్యంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో, అన్నా మృతికి సంతాపం తెలుపుతూ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించడానికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చింది.అయితే వారి హామీ నెటిజనుల ఆగ్రహాన్ని తగ్గించలేదు.‘కంపెనీ నుండి ఎవరూ నా కుమార్తె అంత్యక్రియలకు హాజరు కాలేదు’ అంటూ అనిత వెల్లడించిన తరువాత నెటిజనుల కోపం మరింత ఎక్కువ అయింది. ‘కంటి తుడుపు మాటలు కాదు కార్యాచరణ ముఖ్యం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అనితా అగస్టీన్ లేఖపై కళాకారులు, రచయితలు స్పందించారు. ‘చిన్న వయసులోనే కూతురుని కోల్పోయిన అనితను చూస్తుంటే, ఆమె రాసిన లేఖ చదువుతుంటే కన్నీళ్లు ఆపుకోవడం కష్టంగా మారింది. ఆమె అంత్యక్రియలకు హాజరు కావాలనే కనీస మర్యాద లేని యజమానులు ఉండడం సిగ్గు చేటు. కార్పొరేటు శక్తుల కోసం మీ ఆరోగ్యాన్ని, మీ జీవితాన్ని బలి చేసుకోవద్దు’ అని స్పందించింది రచయిత్రి నందితా అయ్యర్. ఒకానొక సమయంలో రోజుకు 14 గంటలకు పైగా పనిచేసిన సింగర్ పౌశాలి సాహు తన గతాన్ని గుర్తు తెచ్చుకుంది.‘అన్నా సెబాస్టియన్ గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు భారం అవుతోంది. నా గత కాలం గుర్తుకు వస్తుంది. తీరిగ్గా కూర్చోలేని పని ఒత్తిడి... చివరికి వీకెండ్స్‌లో కూడా పనిచేయాల్సి వచ్చేది. అప్పటి పనిభారం ఇప్పటికీ ఏదో రూపంలో నాపై ప్రభావం చూపుతూనే ఉంది’ అంటూ స్పందించింది పౌశాలి సాహు.‘మన దేశంలో పని భారం భయంకరంగా ఉంది. వేతనం నిరాశాజనకంగా ఉంది. నిత్యం కార్మికులను వేధిస్తున్న యజమానులలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు’ అని ఒక యూజర్ స్పందించాడు. అన్నా సెబాస్టియన్ మరణం హాస్టల్ కల్చర్, విషపూరిత పని ప్రదేశాల ప్రమాదాల గురించి కూడా చర్చను రేకెత్తించింది. -
జాబ్ అంటే చావేనా? ఊపిరి తీస్తున్న ఉద్యోగాలు!
కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి రానురాను విషపూరితంగా మారుతోంది. తీవ్రమైన పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతవుతున్నారు. రోజూ నిద్రాహారాలు లేకుండా 15 గంటలకు పైగా సుదీర్ఘంగా పని చేయాల్సి ఉండటంతో శారీరక, మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఒత్తిడి తాళలేక కొంత మంది తనువులు చాలిస్తున్నారు."పని ఒత్తిడి" కారణంగా ఎర్నెస్ట్ & యంగ్ (EY) కన్సల్టెంట్ 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డెలాయిట్ మాజీ ఉద్యోగి దేశంలోని కార్పొరేట్ రంగంలో విషపూరితమైన పని సంస్కృతికి సంబంధించిన తన సొంత అనుభవాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చారు. ఇండోర్‌కు చెందిన జయేష్ జైన్ తన స్వానుభవాన్ని ‘ఎక్స్’(ట్విటర్)లో వివరించారు."అన్నా ఎంత ఒత్తిడి అనుభవించిందో పూర్తిగా అర్థం చేసుకోగలను" అంటూ తాను డెలాయిట్‌లో అనుభవించిన తీవ్రమైన ఒత్తిడిని వివరించారు. వేకువజామున 5 గంటల సమయంలో వర్క్ గురించి, తద్వారా తలెత్తిన ఆరోగ్య సమస్యల గురించి సహచరులతో చర్చించిన చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.రోజులో దాదాపు 20 గంటలు పని చేసేవాళ్లమని, అయితే అన్నేసి గంటలు పనిచేసినా కూడా 15 గంటలకు మించి పని చేసినట్టుగా లాగిన్‌లో చూపేందుకు వీలుండేది కాదని రాసుకొచ్చారు. "ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు వారికి (కంపెనీలకు) ఒక ఉద్యోగి మాత్రమే. కానీ మీ కుటుంబానికి మీరే సర్వస్వం" అంటూ ఒత్తిడి గురయ్యే ఉద్యోగులను ఉద్దేశించి హితవు పలికారు. "కార్పొరేట్ జీవితమంటేనే కఠినం. తొందరగానే అక్కడి నుండి బయటపడగలిగినందుకు సంతోషిస్తున్నాను" పోస్ట్‌ను ముగించారు.With EY case getting some lights. I would like to share my personal experience at Deloitte. Attaching some screenshots of chats with my team mate - friend where we were discussing the work and our health at 5AM in the morning. We use to work for around 20 hours and they won’t… pic.twitter.com/EjtqWjhwSm— Jayesh Jain (@arey_jainsaab) September 18, 2024 -
స్త్రీలే ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు
భారతదేశంలోని చాలా మంది వర్కింగ్ మహిళలు అనుమానిస్తున్న విషయాన్ని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్ యువర్ దోస్త్ ‘ఉద్యోగుల భావోద్వేగ స్థితి’ పేరుతో ఒక తాజా నివేదికను విడుదల చేసింది. 5,000 కంటే ఎక్కువ మంది భారతీయులను సర్వే చేసింది. ఆఫీసుల్లో ఒత్తిడికి సంబంధించి మన దృష్టి కోణాన్ని మార్చే అంతర్దృష్టిని వెలికితీసింది. కార్యాలయాల్లో పనిచేసే దాదాపు మూడు వంతుల (72.2 శాతం) మంది మహిళలు అధిక ఒత్తిడి స్థాయిలను నివేదించారు. దీనికి విరుద్ధంగా, పురుషులను ‘ఒత్తిడి’కి సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు వారిలో 53.64 శాతం మంది అధిక ఒత్తిడి స్థాయిలను అనుభవిస్తున్నారని చె΄్పారు. అధిక శాతం స్త్రీలు పని – జీవిత సమతుల్యత లో΄ాన్ని నివేదించారు. 12 శాతం మంది పురుషులతో పోలిస్తే 18 శాతం మంది మహిళలు వ్యక్తిగత, వృత్తిపరమైన సమతూకం కోసం కష్టపడుతున్నారని చె΄్పారు. మహిళల ప్రధాన ఒత్తిడికి కారణం తగినంత గుర్తింపు లేక΄ోవడం, ధైర్యంగా ఉండకపోవడం, భయం వంటి సమస్యలతో ఉన్నట్టు గమనించారు. ఆందోళనకరంగా 20 శాతం మంది మహిళలు ఎప్పుడూ నీరసంగా ఉన్నట్టు నివేదించగా, 9.27 శాతం మంది పురుషులు మాత్రమే అదే భావాన్ని పంచుకున్నారు. వయసు–ఒత్తిడిఉద్యోగుల ‘ఎమోషనల్ వెల్నెస్ స్టేట్’ నివేదిక ప్రకారం మిగతా వారితో పోల్చితే 21– 30 మధ్య వయసు గల ఉద్యోగులు, కార్మికులు అత్యంత ఒత్తిడికి గురవుతున్నారు. 21– 30 సంవత్సరాల మధ్య వయసు గల 64.42 శాతం మంది ఉద్యోగులు, కార్మికులు తీవ్రస్థాయి ఒత్తిడిని అనుభవిస్తున్నట్టు నివేదించారు. 31 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల 59.81 శాతం మంది కార్మికులు కూడా ఇదే విధమైన సమస్యను నివేదించారు. తక్కువ ఒత్తిడికి గురైన వయసు సమూహం 41 నుండి 50 సంవత్సరాలు. ఈ వయసు గ్రూపులో 53.5 శాతం మంది ఉద్యోగులు మాత్రమే కార్యాలయంలో అధిక స్థాయి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు నివేదించారు. వర్క్‌ప్లేస్ డైనమిక్స్‌లో మార్పు, రిమోట్, హైబ్రిడ్ వర్క్ మోడల్స్ పరిమాణం, 21 – 30 ఏళ్ల జనాభాపై ప్రభావం చూపింది. వారికి మద్దతుగా, సంస్థలు రెగ్యులర్ కమ్యూనికేషన్, ఎంగేజ్మెంట్ ప్రాధాన్యత ఇవ్వాలి’ అని చీఫ్ సైకాలజీ ఆఫీసర్ డాక్టర్ జిని గోపీనాథ్ అన్నారు. ఐటీ అండ్ మాన్యుఫాక్చరింగ్, రవాణా, సిబ్బంది నియామకాలు, టెక్ అండ్ మీడియా, లీగల్ సర్వీస్, బిజినెస్ కన్సల్టింగ్, సేవల రంగాలలోని ఉద్యోగులను సర్వే చేసిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడి చేశారు. తగినంత గుర్తింపు లేకపోవడం, ధైర్యంగా ఉండకపోవడం, భయం వంటి సమస్యలతో మహిళలు ప్రధానంగా ఒత్తిడికి గురవుతున్నట్టు్ట మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్ ‘యువర్ దోస్త్’ తాజా నివేదికలో వెల్లడించింది. -
పని ఒత్తిడి, ఆపై జ్వరం.. ఆశ వర్కర్ మృతి
ఎ.కొండూరు (తిరువూరు): తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆశ వర్కర్ మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులో గురువారం చోటుచేసుకుంది. ఎ.కొండూరు గ్రామానికి చెందిన తోట రాధ (42) సుమారు 18 ఏళ్లుగా ఆశ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. వారం క్రితం జ్వరం బారిన పడ్డారు. రాధ జ్వరంతో బాధపడుతూనే ఫీవర్ సర్వే నిర్వహించారు. పని ఒత్తిడి పెరగడం, తీవ్ర జ్వరంతో బాధపడుతూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయించుకున్నప్పటికీ నయంకాలేదు. దీంతో తిరువూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చినఅవుటపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాధ మృతి చెందారు. మృతురాలికి భర్త, ఇద్దరు సంతానం ఉన్నారు. న్యాయం చేయాలని ధర్నా తోట రాధ కుటుంబానికి న్యాయం చేయాలంటూ సీఐటీయూ, ఆశ వర్కర్లు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు గురువారం ధర్నా చేశారు. ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.కమల, సీఐటీయూ మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వైద్యాధికారులు నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన రాధ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. మృతురాలి కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, రాధకు సెలవు ఇవ్వని అధికారులపై చర్యలు తీసుకోవాలని, రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ రియాజ్ హుస్సేన్, వైద్యాధికారులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా జ్వరంతో సర్వేలు చేయొద్దు.. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించామని ఎ.కొండూరు పీహెచ్సీ ఇన్చార్జి వైద్యాధికారి కె.శ్రీనివాసరావు చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని ఆదేశాల మేరకు మట్టి ఖర్చుల నిమిత్తం రూ.15 వేలు అందజేశామని వివరించారు. -
రోబో ఆత్మహత్య!?
సియోల్: పరీక్ష సరిగా రాయలేదని, ప్రేమ విఫలమైందని, ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు తీసుకుంటున్న జనం వార్తలను మనం చూశాం. కానీ మరమనిషి సైతం ఆత్మహత్య చేసుకుంటాడన్న వార్త వింటానికి కొత్తగా ఉన్నా ఇది నిజంగా జరిగిందని దక్షిణకొరియా వార్తాసంస్థలు కోడై కూస్తున్నాయి. రోబో సేవలను విపరీతంగా వాడే దక్షిణ కొరియాలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. డాక్యుమెంట్ల డెలివరీ వంటి పనుల్లో తెగ బిజీగా ఉండే ఓ రోబో సూసైడ్ చేసుకుందన్న వార్త సంచలనం సృష్టించింది. పని ఒత్తిడి వల్లే రోబోట్ ఆత్మహత్య చేసుకుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చక్కర్లు కొట్టి.. మెట్లపై పడి గత గురువారం సాయంత్రం గుమీ నగర సిటీ కౌన్సిల్ భవనంలో ఈ రోబో ‘సూపర్వైజర్’ బాధ్యతల్లో ఉండగా ఉన్నట్టుండి ఆగిపోయి గుండ్రంగా తిరిగి మెట్లపై నుంచి పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఏకబిగిన పని చేయాల్సి రావడంతో విపరీత పని ఒత్తిడితోనే అది ఇలా చనిపోయిందని వార్తలొచ్చాయి. అమెరికాకు చెందిన బేర్రోబోటిక్స్ సంస్థ ఈ రోబోను తయారు చేసిచి్చంది. గత ఆగస్ట్ నుంచి అది చురుగ్గా పనిచేస్తోందట. ఈ రోబోకు సొంతంగా పౌరసేవల గుర్తింపు కార్డుంది! అంటే ఒకే ఫ్లోర్లోకాకుండా లిఫ్ట్‌లో తిరుగుతూ వేర్వేరు అంతస్తుల్లో పనులు చక్కబెట్టగలదు. ఇలాంటి రోబోట్ పొరపాటున మెట్ల పై నుంచి పడిందా? లేదంటే సాంకేతిక లోపమా? లేదంటే మరేదైనా సమస్యా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. రోబో శకలాలను స్వా«దీనంచేసుకుని ల్యాబ్‌కు పంపించారు. అనూహ్య ఘటన తర్వాత ఈ బిల్డింగ్‌లో మరో రోబోను పనిలో పెట్టుకోబోమని గుమీ సిటీ కౌన్సిల్ చెప్పింది. అయితే ద.కొరియాలో రోబోట్ సేవలు అత్యధికం. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ గణాంకాల ప్రకారం ద.కొరియాలో ప్రతి పది మంది ఉద్యోగులకు ఒక పారిశ్రామిక అవసరాల రోబోట్‌ను వినియోగిస్తున్నారు. -
Women At Leisure: తీరిక వేళలో.. తీయటి జ్ఞాపకాలలో...
‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవడానికి తీరిక సమయాన్ని మించిన విలువైన సమయం లేదు’ అంటుంది సురభి యాదవ్. పని ఒత్తిడి లేని తీరిక సమయం మహిళలకు ఎలాంటిది? పాట నుంచి ఆట వరకు ప్రతి విన్యాసం, ప్రతి క్షణం అపురూపం. అలాంటి అపురూప కాలాన్ని ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ అందంగా అద్దం పడుతుంది.... మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో పుట్టి పెరిగిన సురభి యాదవ్ ఐఐటీ–దిల్లీలో బయో కెమికల్ ఇంజనీరింగ్ చేసింది. పెద్ద చదువు చదువుకున్న తొలి మహిళగా తనకు గ్రామంలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఊరు దాటి ఐఐటీ–క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన సురభికి పెద్ద ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా అనిపించింది. ఎంతోమంది వ్యక్తులు, వందలాది పుస్తకాలు, కళలు... తన ఆలోచనలను విశాలం చేశాయి.. ‘థింకింగ్... రీడింగ్... రైటింగ్’ అనేది తన ప్రధాన వ్యాపకంగా మారింది. పై చదువుల కోసం కాలిఫోర్నియాకు వెళ్లిన సురభి అక్కడినుంచి తిరిగి వచ్చిన తరువాత ఒక ఎన్జీవోలో కొంతకాలం పనిచేసింది. ఆ తరువాత ‘సఝే సప్నే’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ‘సామాజిక సేవ అనేది ప్రయోజనాన్ని ఆశించి చేసేది కాదు. అది మన జీవనవిధానంలో భాగం’ అని తండ్రి చెప్పిన మాటలు సురభి సామాజిక సేవారంగంలోకి రావడానికి కారణం అయ్యాయి. స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లో తలమునకలయ్యే సురభి యాదవ్‌లో మంచి ఫోటోగ్రాఫర్ ఉంది. ఆమె తాజా ప్రాజెక్ట్ ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ తన తల్లి జ్ఞాపకాల స్ఫూర్తితో చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం తల్లి చనిపోయింది. తల్లి గురించి బంధువులు, పరిచయస్తులతో మాట్లాడుతున్న క్రమంలో తల్లికి సంబంధించి తనకు తెలియని కొత్త విషయాలు ఎన్నో తెలిసి ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎప్పుడూ గంభీరంగా కనిపించే తల్లిలో ఒక సరదా మనిషి ఉన్నట్లు తెలియదు. ఆమెకు ఈత వచ్చు అనే విషయం తెలియదు. ‘ఇలాంటి తల్లులు ఇంకా ఎంతమంది ఉన్నారో?’ అని ఆలోచిస్తున్నప్పుడు ‘ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. తీరికవేళలలో సురభి తల్లి తన పేరు ‘బసంతి’ని పేపర్ మీద రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. ఆమె చదువుకోలేదు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులపై సంతకం పెడుతున్నప్పుడు ఆమె కళ్లలో గొప్ప వెలుగు కనిపించేది. ‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని తీరిక సమయంలో పరిశీలించాలి. అయితే పని ఒత్తిడి వల్ల ఆ తీరిక సమయాన్ని పట్టుకోవడం కష్టం. ఒకవేళ పట్టుకుంటే అరుదైన సందర్భాలను రికార్డ్ చేయవచ్చు. బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్ అలాంటి ప్రయత్నమే’ అంటుంది సురభి. ‘ఉమెన్ ఎట్ లీజర్’లో ఉన్న వెయ్యికిపైగా చిత్రాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో తీసినవి. -
డాక్టర్ గారు డ్యాన్స్ చేశారు!
పని ఒత్తిడిలో ఉన్న వారికి హాబీలే రిలాక్సేషన్. కర్నాటకలోని మంగళూరుకు చెందిన దర్శిని రేష్మా ప్రదీప్ డాక్టర్ కావాలనుకొని డ్యాన్సర్ కాలేదు. డాక్టర్ కావాలనుకున్న కలను నిజం చేసుకున్న దర్శిని ఎంత బిజీగా ఉన్నాసరే, తనలోని ‘నృత్యకళ’ను కాపాడుకుంటోంది. పని ఒత్తిడి నుంచి బయటపడడానికి, మనసు తేలిక చేసుకోవడానికి ఆమె అనుసరించే మార్గం.. డ్యాన్స్. షారుక్‌ఖాన్ హీరోగా చేసిన ‘రా.వన్’ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘చెమ్మక్ చెల్లో’ పాటకు ఆమె చేసిన డ్యాన్స్ వీడియో క్లిప్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ‘ఐ లవ్ దిస్ పార్ట్ ఆఫ్ ది సాంగ్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోక్లిప్ 2.5 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘చెమ్మకు చెల్లో’ సాంగ్ సంగతి ఎలా ఉన్నా... దర్శిని డ్యాన్స్ స్టెప్పులను చూస్తుంటే మన ‘ఇంద్ర’ సినిమాలోని ‘దాయి దాయి దామ్మా కులికే కుందనాలబొమ్మ’ వీణ స్టెప్పులు గుర్తుకొస్తున్నాయి. ‘గుడ్ డ్యాన్సింగ్’ ‘వాట్ ఏ లవ్లీ డ్యాన్స్’... మొదలైన కామెంట్స్‌తో స్పందించారు నెటిజనులు. -
బుర్ర వేడెక్కి, కాలిపోతుంది.. బర్న్ ఔట్ సిండ్రోమ్, మూన్‌లైటింగ్ అంటే?
విపరీతంగా ఆలోచించినప్పుడు బుర్ర వేడెక్కిపోయింది అంటుండటం సాధారణం. మరి అంతకంటే ఎక్కువ తీవ్రతతో కూడిన ఒత్తిడితో పని చేస్తుంటే దాన్ని కాలిపోవడంతో పోల్చవచ్చా అంటే అవునంటున్నారు వైద్యనిపుణులు. నియంత్రణ ఏమాత్రం లేకుండా, తీవ్ర ఒత్తిడితో పనిచేస్తే కలిగే దుష్ప్రభావాలను ‘‘బర్న్ ఔట్ సిండ్రోమ్’’గా చెబుతున్నారు. దీనికి ఒకింత తీవ్రత ఎక్కువగా ఉన్న మరో స్థితి కూడా ఉంది. దాని పేరే ‘మూన్‌లైటింగ్’ ఎఫెక్ట్. ఈ మాటలిప్పుడు మరింత ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఉంది. కోవిడ్ సమయంలో లాక్డౌన్ విధించడంతో కొన్ని వృత్తులవారు... ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఆమాటకొస్తే డాక్టర్లు, నర్సుల వంటి వారూ ఈ ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’, ‘మూన్ లైట్ ఎఫెక్ట్’ బారిన పడ్డట్లుగా అధ్యయనాల్లో తేలడంతో వాటి ప్రభావమిప్పుడు చర్చనీయాంశమైంది. ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’, ‘మూన్ లైట్ ఎఫెక్ట్’పై అవగాహన కల్పించే కథనమిది. లాక్డౌన్ లేని సమయంలో సాఫ్ట్వేర్ వృత్తుల వారు ఎవరి ఆఫీసుల్లో వారు.. వారి సంస్థకు చెందిన పనులు చేసుకునేవారు. లాక్డౌన్ విధించాక ఇంట్లోనే ఉండి పనిచేసుకోవచ్చనే వెసులుబాటు రావడంతో.. కొంతమంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఒకటి కంటే ఎక్కువ సంస్థల నుంచి పనులు స్వీకరించి పనిచేయడం మొదలుపెట్టారు. మామూలుగానే ఒత్తిడితో కూడిన వృత్తి.. దానికి తోడు మరిన్ని సంస్థలకు పనిచేయాల్సి రావడంతో ఏర్పడ్డ అదనపు ఒత్తిడి కారణంగా ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’కు గురికావడం ఎక్కువయ్యింది. ఒక సంస్థకు తెలియకుండా మరొక సంస్థలో పనిచేస్తూ.. ఒకటి కంటే ఎక్కువ సంస్థలకు చెందిన కార్యకలాపాలు నిర్వహించడంతో.. అనూహ్యంగా పెరిగిపోయిన తీవ్రమైన ఒత్తిడిని ‘మూన్లైట్ ఎఫెక్ట్’గా వైద్యులు పేర్కొంటున్నారు. వీటివల్ల మెదడులో అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగాలనూ, ఉపాధిని కోల్పోవడమూ జరిగిందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. చదవండి: ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా... లక్షణాలు ►తీవ్రమైన నిస్సత్తువ, పని పైన ఆసక్తి లేకపోవడం ►పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం ►వృత్తికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రతికూల ధోరణి (నెగెటివిజమ్) ►భవిష్యత్తు గురించి నిరాశాజనకంగా ఆలోచించడం ►తనను తాను ప్రోత్సహించుకుని, పని చేయడానికి పురిగొల్పుకునే ధోరణి (మోటివేటెడ్‌గా) లేకపోవడం. ‘బర్న్ఔట్’ తాలూకు తీవ్రతలూ – దశలు... ఈ దుష్ప్రభావల తీవ్రత... ఒకేసారి కాకుండా దశలవారీగా కనిపిస్తుంది. అవే... 1. హనీమూన్ ఫేజ్ : పని పెరిగినప్పటికీ అదనపు ఆదాయం సమకూరుతుండటం, డబ్బు కళ్లబడుతుండటంతో మొదట్లో చాలా ప్రోత్సాహకరంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. అందుకే దీన్ని ‘హనీమూన్ ఫేజ్’గా చెబుతారు. 2. అర్లీ స్ట్రెస్ ఫేజ్ : ఒత్తిడి తాలూకు మొదటి దశ ఇది. 3. క్రానిక్ స్ట్రెస్ ఫేజ్ : ఒత్తిడి మొదటి దశ దాటిపోయి... ఎల్లప్పుడూ అదే ఒత్తిడితో ఉండటం జరుగుతుంది. అందుకే దీన్ని ‘క్రానిక్ స్ట్రెస్ ఫేజ్’గా చెబుతారు. 4. ఎస్టాబ్లిష్డ్ బర్న్ ఔట్ : నిత్యం ఒత్తిడి కారణంగా కనిపించే దుష్ప్రభావాలు స్పష్టంగా వెల్లడవుతూ ఉండటం (ఎస్టాబ్లిష్ అవుతుండటం) వల్ల దీన్ని ఈ పేరుతో పిలుస్తారు. ఇదీ చదవండి: పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి? 5. హ్యాబిచ్యువల్ బర్న్ ఔట్ : నిత్యం కనిపించే ఒత్తిడికి పూర్తిగా అలవాటు పడిపోయి, దాన్లోంచి తప్పించుకోలేక, ఒప్పుకున్న పనినుంచి తప్పుకోలేక ఒకరకమైన నిస్పృహకూ, నిరాసక్తతకూ లోనుకావడాన్ని ‘హ్యాబిచ్యువల్ బర్న్ ఔట్’ దశగా చెప్పవచ్చు. పైగా ఈ దశలన్నీ వ్యక్తుల్లో మంచి అభివృద్ధికి తోడ్పడే కీలకమైన వయసులో అంటే 30 నుంచి 35 ఏళ్ల మధ్యన కలగడంతో తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోను కావడంతో ఆ కుటుంబం అతలాకుతలం కావడం, ఛిన్నాభిన్నమైపోవడం లాంటి పరిణామాలు సంభవిస్తుంటాయి. ఎవరిలో ఎక్కువంటే... సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాకుండా, కోవిడ్ సమయంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వైద్యవర్గాలూ ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’కు గురికావడం ఆసక్తికరమైన అంశం. గణాంకాల్ని చూసినప్పుడు ఈ వైద్యవర్గాల్లోనూ ఎమర్జెన్సీ వైద్య విభాగాల్లో పనిచేసేవారు 65%, కార్డియాలజీ విభాగానికి చెందిన వారు 43%, న్యూరోసర్జరీ విభాగాల్లో పనిచేసే వైద్యుల్లో 21% మంది దీని బారిన పడ్డారని తేలింది. వీళ్లే కాదు... ఫాస్ట్‌ఫుడ్ డెలివరీ వర్కర్లు, ట్రాఫిక్ పోలీసులు, ఫైర్ ఫైటర్లూ దీనికి గురవుతుంటారు. మహిళలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. దీనికి తోడు వ్యాయామం చేయనివాళ్లూ, ఊబకాయం ఉన్నవారూ, ఒంటరివాళ్లూ, బాగా ఎక్కువగా ఆల్కహాల్ తాగేవారిలోనూ బర్న్ఔట్ సిండ్రోమ్ బారిన పడే అవకాశాలు మరీ ఎక్కువ. మూన్‌లైటింగ్ ఎఫెక్ట్ అంటే... తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పెంచుకోవాలనే కోరికతో, ఎలాగూ తమపై ఆఫీసు నిఘా ఉండదు కాబట్టి పలుచోట్ల పనులను ఒప్పుకున్నవారు మరింత ఎక్కువ ఒత్తిడికి గురికావడాన్ని ‘మూన్‌లైటింగ్ ఎఫెక్ట్’ అంటారు. మామూలుగా మనం పగలు పనిచేస్తుంటాం. అదనపు పనిని ఒప్పుకున్నందున నిద్రమానేసి విశ్రాంతి లేకుండా రాత్రుళ్లూ పని చేస్తూ పోవడాన్ని ‘మూన్‌లైటింగ్’గా చెబుతున్నారు. మొదట్లో దీన్ని ఓ వైవిధ్యమైన పరిస్థితిగా అనుకున్నప్పటికీ విస్తృత అధ్యయనం తర్వాత ‘మూన్‌లైటింగ్’ కూడా ‘బర్న్ఔట్’ తాలూకు మరో రూపమనీ, దానికంటే ఒకింత తీవ్రత ఎక్కువని తేలింది. దీనివల్ల ఆఫీసులో జరిగే తప్పులే కాకుండా... భవిష్యత్తులో హైబీపీ, గుండెజబ్బులకూ, డిప్రెషన్‌కూ దారితీయవచ్చని పరిశోధనల్లో తేలింది. విముక్తి ఎలా... ఈ సమస్యల నుంచి బయటపడటం కూడా తేలికే. అవసరమైనంత విశ్రాంతి తీసుకోవడం, వీలైనంతవరకు మధ్యాహ్నాలు ఓ అరగంట నిద్ర (పవర్‌న్యాప్), రాత్రుళ్లు కంటి నిండా కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వీలైనంతవరకు చక్కెర పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఆల్కహాల్‌కూ, నిద్రపట్టనప్పుడు స్లీపింగ్ పిల్స్ వాడేవారు వాటికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయాలి. తమ పట్ల తాము జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే కాకుండా... ఇతరులకు సహాయం చేయడంలోని ఆనందమూ వారిని బర్న్ ఔట్ నుంచి రక్షిస్తుందని అధ్యయనాలు తేల్చాయి. అప్పటికీ నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ, అనాసక్తి వంటి లక్షణాలు చాలాకాలం పాటు కనిపిస్తుంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. మెదడుపైనా దుష్ప్రభావాలు ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలో : బర్న్ ఔట్ కారణంగా మెదడులోని ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలోని ‘గ్రే మ్యాటర్’ బాగా పలచబారినట్లు ఇటీవలి తాజా పరిశోధనలు చెబుతున్నాయి. దీని కారణంగా జ్ఞాపకశక్తి బాగా తగ్గడం, ఏ విషయాన్నైనా సమగ్రంగా ఆకళింపు చేసుకోవడంలో లోపాలు, చేసిన తప్పిదాలే మళ్లీ మళ్లీ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడంలో నైపుణ్యాలు తగ్గడం వంటి లోపాలు కనిపించాయి. టెంపోరల్ లోబ్ ప్రాంతంలో : మెదడులోని మధ్య (మీడియల్) టెంపోరల్ లోబ్ అనే చోట బాదం కాయ ఆకృతిలో ‘ఎమిగ్దలా’ అనే ఓ ప్రదేశం ఉంటుంది. (నిజానికి గ్రీకు భాషలో ఎమిగ్దలే అంటే బాదం కాయ అనే అర్థం. అందుకే దానికా పేరు). భయాలూ, ఆందోళనల్లాంటి అనేక ఉద్వేగాలకు కారణమయే, ఆవిర్భవించే ప్రదేశమది. బర్న్ ఔట్‌కు లోనైన వారిని పరిశీలించినప్పుడు వాళ్లలో ‘అమిగ్దలా’ బలంగా మారినట్లు తేలింది. ఫలితంగా తమ చుట్టూ ఉన్న ప్రపంచమంతా భయంకరంగా అనిపించడం లాంటి అనుభవాలకు గురిచేస్తుందన్న మాట. ఒకవైపు గ్రేమ్యాటర్ పలచబారడం, మరోవైపు ఎమిగ్దలా బలపడటం... ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడంతో బర్న్ఔట్ తీవ్రత మరింతగా పెరుగుతోంది. -
55% వృత్తి నిపుణుల్లో పని ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రంగాలు, విభాగాల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణుల్లో 55 శాతం మంది పని ప్రదేశాల్లో ఒత్తిళ్లకు లోనవుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. గత 18 నెలలుగా కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, ఎదురైన ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఈ ఒత్తిళ్లకు కారణమవుతున్నట్లు లింక్డ్ఇన్ సంస్థ చేపట్టిన ‘ద వర్క్‌ఫోర్స్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్’ సర్వే పేర్కొంది. ఈ ఏడాది జూలై 31 నుంచి సెస్టెంబర్ 24 వరకు దేశవ్యాప్తంగా వృత్తి నిపుణులపై నిర్వహించిన అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని మొత్తం వృత్తి నిపుణుల్లో (ఉద్యోగాలు చేస్తున్న వారు) 55 శాతం మంది పనిచేసే చోట్ల ఒత్తిళ్లకు గురవుతున్నట్లు ఈ పరిశీలన తేల్చింది. ఈ 55 శాతం మందిలో వృత్తిధర్మంలో భాగంగా చేసే పనులు–వ్యక్తిగత అవసరాల మధ్య తగిన సమన్వయం, పొంతన సాధించకపోవడం వల్ల 34 శాతం మంది, ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాల్లో తగినంతగా సంపాదించలేకపోతున్నం దువల్ల 32 శాతం మంది, వృత్తిపరంగా పురోగతి చాలా నెమ్మదిగా సాగడం వల్ల 25 శాతం మంది వృత్తినిపుణులు ఒత్తిళ్లకు గురవుతున్నారు. నిత్యం ఆఫీసుల్లో పనిని నిర్ణీత కాలానికి ముగించాలని 47 శాతం మంది భావించినా పనిఒత్తిళ్ల కారణంగా వారిలో 15 శాతం మందే అనుకున్న సమయానికి పని ముగించుకోగలుగుతున్నట్టు సర్వే తెలిపింది. అయితే ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగాలు, పనిప్రదేశాలపట్ల ప్రతి ముగ్గురిలో ఒకరు (36 శాతం) సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము చేస్తున్న ఖర్చులపై పట్టు పెంచుకోగలిగామని 30 శాతం మంది తెలిపారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న క్రమంలో మార్కెట్లో ఉద్యోగాలు సాధించే విషయంలో పోటీ పెరిగినా క్రమంగా పరిస్థితులు మెరుగవుతున్నాయనే భావనను పలువురు వెలిబుచ్చారు. పని–జీవితం మధ్య సమతూకం సాధించాలి వృత్తి నిపుణులు, ఇతర ఉద్యోగుల పని ఒత్తిళ్లను పైస్థాయిలో యజమానులు అర్థం చేసుకొని వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తమ సర్వే ద్వారా వెల్లడైందని లింక్డ్ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ అశుతోష్ ఘోష్ పేర్కొన్నారు. మారుతున్న కాలాన్ని బట్టి వృత్తి నిపుణుల ప్రాధాన్యతలు మారుతుంటాయని, రాబోయే కాలానికి అనుగుణంగా భారతీయ వృత్తి నిపుణులు తమ పని–జీవితం మధ్య సమతూకాన్ని సాధించాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోందన్నారు. -
ఉద్యోగ ఒత్తిళ్లతో అకాల మరణం ముప్పు..
లండన్ : ఒత్తిడితో కూడిన ఉద్యోగంతో సతమతమయ్యే హృద్రోగాలతో బాధపడే పురుషులు మహిళలతో పోలిస్తే అకాల మరణానికి గురయ్యే అవకాశం అధికమని తాజా అథ్యయనం వెల్లడించింది. గుండె సమస్యలతో బాధపడే పురుషులు ఉద్యోగంలో ఒత్తిడికి లోనై అకాల మృత్యువాతన పడే అవకాశం మహిళలతో పోలిస్తే ఆరు రెట్లు అధికమని పరిశోధన పేర్కొంది. ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే పురుషులు శారీరకంగా దృఢంగా ఉండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా ఈ ముప్పు అధికమని పరిశోధన హెచ్చరించింది. అయితే ఉద్యోగ ఒత్తిళ్లతో అకాల మరణానికి లోనయ్యే ముప్పు మహిళల్లో ఉంటుందని తమ పరిశోధనలో వెల్లడికాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. మహిళలతో పోలిస్తే పురుషులు ఉద్యోగ జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్ల కారణంగా వారి గుండె ధమనుల్లో రక్తం గడ్డకట్టుకునే అవకాశం అధికంగా ఉండటమే దీనికి కారణమని పరిశోధకులు చెబుతున్నారు. మహిళలు మొనోపాజ్ దశకు ముందు గుండె సమస్యలకు లోనవడం చాలా అరుదని అన్నారు. పురుషుల్లో ఈ ముప్పును తగ్గించేందుకు పనిగంటల తగ్గింపు, ఒత్తిడిని అధిగమించే చర్యలు చేపట్టడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చని అథ్యయనం చేపట్టిన యూనివర్సిటీ కాలేజ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ మికా కివిమకి సూచించారు. పెద్దల్లో పనిచేయడం ఒత్తిడికి మూలకారణమని, తరాల కిందట మన శరీరాల్లో పొందుపరిచిన ఒత్తిడిని ఎదుర్కొనే సహజ గుణాలను ఆధునిక పనిస్వభావాలు సమూలంగా నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగంలో ఒత్తిళ్లు పురుషుల్లో కరోనరీ హార్ట్ డిసీజ్, స్ర్టోక్, డయాబెటిస్‌కు దారితీసి అకాల మరణానికి గురిచేస్తాయని తమ పరిశోధనలో స్పష్టంగా వెల్లడైందని చెప్పారు. బీపీ, కొలెస్ర్టాల్ స్ధాయిలను నియంత్రణలో ఉంచుకోవడం ఒక్కటే అధిక రిస్క్‌ను దూరం చేయలేదన్నారు. 14 ఏళ్ల పాటు లక్ష మంది వైద్య రికార్డులను పరిశీలించిన మీదట పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. -
'మీ కోసం' ముచ్చెమటలు
‘మీకోసం’ ద్వారా వస్తున్న వినతుల్లో ఉంటున్న అస్పష్ట సమాచారంతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. తప్పుడు వినతుల క్రమంలో ఏం చేయాలో తెలియక చేసేది లేక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... బొబ్బిలి రూరల్: మీకోసం ద్వారా వస్తున్న అసమగ్ర సమాచారం, తప్పుడు వినతులతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో అధికారులు వినతులు తీసుకుని ఆయా మండలాలలో లేదా డివిజన్లో కార్యాలయాలకు పంపే వినతులు ఆయా అధికారులు వాటిని గుర్తించి పరిష్కరించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వారిచ్చిన చిరునామాను గుర్తించి, ఫోన్ ద్వారా వారిని సంప్రదించి వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సమస్యను అధికారులు గుర్తించి ఆనక పరిష్కరిస్తారు. సిబ్బంది ఇబ్బంది.... మీ కోసం ద్వారా వచ్చే వినతులు నెలలో 100 నుంచి 250 వరకు వస్తున్నాయి. ఈ ఏడాది పీఆర్‌కు 10,549 సమస్యలు రాగా వీటిలో 3,823 మాత్రమే అప్లోడ్ చేయగలిగారు. ఇక పరిష్కారం సంగతి అటుంచితే కార్యాలయాలలో పని చేసే రెగ్యులర్ లేదా కాంట్రాక్టు ఉద్యోగులు వాటిని గుర్తించి వచ్చిన వాటిలో నిజమైన ఆర్జీదారులను గుర్తించడం పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. వీరిని గుర్తించే సమయంలో పలువురు తాము అసలు దరఖాççస్తు చేయలేదని చెబుతున్నారని సిబ్బంది తెలిపారు. బాడంగికి చెందిన చిన్నారులు దరఖాస్తు చేసినట్లు వినతులు వస్తే ఆ ఫోన్‌కు కాల్ చేస్తే మేం ఆర్జీలు ఇవ్వలేదని వారి నుంచి సమాచారం వచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు. వచ్చిన వినతులలో 80శాతం వరకు వాస్తవంగా ఇచ్చినవి కానట్లు తెలుస్తోందని సిబ్బంది తెలిపారు. ఈ నెల 27న బొబ్బిలి పీఆర్ కార్యాలయంలో 87 దరఖాస్తులు పరిశీలించగా వీటిలో రెండు మాత్రమే వాస్తవాలని తేలిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సర్వర్ బిజీ... ఇదిలా ఉండగా ఒక్కో వినతి పరిశీలించి, వివరాలు సేకరించే సరికి కనీసం పది నిమిషాలు పడుతుంది. వాటికి రిమార్కులు రాసే సరికి మొత్తం 15నిమిషాలు సమయం పడుతుంది. ఈ సమయంలో సర్వర్లు పని చేయక అనేక మార్లు ఇబ్బంది పడుతున్నారు. పని వత్తిడి.... ఇదిలా ఉండగా సిబ్బంది అందరికీ ఓడీఎఫ్ మరుగుదొడ్లుపై అవగాహన, శాఖాపరమైన పనులు, వీడి యో కాన్ఫరెన్సులు, వీటితో పాటు ఇతరత్రా పనులు చేయలేక సిబ్బంది పని వత్తిడికి గురవుతున్నారు. మాడ్యూల్ మార్పుతో ఇక్కట్లు.... గతంలో పాత మాడ్యూల్లో ఏ శాఖకు చెందిన ఆర్జీయో...? ఏ సమస్యో వివరాలు ఉండేవి. దీంతో ఆయా శాఖకు ఆయా సమస్యపై అధికారులకు సమాచారం ఇస్తే పరిష్కారం అయ్యేవి. ప్రస్తుతం మాడ్యూల్ మార్చడంతో వీటిని గుర్తించడం సాధ్యం కావడం లేదని సిబ్బంది వాపోతున్నారు. -
మానసిక కుంగుబాటు
►నలుగురు మహిళల్లో ఒకరికి డిప్రెషన్ ►బాధితుల్లో 67 శాతం మంది ఆత్మహత్యకు యత్నం.. ►మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే కారణం ►ఏప్రెల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. సిటీబ్యూరో: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వెరసి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా దేశంలోని ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు, పది మంది పురుషుల్లో ఒకరు డిప్రెషన్(మానసిక కుంగుబాటు)కు లోనవుతున్నారు. వీరిలో 67 శాతం మంది ఆత్మహత్యాత్నానికి పాల్పడుతుండగా, మరో 45 శాతం మంది మద్యం, ఇతర మత్తుపదార్థాలకు బానిసలుగా మారుతున్నట్లు జాతీయ మానసిక ఆరోగ్య సంస్థ(2015–16)లో వెల్లడైంది. అంతేకాదు ఇది ప్రత్యక్షంగా మనిషిని మానసికంగా కుంగదీయడమే కాకుండా పరోక్షంగా డయాబెటిక్, హైపర్ టెన్షన్, కేన్సర్లకు కారణమవుతున్నట్లు గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(ఏప్రిల్ 7)సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఏటా ఒక థీమ్‌ను తీసుకుని, ఆ అంశంపై అవగాహన కల్పిస్తున్న విష యం తెలిసిందే. అయితే ఈ ఏ డాది ‘డిప్రెషన్–లెట్స్ టాక్’ అంశాన్ని థీమ్‌గా ఎంచుకోవడం విశేషం. కౌమార దశ నుంచే.. జనాభాలో 13 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు బాధితుల్లో 7.3 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. భార్యభర్తలు పిల్లలకు తగిన సమయం కేటాయించక పోవడం వల్ల వారు చిన్నతనంలోనే మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు తేలింది. భయంతో చాలా మంది చికిత్సకు ముందుకు రావడం లేదు. ధైర్యంతో ముందుకు వచ్చిన వాళ్లకు కూడా నిపుణుల కొరత కారణంగా సరైన వైద్య సేవలు అందడం లేదు. యూరప్‌లో ప్రతి లక్ష మందికి 10 మంది మానసిక నిపుణులు ఉండగా, యూఎస్ఏలో 16 మంది ఉన్నారు. మన దేశంలో ఒక్కరే ఉండటం గమనార్హం. ఇద్దరూ పని చేయడం వల్లే భార్యభర్తల్లో చాలా మంది ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్నారు. వీరు ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతూ, పిల్లలకు కనీస సమయం కేటాయిం చడంలేదు. దీంతో వారు ఇంట్లో ఒంటరిగా ఉంటూ టీవీల్లో వచ్చే నేర ప్రేరేపిత ప్రసారాలను చూస్తూ వాటిని అనుసరిస్తున్నారు. చిన్న వయసులోనే మద్యం, మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నా రు. మానసిక కుంగుబాటు వల్ల చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. – ప్రేరణ కోహ్లీ,ప్రముఖ సైక్రియాటిస్ట్, న్యూఢిల్లీ 6–9 గంటలు నిద్రపోవాలి ఒత్తిడిని జయించడం చాలా సులభం. ఏ విధమైన ఖర్చులేని, సహజ వ్యాయామమైన నడక. ప్రతి గంట నడక వ్యక్తి ఆయుఃప్రమాణాన్ని 3 నిముషాలు పెంచుతుంది. ఆరోగ్యకరమైన జీవితం గడపటానికి 6 నుంచి 9 గంటల నిద్ర అవసరం. నిద్ర సమయంలో శరీరం విశ్రాంతి తీసుకోవటం తోపాటు రోగనిరోధక శక్తిని పెంచుకుంటుంది. బాధాకరమైన అనుభవాల నుంచి బయటపడేందుకు దోహద పడుతుంది. – డాక్టర్ శివరాజు, కిమ్స్ -
పని ఒత్తిడి, సిబ్బంది కొరత - సీబీఐ
కేసుల విచారణపై హైకోర్టుకు నివేదించిన సీబీఐ హైదరాబాద్: హై ప్రొఫైల్ కేసులు, ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి, బ్యాంకులకు టోకరా.. ఇలా అనేక కేసుల విచారణలతో పని ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ఉమ్మడి హైకోర్టుకు సీబీఐ నివేదించింది. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలపై అనేక కేసులు దర్యాప్తు చేస్తున్నామని, సిబ్బంది కొరత ఉందని వివరించిం ది. తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలు, బదలాయింపులపై సీబీఐ దర్యా ప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో రాష్ట్ర మైనారిటీ కమిషన్ పిటిషన్ దాఖలు చేసింది. వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐలకు నోటీసులు జారీ చేసి, కౌంటర్ల దాఖలుకు ఆదేశించింది. దీనిపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. -
పాపం పోలీసు!
రాజధాని నేపథ్యంలో తీవ్రమైన పని ఒత్తిడి నిత్యం వీఐపీల పర్యటనలు, ఎక్కడో చోట ఆందోళనలు అమలులోకి రాని వారాంతపు సెలవు ప్రకటన సిబ్బందిని పెంచకపోగా, ఉన్న పోస్టుల్లో పలు ఖాళీలు నిలిచిపోయిన కొత్త పోలీస్స్టేషన్ల ప్రతిపాదనలు నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పోలీసులు రాజధాని పుణ్యమా అంటూ ప్రస్తుతం పరుగులు తీయాల్సి వస్తోంది. సుమారు ఏడాదిన్నర కాలం నుంచి జిల్లాకు చెందిన పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పని చేయాల్సి వస్తుందంటే అతిశయోక్తి కాదు. పెరిగిన పనిభారంతో రేయింబవళ్లు ఉక్కిరిబిక్కిరికి లోనై సతమతమవుతున్నారు. ఓ వైపు పెరిగిన నేరాల సంఖ్య, మరో వైపు ప్రముఖుల భద్రత కోసం క్షణం తీరిక లేకుండా డ్యూటీలు చేస్తున్నారు. కుటుంబం, వ్యక్తిగత జీవితంపై సైతం శ్రద్ధ కనబర్చే అవకాశం రాజధాని పోలీసులకు లేకుండా పోయింది. పని ఒత్తిడి కారణంగా మానసికంగా కుంగిపోతున్నారు. గుంటూరు : రాజధాని నిర్మాణ నేపథ్యంలో జిల్లా పోలీసుల పరిస్థితి దయనీ యంగా మారింది. ప్రధానంగా గుంటూరు నగరానికి పెరిగిన వీవీఐపీల తాకిడి, కలెక్టరేట్ వద్ద ప్రజా సమస్యలపై ఆందోళనలు, అనూహ్యంగా పెరిగిన నేరాలతో పోలీసులకు గతం కంటే పనిభారం అమాంతంగా పెరిగింది. ప్రముఖుల రక్షణ కోసం ఎండనక, వాననక తిరగాల్సి వస్తోంది. సీఎం రెస్ట్ హౌస్ వద్ద రోజుకొకరు చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ ఏ సంఘటన చోటుచేసుకున్నా అటు వైపు పరిగెత్తాల్సి వస్తోంది. నగరంలో ఊహించని విధంగా పెరిగిన ట్రాఫిక్‌ను కట్టడి చేయాలంటే తలకుమించిన భారమైంది. రాజధాని ప్రకటించినప్పటి నుంచే..... రాజధాని నిర్మాణం ప్రకటించినప్పటి నుంచి గుంటూరు రూరల్, అర్బన్ జిల్లా పోలీసులకు పనిభారం ఎక్కువైంది. వారాంతపు సెలవులు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటిం చినా సిబ్బంది కొరతతో అది ఆచరణకు నోచుకోలేదు. ఎర్రటి ఎండలో సీఎం రెస్ట్ హౌస్ వద్ద, తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతం వద్ద, వారికి కేటాయించిన పలు ప్రాంతాల్లో బందోబస్తులో విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. గుంటూరు అర్బన్ పరిధిలో 36 ఎస్ఐ పోస్టులు, ఎనిమిది హెడ్ కానిస్టేబుల్, 11 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెరిగిన పనిభారానికి తోడు సిబ్బందిని పెంచకపోగా, ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయకపోవడంతో ఆ పని భారమంతా పోలీసులపైనే పడుతోంది. భూ వివాదాలు, దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు వంటి నేరాలు పోలీసు అధికారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అటకెక్కిన కొత్త పోలీసుస్టేషన్ల ప్రతిపాదన అర్బన్ జిల్లాతోపాటు, రూరల్ జిల్లాలోని కొన్ని పోలీసు స్టేషన్లతో కలిపి ప్రత్యేక పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలని గతంలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. అయితే గుంటూరు, విజయవాడలను కలిపి సీఆర్డీఏ ప్రాంతం మొత్తాన్ని గ్రేటర్ అమరావతి పోలీసు కమిషనరేట్‌గా చేయాలని కృష్ణా జిల్లా ప్రజాప్రతి నిధులు పట్టుబట్టడంతో దీనిపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి పోలీసు కష్టాలను తీర్చాలంటూ పలువురు కోరుతున్నారు. -
పని భారం!
♦ రెవెన్యూ ఖాళీల భర్తీపై శ్రద్ధ చూపని సర్కారు ♦ రోజురోజుకూ పెరుగుతున్న పనిఒత్తిడి ♦ సతమతమవుతున్న ఉద్యోగులుz ♦ కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తే మరింత గందరగోళం రెవెన్యూ శాఖ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. పహాణీల కంప్యూటరీకరణ, భూముల క్రమబద్ధీకరణ, ఫార్మాసిటీ భూసేకరణ, ఓటర్ల ముసాయిదా రూపకల్పన ఇలా ఒకేసారి పనులను మోపడంతో యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న రెవెన్యూ విభాగాన్ని ప్రభుత్వం పటిష్టం చేయకుండా ఏకకాలంలో అద నపు విధులు అప్పగిస్తుండడం ఉద్యోగులను ఊపిరిపీల్చుకోకుండా చేస్తోంది. రాష్ట్ర బడ్జెట్లో సింహాభాగం నిధులు సమకూర్చిపెడుతున్న ఈ శాఖను బలోపేతం చేయకుండా చేతులెత్తేసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లాలో రెవెన్యూ విభాగంలో సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సర్వేయర్లు, జూనియర్/ సీనియర్ అసిస్టెంట్లు, వీఆర్ఓలు ఇలా ప్రతి కేటగిరీలోనూ ఉద్యోగుల సంఖ్య అరకొరగానే ఉంది. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా.. ఉన్నవారితో సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. ఇది ఉద్యోగులపై పనిభారాన్ని మోపుతోంది. ఈ ప్రభావం ప్రభుత్వం నిర్దేశించే పనుల మీద కనిపిస్తోంది. నగరీకరణ నేపథ్యంలో జిల్లాలో భూముల విలువలు ఆకాశన్నంటుతుండడంతో భూ వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో కోర్టు కేసులు, లోకాయుక్తలో పిటిషన్లు నమోదు కావడం.. వీటికి కౌంటర్లు దాఖలు చేయడంతో పుణ్యకాలం పూర్తవుతోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు మొదలు దిగువశ్రేణి న్యాయస్థానాల వరకు సుమారు వేయి కేసులు పెండి ంగ్‌లో ఉన్నాయి. వీటిని కొలిక్కి తెచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం తలమునకలవుతున్నా.. కిందిస్థాయిలో జరుగుతున్న పొరపాట్లతో కోర్టు ధిక్కారం, జైలు శిక్షలు తప్పడంలేదు. ఇక సాధారణ అర్జీల సంగతి సరేసరి. సమ్మెట పోటు! ప్రతి మండలంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు ఆర్ఐలు, సర్వేయరు, స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులుండాలి. అయితే, వీటిలో తహసీల్దార్, డీటీ పోస్టులు మినహా మిగతా వాటిలో చాలావరకు ఖాళీగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 43 మంది సర్వేయర్లు ఉండాల్సివుండగా.. కేవలం 20 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ (జీఓ 58,59), ఔషధనగరి, భూదాన్, మెట్రో, ఎంఎంటీఎస్ రైల్వే లైన్ల సర్వే, ఆక్రమణకు గురయ్యే భూములకు హద్దులను నిర్దేశించే ఈ విభాగాన్ని ఉద్యోగుల కొరత పట్టిపీడిస్తోంది. మరోవైపు 22ఏ భూముల పరిశీలన కూడా భారంగా మారింది. గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులకు కీలకంగా వ్యవహరించే వీఆర్ఓల సంఖ్య కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 557 పోస్టులు ఉండగా.. దీంట్లో 428 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మండలానికి ఇద్దరు ఆర్ఐలను నిర్దేశించినా.. కేవలం పట్టణ మండలాల్లోనే ఇది అమలవుతోంది. దీంతో వెబ్‌ల్యాండ్ అప్డేషన్ నత్తనడకన సాగుతోంది. ఇక సీనియర్ అసిస్టెంట్లను నియమించక పోవడం కూడా మండల కార్యాలయాల్లో పనులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. 144 పోస్టులు మంజూరు కాగా.. దీంట్లో సగం కుర్చీలు ఖాళీగానే ఉన్నాయి. ఇక జూనియర్ అసిస్టెంట్ల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని భావించవచ్చు. బ్యాక్లాగ్, పదోన్నతులతో ఈ పోస్టులను నింపుతుండడంతో కేవలం ఆరు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నిరంతరం ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతుండడంతో రెవెన్యూ పనులపై ప్రభావం చూపుతోంది. ఓటర్ల నమోదు వ్యవహారంలో రాజకీయ పక్షాలు కోర్టుకెక్కిన నేపథ్యంలో.. పని ఒత్తిడితో ఈ విధులు ఎక్కడ తమ మెడకు పడతాయోననే బెంగ ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రెవెన్యూ శాఖలో ఖాళీలను భర్తీ చేయకుండా.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ఉద్యోగుల నడ్డివిరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిర్దేశించిన పోస్టుల్లో ఉద్యోగులను నియమించిన తర్వాతే.. నయా జిల్లాల గురించి ఆలోచించాలని ఉద్యోగసంఘాలు సూచిస్తున్నాయి. అప్పుడే ఏయే జిల్లాకు ఎంత మంది అవసరమవుతారో తేలుతుందని అంటున్నాయి.