‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవడానికి తీరిక సమయాన్ని మించిన విలువైన సమయం లేదు’ అంటుంది సురభి యాదవ్. పని ఒత్తిడి లేని తీరిక సమయం మహిళలకు ఎలాంటిది?
పాట నుంచి ఆట వరకు ప్రతి విన్యాసం, ప్రతి క్షణం అపురూపం. అలాంటి అపురూప కాలాన్ని ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ అందంగా అద్దం పడుతుంది....
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో పుట్టి పెరిగిన సురభి యాదవ్ ఐఐటీ–దిల్లీలో బయో కెమికల్ ఇంజనీరింగ్ చేసింది. పెద్ద చదువు చదువుకున్న తొలి మహిళగా తనకు గ్రామంలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఊరు దాటి ఐఐటీ–క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన సురభికి పెద్ద ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా అనిపించింది. ఎంతోమంది వ్యక్తులు, వందలాది పుస్తకాలు, కళలు... తన ఆలోచనలను విశాలం చేశాయి.. ‘థింకింగ్... రీడింగ్... రైటింగ్’ అనేది తన ప్రధాన వ్యాపకంగా మారింది.
పై చదువుల కోసం కాలిఫోర్నియాకు వెళ్లిన సురభి అక్కడినుంచి తిరిగి వచ్చిన తరువాత ఒక ఎన్జీవోలో కొంతకాలం పనిచేసింది. ఆ తరువాత ‘సఝే సప్నే’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది.
‘సామాజిక సేవ అనేది ప్రయోజనాన్ని ఆశించి చేసేది కాదు. అది మన జీవనవిధానంలో భాగం’ అని తండ్రి చెప్పిన మాటలు సురభి సామాజిక సేవారంగంలోకి రావడానికి కారణం అయ్యాయి.
స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లో తలమునకలయ్యే సురభి యాదవ్‌లో మంచి ఫోటోగ్రాఫర్ ఉంది. ఆమె తాజా ప్రాజెక్ట్ ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ తన తల్లి జ్ఞాపకాల స్ఫూర్తితో చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం తల్లి చనిపోయింది. తల్లి గురించి బంధువులు, పరిచయస్తులతో మాట్లాడుతున్న క్రమంలో తల్లికి సంబంధించి తనకు తెలియని కొత్త విషయాలు ఎన్నో తెలిసి ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎప్పుడూ గంభీరంగా కనిపించే తల్లిలో ఒక సరదా మనిషి ఉన్నట్లు తెలియదు.
ఆమెకు ఈత వచ్చు అనే విషయం తెలియదు. ‘ఇలాంటి తల్లులు ఇంకా ఎంతమంది ఉన్నారో?’ అని ఆలోచిస్తున్నప్పుడు ‘ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. తీరికవేళలలో సురభి తల్లి తన పేరు ‘బసంతి’ని పేపర్ మీద రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. ఆమె చదువుకోలేదు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులపై సంతకం పెడుతున్నప్పుడు ఆమె కళ్లలో గొప్ప వెలుగు కనిపించేది.
‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని తీరిక సమయంలో పరిశీలించాలి. అయితే పని ఒత్తిడి వల్ల ఆ తీరిక సమయాన్ని పట్టుకోవడం కష్టం. ఒకవేళ పట్టుకుంటే అరుదైన సందర్భాలను రికార్డ్ చేయవచ్చు. బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్ అలాంటి ప్రయత్నమే’ అంటుంది సురభి.
‘ఉమెన్ ఎట్ లీజర్’లో ఉన్న వెయ్యికిపైగా చిత్రాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో తీసినవి.
Women At Leisure: తీరిక వేళలో.. తీయటి జ్ఞాపకాలలో...
Published Thu, Dec 21 2023 6:14 AM | Last Updated on Thu, Dec 21 2023 6:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment