Basanti
-
Women At Leisure: తీరిక వేళలో.. తీయటి జ్ఞాపకాలలో...
‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవడానికి తీరిక సమయాన్ని మించిన విలువైన సమయం లేదు’ అంటుంది సురభి యాదవ్. పని ఒత్తిడి లేని తీరిక సమయం మహిళలకు ఎలాంటిది? పాట నుంచి ఆట వరకు ప్రతి విన్యాసం, ప్రతి క్షణం అపురూపం. అలాంటి అపురూప కాలాన్ని ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ అందంగా అద్దం పడుతుంది.... మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ప్రాంతంలోని ఒక గ్రామంలో పుట్టి పెరిగిన సురభి యాదవ్ ఐఐటీ–దిల్లీలో బయో కెమికల్ ఇంజనీరింగ్ చేసింది. పెద్ద చదువు చదువుకున్న తొలి మహిళగా తనకు గ్రామంలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఊరు దాటి ఐఐటీ–క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన సురభికి పెద్ద ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లుగా అనిపించింది. ఎంతోమంది వ్యక్తులు, వందలాది పుస్తకాలు, కళలు... తన ఆలోచనలను విశాలం చేశాయి.. ‘థింకింగ్... రీడింగ్... రైటింగ్’ అనేది తన ప్రధాన వ్యాపకంగా మారింది. పై చదువుల కోసం కాలిఫోర్నియాకు వెళ్లిన సురభి అక్కడినుంచి తిరిగి వచ్చిన తరువాత ఒక ఎన్జీవోలో కొంతకాలం పనిచేసింది. ఆ తరువాత ‘సఝే సప్నే’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ‘సామాజిక సేవ అనేది ప్రయోజనాన్ని ఆశించి చేసేది కాదు. అది మన జీవనవిధానంలో భాగం’ అని తండ్రి చెప్పిన మాటలు సురభి సామాజిక సేవారంగంలోకి రావడానికి కారణం అయ్యాయి. స్వచ్ఛందసేవా కార్యక్రమాల్లో తలమునకలయ్యే సురభి యాదవ్‌లో మంచి ఫోటోగ్రాఫర్ ఉంది. ఆమె తాజా ప్రాజెక్ట్ ‘బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ తన తల్లి జ్ఞాపకాల స్ఫూర్తితో చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం తల్లి చనిపోయింది. తల్లి గురించి బంధువులు, పరిచయస్తులతో మాట్లాడుతున్న క్రమంలో తల్లికి సంబంధించి తనకు తెలియని కొత్త విషయాలు ఎన్నో తెలిసి ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎప్పుడూ గంభీరంగా కనిపించే తల్లిలో ఒక సరదా మనిషి ఉన్నట్లు తెలియదు. ఆమెకు ఈత వచ్చు అనే విషయం తెలియదు. ‘ఇలాంటి తల్లులు ఇంకా ఎంతమంది ఉన్నారో?’ అని ఆలోచిస్తున్నప్పుడు ‘ఉమెన్ ఎట్ లీజర్ టైమ్’ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. తీరికవేళలలో సురభి తల్లి తన పేరు ‘బసంతి’ని పేపర్ మీద రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. ఆమె చదువుకోలేదు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులపై సంతకం పెడుతున్నప్పుడు ఆమె కళ్లలో గొప్ప వెలుగు కనిపించేది. ‘ఒక వ్యక్తిని బాగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని తీరిక సమయంలో పరిశీలించాలి. అయితే పని ఒత్తిడి వల్ల ఆ తీరిక సమయాన్ని పట్టుకోవడం కష్టం. ఒకవేళ పట్టుకుంటే అరుదైన సందర్భాలను రికార్డ్ చేయవచ్చు. బసంతి: ఉమెన్ ఎట్ లీజర్ టైమ్ అలాంటి ప్రయత్నమే’ అంటుంది సురభి. ‘ఉమెన్ ఎట్ లీజర్’లో ఉన్న వెయ్యికిపైగా చిత్రాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో తీసినవి. -
చైతన్య చెపుతున్న నీతి పాఠం
ఇటీవల కాలంలో ఒక్క సినిమాతోనూ సత్తా చాటుతున్న యువ దర్శకులు చాలా మందే ఉన్నారు. అలా తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు చైతన్య దంతులూరి. నారా రోహిత్‌ను హీరోగా పరిచేస్తూ తెరకెక్కించిన బాణం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు చైతన్య. ఈ సినిమా కమర్షియల్‌గా ఆకట్టుకోకపోయినా.. సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సిల్వర్ స్క్రీన్ మీద కలెక్షన్ల విషయంలో వెనుకపడిన బాణం, టివి టెలికాస్ట్‌లో మంచి మార్కులు సాధించింది. బాణం సినిమా తరువాత బ్రహ్మనందం తనయుడు గౌతమ్ హీరో బసంతి సినిమాను తెరకెక్కించాడు చైతన్య. ఈ సినిమాతో కూడా తన మార్క్ చూపించాడు. అయితే మరోసారి కమర్షియల్‌గా ఆకట్టుకోలేకపోవటం చైతన్య కెరీర్‌ను కష్టాల్లో పడేసింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ యువ దర్శకుడు మరోసారి తన మార్క్ చూపించడానికి రెడీ అవుతున్నాడు. త్వరలో 'బలవంతుడు నాకేమని' అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. తన తొలిరెండు సినిమాలు టైటిల్స్ లాగానే బి అనే అక్షరంతోనే మూడో సినిమా టైటిల్ కూడా స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు చైతన్య దంతులూరి. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న..., బలవంతుడు నాకేమని సినిమాలో ఓ స్టార్ హీరో ప్రధాన పాత్రలో నటించే అవకాశం ఉంది. త్వరలోనే పూర్తి వివరాలు వెళ్లడించనున్నారు. -
ఇప్పటికీ బసంతి అనే పిలుస్తున్నారు
ముంబై : షోలే లాంటి గొప్ప చిత్రంలో తాను నటించడం గర్వంగా ఉందని బాలీవుడ్ అందాల తార, బీజేపీ ఎంపీ హేమామాలిని అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీకి షోలే చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా హేమామాలిని శనివారం తన మదిలో నిక్షిప్తమైన 'షోలే' జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఇప్పటికీ తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు, అభిమానులు తనను చుట్టుముట్టి బసంతి అని పిలుస్తారని ఆమె గుర్తు చేసుకున్నారు. షోలే చిత్రం విడుదలై 40 ఏళ్లు గడిచిన ప్రేక్షక దేవుళ్ల మదిలో ఇప్పటికీ బలంగా నిలిచి ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తనను ఈ చిత్రం మరో శకాని తీసుకువెళ్తుందని హేమామాలిని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శనివారం హేమమాలిని ట్విట్టర్లో తెలిపారు. ప్రముఖ దర్శకుడు రమేశ్ సిప్పీ దర్శకత్వంలో తెరకెక్కిన షోలే చిత్రం 1975 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, జయబాదురి సంజీవ్ కుమార్‌తోపాటు అంజాద్ ఖాన్ నటించారు. ఈ చిత్రంలో జై పాత్రలో అమితాబ్ బచ్చన్ ... వీరూ పాత్రలో ధర్మేంద్ర ... ఠాకూర్ బల్దేవ్ సింగ్ పాత్రలో సంజీవ్ కుమార్... బసంతి పాత్రలో హేమమాలిని... బందిపోటు గబ్బర్ సింగ్ పాత్రలో అంజాద్ ఖాన్ ఒదిగిపోయి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని సంభాషణలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యం చేస్తున్నాయి... చేస్తునే ఉంటాయి. -
శ్రద్ధా ‘బసంతి’..
పక్కింటి అమ్మాయిలా ఒద్దికగా కనిపించే శ్రద్ధా కపూర్.. తాజా చిత్రం ‘ఉంగ్లీ’లో ఒక్కసారిగా అవతారం మార్చేసింది. ఇందులో బసంతిగా ఐటెమ్ సాంగ్‌లో అదరగొట్టేసింది. ఈ ఐటెమ్ సాంగ్ ట్రైలర్ ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఇటీవలే ‘హైదర్’లో నటనకు ప్రశంసలు పొందిన శ్రద్ధా అమాంతం గ్లామర్ అవతారంతో కుర్రకారును ఉర్రూతలూగించే స్టెప్పులేయడం చూసి, ఆమెలో ఈ టాలెంట్ కూడా ఉందా.. అంటూ బాలీవుడ్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
మనసులో నాటుకుపోయాయి
నేను సైతం పన్నెండేళ్లకే భర్తను పోగొట్టుకున్న పసిహృదయం...పెద్దయ్యాక పచ్చని అడవుల తరపున పోరాటం చేసింది. తనకు నీడలేకపోయినా పదిమందికి తోడుగా నిలబడిన ఆమె పేరు బసంతి. ‘జీవితంతో పోరాడడం మనకెప్పటికప్పుడు తాత్కాలికం. ప్రకృతిని కాపాడుకోవడం కోసం చేసే పోరాటమే శాశ్వతమైంది’ అని చెప్పే ఈ టీచరమ్మ సాధించిన విజయం ప్రకృతి ప్రేమికులకే కాదు... పరిస్థితులు అనుకూలించని ప్రతి ఒక్క మహిళకూ ఆదర్శమే. ఉత్తరాఖాండ్‌లో అల్మొరా జిల్లాలోని ‘గాంధీ ఆశ్రమం’ బసంతి లాంటి వారికోసమే నిర్మించారు. 1980లో పన్నెండేళ్ల వయసులో భర్తను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిన బసంతి ఆశ్రమంలో చేరాక ముందు తన చదువు మీద శ్రద్ధ పెట్టింది. నాలుగో తరగతితో ఆగిపోయిన ఆమె చదువు ఆటంకం లేకుండా ఇంటర్ వరకూ వెళ్లింది. ఆ తర్వాత ‘లక్ష్మి ఆశ్రమం’లో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. ఇక్కడ వితంతు మహిళలకు ఉచితంగా విద్య నేర్పుతారు. ఒక పక్క టీచర్‌గా పనిచేస్తూనే మరో పక్క ‘మహిళా సంఘటన్స్’ పేరుతో మహిళల్ని చైతన్యపరిచే కార్యక్రమం మొదలుపెట్టింది. కొన్నాళ్లు అక్కడ పనిచేశాక తను పుట్టి పెరిగిన కొండ ప్రాంతం గుర్తుకొచ్చింది. 2002లో డెహ్రాడూన్ డెర్హాడన్ ప్రాంతంలోని కౌసాని నది ప్రాంతానికి వెళ్లి అక్కడ గిరిజన మహిళల కోసం పనిచేద్దామని బయలుదేరింది. ఈలోగా ‘అమర్ ఉజాలా’ పత్రికలో ఒక వార్త చదివింది. ‘నదుల ఒడ్డున అడవుల నరికివేత’ అనే పేరుతో వచ్చిన వార్తాకథనం బసంతిని ఆలోచనలో పడేసింది. ఇంకో పదేళ్లపాటు ఇలాగే అడవుల్ని నరుక్కుంటూ పోతే కౌసాని నది పూర్తిగా ఎండిపోయే ప్రమాదముందని ఆ కథనం సారాంశం. ఆ క్షణమే బసంతి తన లక్ష్యాన్ని నిర్ణయించుకుంది. కొండప్రాంత మహిళల అండతో అడవుల్ని నరకడాన్ని అరికట్టవచ్చనుకుంది. వంటచెరుకు కోసం అడవులబాట పట్టే మహిళల వెనకే బసంతి కూడా వెళ్లేది. అడవిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో మహిళా సర్పంచ్ పేరు పార్వతీ గోస్వామి. ఆమెతో బసంతికి ఇదివరకే పరిచయం ఉండడంతో మహిళలందర్ని ఒకచోటకు రప్పించి మాట్లాడటం తేలికైంది. ‘మీరు చెట్లను నరకడం వల్లే నదిలో నీళ్లు తగ్గిపోతున్నాయని’ చెబితే మహిళలంతా నోరెళ్లబెట్టారు. చెట్టుకు, నీటికి ఉన్న అనుబంధాన్ని వారికి తెలియజేయడానికి చాలా సమయం పట్టింది. విషయం అర్థమయ్యాక మహిళలంతా బసంతిబాటలో నడవడానికి ఒప్పుకున్నారు. మహిళలే కాపలా... అడవిలో ఎండిపోయిన మొక్కల్ని నరికి తీసుకెళ్లే హక్కు గిరిజనలకు ఉంటుంది. పచ్చటి మొక్కల్ని మాత్రం నరకొద్దు. కానీ కొండప్రాంతంలో అటవీఅధికారులు గిరిజనులను అడవిలోపలకి రాకుండా కట్టుదిట్టమైన కంచె ఏర్పాటు చేశారు. గిరిజన మహిళల సాయంతో అడవి చుట్టుపక్కలంతా తిరిగిన బసంతి ఒకరోజు అటవీఅధికారులతో మహిళలకు ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ‘పచ్చటి మొక్కలను కాపాడే బాధ్యత మీదే కాదు... మాది కూడా. ఎండిపోయిన మొక్కలను మాత్రం వంటచెరుకు కోసం తీసుకెళతాం. దీనికి మీరు అనుమతినివ్వండి’ అంటూ ఒక పత్రాన్ని పోలీసులకు ఇచ్చారు అక్కడి మహిళలు. దానికి అటవీ అధికారులు ఒప్పుకున్నారు. గిరిజన మహిళలంతా ఒక్కమాటపై నిలబడి పచ్చటి చెట్లను కొట్టకుండా కాపలా కాయడం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం పదేళ్లపాటు కొనసాగింది. ఈలోగా ఆ మహిళలు అడవిని కాపాడడంతో పాటు బసంతి దగ్గర అక్షరాలు కూడా నేర్చుకున్నారు. గడచిన పదేళ్లలో అడవిలో పెరిగిన సిందూరవృక్షాల సంఖ్యను చూసి అటవీ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ‘ఈ అడవితల్లి ప్రభుత్వానిది కాదు మీది...’ అని చెప్పిన బసంతి మాటలు గిరిజన మహిళల మనసులో నాటుకుపోయాయి. ప్రతిఫలంగా వేలసంఖ్యలో కొత్త మొలకలు మొలిచాయి కౌసాని చుట్టుపక్కల అడవిలో. -
సినిమా రివ్యూ: బసంతి
2004లో పల్లకిలో పెళ్లి కూతురు చిత్రం ద్వారా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన గౌతమ్, 'బాణం' చిత్రంతో విమర్శకుల్ని ఆకట్టుకున్న చైతన్య దంతులూరి కలయికలో 'బసంతి' చిత్రం రూపొందింది. 'బసంతి' చిత్ర విడుదలకు ముందే అగ్రహీరోల ప్రమోషన్ తో అదరగొట్టడం, మణిశర్మ సంగీతం 'బసంతి' మీద ఆశలు పెంచుకోవడానికి కారణమయ్యాయి. గౌతమ్ కి ఈ చిత్రం మూడవది. అయితే చైతన్య దంతులూరికి ఈ చిత్రం ద్వితీయ విఘ్నంగా మారిన నేపథ్యంలో 'బసంతి' ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అర్జున్(గౌతమ్) జీవితం మీద ఎలాంటి క్లారిటీ లేకుండా మిత్రులతో సరదాగా కాలం గడిపే బసంతి కాలేజ్ స్టూడెంట్. తన మిత్రుడి చెల్లెలు వివాహంలో నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ కూతురు రోష్ని(అలీషా బేగ్)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. రోష్నిని గౌతమ్ అనుకోకుండా ఓ సంఘటనతో కలుస్తాడు. తర్వాత వారిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో జరిగే జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనే విదేశీ ప్రతినిధులను చంపేందుకు ఉగ్రవాదులు పేలుళ్లకు కుట్ర పన్నుతారు. ఆ కుట్రను పోలీసులు భగ్నం చేసి దాడులకు దిగుతారు. పోలీసుల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉగ్రవాదులు బసంతి కాలేజిలోకి వెళ్లి, కాలేజి విద్యార్థులను బందీలుగా పట్టుకుంటారు. ఆ బందీలలో కమిషనర్ కూతురు కూడా ఉంటుంది. రోష్ని ఉగ్రవాదుల చెరలో ఎలా చిక్కుకుంది? ఉగ్రవాదుల చెర నుంచి రోష్నిని గౌతమ్ ఎలా రక్షించుకున్నాడు? అందుకు ఉగ్రవాదులు విధించిన కండీషన్స్ ఏంటీ? చివరకు అర్జున్, రోష్నీల కథ సుఖాంతమైందా? ఇలా కథలో భాగంగా వచ్చే పలు ప్రశ్నలకు సమాధానమే 'బసంతి' చిత్రం. అర్జున్ గా గౌతమ్ ఓ అసాధారణ కార్యక్రమాన్ని భుజాన వేసుకున్న ఓ సాధారణ కుర్రాడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. కానీ అర్జున్ పాత్ర తనకు మించిన భారమే అనే ఫీలింగ్ ను కలిగించాడు. అన్ని ఎమోషన్స్ కు ఒకే ఫీలింగ్ పలికించాడనే విమర్శ ప్రధానంగా వినిపించింది. బ్రహ్మనందం ఇమేజ్ తో తెలుగు తెరకు పరిచయమైన గౌతమ్ కు 'బసంతి' మూడవ చిత్రం. తన మూడవ చిత్రం ద్వారా సామర్ధ్యానికి మించి సాహసం చేశాడమో అనే ఫీలింగ్ కలిగించింది. తెలుగు తెరపై నటుడిగా, స్టార్ గా క్రెడిట్ ను సంపాదించుకోవాలంటే గౌతమ్ చాలా కష్టపడాల్సిందేన్న విషయం ఒకటి అర్ధమైంది. మంచి ఫెర్మార్మెన్స్ కు చాన్స్ ఉన్న రోష్ని పాత్ర అలీషా బేగ్ కు లభించింది. అయితే అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో అలీషా విఫలమైంది. గౌతమ్ తండ్రిగా తనికెళ్ల భరణి, రోష్నికి తండ్రిగా షియాజే షిండేలు తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. గౌతమ్ స్నేహితుడి గా రణధీర్, ధన్ రాజ్ లు, మిగతా పాత్రలలో కనిపించిన వారు ఓకే అనిపించారు. 'బాణం' తర్వాత సత్తా ఉన్న యువ దర్శకుడిగా చైతన్య దంతులూరిపై అన్నివర్గాల్లోనూ ఓ అభిప్రాయం నెలకొంది. దాంతో రెండో చిత్రం బసంతిని స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారనే వార్తతో అంచనాలు రెండింతలు పెరిగాయి. అయితే బసంతితో చైతన్య ఓ రకంగా ప్రేక్షకులకు అసంతృప్తి, నిరాశను పంచారనే చెప్పవచ్చు. కథ ఎంపిక ప్రధాన లోపమని ఎక్కువ మంది వెల్లడించిన అభిప్రాయం. రక్తి కట్టించే విధంగా కథనం లేకపోవడం మరో మైనస్ పాయింట్. ఉగ్రవాదం, ప్రేమ అనే యాంగిల్ లో వచ్చే చిత్రాలపై భారీ అంచనాలు ఉంటాయన్న సంగతికి దర్శకుడికి తెలిసే ఉంటుంది. వాటికి ధీటుగా 'బసంతి'ని మలచకపోవడంతో ఆకట్టుకోలేకపోయిందనే టాక్ తొలి ఆటకే నెలకొంది. సినిమా ద్వితీయార్ధం ఆ మధ్యలో వచ్చిన 'గగనం' చిత్రం మాదిరిగా ఉండటం ఆలరించలేకోయిందనే చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో ప్రధానంగా ఆకట్టుకున్న కొన్ని అంశాల గురించి ప్రస్తావించుకుందాం. చక్కని డైలాగ్స్, ఆకట్టుకునే ఫొటోగ్రఫీ, పేలవమైన కథ, కథనాన్ని మరుగున పరిచే విధంగా చిత్రానికి కొంత ఊపిరి పోసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటి అంశాలు బసంతి చిత్రానికి ఎస్సెట్ గా నిలిచాయి. పాజిటివ్ పాయింట్స్ కంటే నెగిటివ్ పాయింట్సే ఎక్కువగా కనిపించే ఈ చిత్రం ఓ మోస్తరు విజయం సాధించినా.. చైతన్య దంతులూరి ద్వితీయ విఘ్నాన్ని అధిగమించినట్టే అని భావించవచ్చు. -రాజబాబు అనుముల -
నాన్న జీవితం...ఓ వ్యక్తిత్వ వికాస పాఠం!
బ్రహ్మానందం మంచి లెక్చరర్... గొప్ప కమెడియన్... అంతకు మించి గ్రేట్ ఫాదర్! అవును... పిల్లల్ని ఎలా పెంచాలో బ్రహ్మానందం దగ్గర క్లాసులు తీసుకోవచ్చు. ఆయన తన కొడుకుల్ని క్లాసులు పీకకుండానే ఏ క్లాస్‌గా పెంచారు. ‘వీళ్లే నా ప్రాపర్టీ’ అని చెప్పుకుంటారు మురిపెంగా. ఆయన కొడుకులూ అంతే. నాన్నే తమకు ఇన్స్పిరేషన్ అని చెబుతారు గర్వంగా. ‘బసంతి’ సినిమాతో సక్సెస్ కొట్టి నాన్నకు మంచి గిఫ్ట్ ఇస్తానంటున్నాడు పెద్ద కొడుకు గౌతమ్. వీళ్లిద్దరూ మాట్లాడుతుంటే ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నట్టే అనిపిస్తుంది. మీరే చదవండి! నటుడు బ్రహ్మానందం గురించి ప్రపంచమందరికీ తెలుసు. తండ్రిగా బ్రహ్మానందం గురించి తెలుసుకోవాలని ఉంది... బ్రహ్మానందం: నాకు ఇద్దరబ్బాయిలు. పెద్దబ్బాయి గౌతమ్. వయసు 26. ‘బసంతి’ సినిమాలో హీరోగా చేశాడు. విడుదలకు సిద్ధంగా ఉంది. చిన్నోడు సిద్దార్థ. వయసు 24. వీడు కూడా ఈ ఫీల్డ్‌లోనే స్థిరపడే ఉద్దేశంలో ఉన్నాడు. (నవ్వుతూ) సార్... మేమడిగింది వాళ్ల బయోడేటా కాదు. వాళ్లతో మీకున్న అనుబంధం గురించి! బ్రహ్మానందం: అవునా! గౌతమ్ ఉన్నాడుగా వాడినడగండి... గౌతమ్: ఏ విషయంలోనైనా నాన్నే నాకు ఇన్స్పిరేషన్. నిజం చెప్పాలంటే... నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఫస్ట్ పేరు నాన్నదే ఉంటుంది. మేం ఏదైనా ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. (నవ్వుతూ) నో దాపరికమ్స్! లెక్చరర్‌గా చేశారు కాబట్టి పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలనే థాట్స్ ఎక్కువుంటాయి అని అనుకోవచ్చా? బ్రహ్మానందం: లేదండీ, నేనందుకు పూర్తి విరుద్ధం! ఇన్నేళ్లలో పిల్లల్ని కొట్టింది ఎప్పుడూ లేదు. చాలామందికి ఈ మాట నమ్మకం కలగకపోవచ్చు. (నవ్వుతూ) అయినా ఇలా చెప్పడం వల్ల నాకేమీ ‘గొప్ప తండ్రి’ అనే సర్టిఫికెట్, మెడల్స్ ఇవ్వరుగా! గౌతమ్: నిజమే... నాన్న ఎప్పుడూ ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు! బ్రహ్మానందం: ఒక్క చదువు విషయంలో మాత్రం కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండేవాణ్ణి. ఎందుకంటే చదువు ఉపయోగం ఏంటో నాకు బాగా తెలుసు. క్లాసులు పీకడాల్లాంటివి ఉండేవా? బ్రహ్మానందం: ఎప్పుడూ లేదు. అయినా నేను ఇంటికి రాగానే వాళ్లు గజగజా వణికిపోవాలనే ఫీలింగ్స్ నాకస్సలు లేవు. అందరం సరదాగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని జోక్స్ వేసుకుంటూ భోంచేస్తాం. నా గతం గురించి, నేను పడ్డ కష్టాల గురించి, షూటింగ్లలో జరిగే సంఘటనల గురించి అప్పుడప్పుడూ చెబుతుంటాను. గౌతమ్: నాన్న ఫ్లాష్‌బ్యాక్ విన్నప్పుడల్లా కదిలిపోతుంటాను. ‘ఎన్ని కష్టాలు పడి పైకొచ్చారు నాన్న’ అని! చెప్పులు కొనమంటేనే తాతయ్య తెగ కొట్టేసేవారట. నాన్న అంచెలంచెలుగా ఎదిగిన తీరు నాకో వ్యక్తిత్వ వికాస పాఠంలా అనిపిస్తుంది! ఆయన షూటింగ్స్‌లో బిజీ కదా.. మిస్సయిన ఫీలింగ్ ఎప్పుడైనా ఉండేదా? గౌతమ్: నేను చెన్నైలో ఫిఫ్త్ క్లాస్ వరకూ చదువుకున్నాను. నాన్న ఎక్కువగా హైదరాబాద్‌లో షూటింగ్స్‌లో ఉండేవారు. అప్పుడు మాత్రం మిస్సయిన ఫీలింగ్ ఉండేది. ఆ తర్వాత మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. అప్పటినుంచీ బెంగ లేదు. ఎందుకంటే ఆయన షూటింగ్ అవగానే మాతోనే టైమ్ స్పెండ్ చేసేవారు. బ్రహ్మానందంగారి అబ్బాయిగా కాలేజ్‌లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మీపై ఓ స్పెషల్ అటెన్షన్ ఉండేదా? గౌతమ్: నేనెప్పుడూ అలాంటి అటెన్షన్ కోరుకోలేదు. అందరితో కలిసిపోయి ఉండటమే నాకిష్టం. అందరితో పాటే అల్లరి చేసేవాణ్ణి. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలకూ, షికార్లకూ వెళ్లేవాణ్ణి. నాన్న కామెడీని వాళ్లతో పాటే నేనూ ఆస్వాదించేవాణ్ణి. ఇంతకూ మీ నాన్నగారి జీవితం నుంచి మీరేం తెలుసుకున్నారు? గౌతమ్: నాన్న ఎప్పుడూ చెబుతుంటారు... ‘‘గమ్యంతో పాటు గమనాన్ని కూడా ఆస్వాదించాలని! తరచు ఇంకోమాట కూడా చెబుతుంటారు... గోల్స్ ఎప్పుడూ పెట్టుకోవద్దు... పనిచేస్తూ ఉంటే ఆటోమేటిగ్గా లక్ష్యాన్ని చేరుకుంటావు’’ అని! అది నేను పూర్తిగా ఫాలో అవుతాను. నాన్నగారి నుంచి ప్రధానంగా నేర్చుకున్న అంశం? గౌతమ్: సమయపాలన! ఎవరికైనా ఆరుగంటలకు వస్తానని చెబితే అయిదు నిమిషాలు ముందే ఉంటారు. బ్రహ్మానందం: ఇదంతా నా గొప్పతనమని అంటే మాత్రం ఒప్పుకోను. పరిస్థితులే నన్నిలా తీర్చిదిద్దాయి. ఓ పేదవిద్యార్థి స్థాయి నుంచి లెక్చరర్‌గా ఎదిగాను. ఏమాత్రం ఆలస్యంగా కాలేజీకి వెళ్లినా ఉద్యోగం తీసేస్తారనే భయం. ఆ భయం నుంచే బాధ్యత పుట్టింది. మీరంటే చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చారు. మీ పిల్లల్ని కూడా అలానే ఉండమనడం కరెక్టేనా? బ్రహ్మానందం: నేనేదీ బలవంతంగా రుద్దను. ఇలా ఉండాలి... అలా ఉండాలని రూల్స్ పెట్టను. స్వేచ్ఛ ఇస్తూనే జీవితం గురించి అవగాహన పెంచాను. నాకు నా మీదే ఎక్స్పెక్టేషన్లు లేవు, వాళ్లమీదేం ఉంటాయి? వీళ్లు సినిమా ఫీల్డ్కి రాకపోయినా, పెద్ద చదువు చదవలేకపోయినా ఎక్కడైనా, ఎలాగైనా బతికేయగలరు... ఎందుకంటే వాళ్ల దగ్గర అంత సంపద ఉంది! ఇక్కడ సంపద అంటే డబ్బు కాదు. వ్యక్తిత్వం, మంచితనం! డబ్బు విషయంలో మీరు చాలా స్ట్రిక్ట్ అటగా? బ్రహ్మానందం: డబ్బు లేని స్థితి ఏమిటో బాగా తెలిసినవాణ్ణి నేను. అందుకే డబ్బుని గౌరవిస్తాను. వందమందిని కూర్చోబెట్టి లిక్కర్ పార్టీ ఇచ్చేకన్నా, ఆపదలో ఉన్నవాణ్ణి ఆ డబ్బుతో ఆదుకోవడం ఉత్తమమనేది నమ్ముతాను. 26 మందికి పెళ్లిళ్లు చేశాను, బోలెడంత మందిని చదివించానని చెప్పుకోవడం నాకే ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలకు డబ్బు విలువ కచ్చితంగా తెలిసేట్టు చేయాలి. ఇది మీ డబ్బు. అవసరాలు... అత్యవసరాలు... ఆడంబరాలు ఏవో తేల్చుకుని ఏదైనా కొనుక్కోమంటాను. చైనీస్‌లో ఓ సామెత ఉంది... ఆకలితో ఉన్నవాడికి ఒక చేపనిస్తే, వాడికి ఓరోజు ఆకలి తీరుతుంది. అదే అతనికి చేపలు పట్టడమే నేర్పిస్తే... జీవితకాలం అతని ఆకలి తీరుతుంది కదా! అని. సరే... మీ చిన్నబ్బాయ్ గురించి చెప్పండి! బ్రహ్మానందం: గౌతమ్ కామ్‌గా ఉంటాడు కానీ, సిద్ధుకి మాత్రం ఫుల్ కామెడీ టింజ్ ఉంది! నేనెప్పుడైనా కొంచెం కోపం మీద ఉన్నానంటే వాళ్లమ్మ దగ్గరకెళ్లి, ‘‘మీ ఆయన బీపీలో ఉన్నట్టున్నాడు; జాగ్రత్తగా చూసుకో; మేం బయటికెళ్తాం’’ అనేసి చల్లగా జారుకుంటాడు. ఏమైనా దేవుడు నాకు చాలా మంచి పిల్లలనిచ్చాడు. గౌతమ్: నాకున్న బెస్ట్ క్రిటిక్స్లో సిద్ధ్దూ ఒకడు. ఏదైనా మొహం మీదే చెప్పేస్తాడు. నాకేదైనా సజెషన్ కావాలన్నా, ఫస్ట్ వాణ్ణే అడుగుతాను. బ్రహ్మానందం: పిల్లలే నాకు పెద్ద ఎస్సెట్ అండీ! ఎంత సంపద, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా, పిల్లలు సరిగ్గా లేకపోతే ఏం ఆనందం ఉంటుంది చెప్పండి? సిద్దూ కూడా హీరోగా వస్తున్నాడట? బ్రహ్మానందం: ఏమో! లాస్ట్ ఇయర్ ఏమో ఎమ్‌టెక్ చేస్తానన్నాడు... ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ డెరైక్ట్ చేస్తానన్నాడు... ఇప్పుడేమో యాక్టింగ్ అంటున్నాడు. మీ అబ్బాయిల పేర్లు గౌతమ్, సిద్దార్థ అని పెట్టారు..? బ్రహ్మానందం: నాకు మొదటినుంచి బుద్ధిజం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే గౌతమ బుద్ధుని ఫిలాసఫీని బాగా చదివాను. ఆ ఇష్టంతోనే పేర్లు పెట్టాను. సరే గౌతమ్ లవ్‌స్టోరీ దగ్గరకు వద్దాం. ఈ విషయం చెప్పినపుడు మీరెలా రియాక్టయ్యారు? బ్రహ్మానందం: వాడు భయపడుతూ, ఇబ్బందిపడుతూ నా దగ్గరకొచ్చి ‘‘నేను ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్నా’’ అని చెప్పాడు. ‘‘ఎవరా అమ్మాయి? తను ఎప్పటినుంచీ తెలుసు?’’ అంటూ రెండు మూడు ప్రశ్నలడిగాను. అన్నిటికీ భయంగానే సమాధానం చెప్పాడు. వాడి సమాధానాల్లో నాకు నిజాయితీ కనిపించింది. అందుకే వెంటనే ‘ఓకే’ చెప్పేశాను. గౌతమ్: నాన్న అంత త్వరగా ఓకే చెప్తారని అస్సలు ఊహించలేదు. వెంటనే ఏడ్చేశాను. ఆ రోజు సాయంత్రమే వాళ్లని పిలిచి ముహూర్తాలు పెట్టించేశారు. బ్రహ్మానందం: పిల్లల సంతోషమే కదండీ మనకు ముఖ్యం. వాళ్లు ఏడుస్తూ ఉంటే మనం తట్టుకోగలమా? వాడికి ఆ అమ్మాయి నచ్చింది. తనతో జీవితం బావుంటుందని నమ్మాడు. నేను వాడి ప్రేమను నమ్మాను. వాడు టీనేజ్ కుర్రాడయితే, రాంగ్ డెసిషన్ అని భయపడేవాణ్ణి. వాడికి మెచ్యూర్టీ వచ్చింది. జీవితం మీద క్లారిటీ ఉంది. ఇంకెందుకు భయపడటం! మీది కూడా ప్రేమ వివాహమే కదా! బ్రహ్మానందం: పెద్దలు కుదిర్చిన, ఇష్టంతో కూడిన వివాహం మాది. మా గురువుగారికి లక్ష్మి దగ్గరి బంధువు. బ్రహ్మానందం మంచి కుర్రాడని వాళ్లే సంబంధం కుదిర్చారు. అయితే మా ఇంట్లో వాళ్లు మా పెళ్లికి ఒప్పుకోలేదు. గౌతమ్‌ని సినిమాల్లోకి తీసుకురావాలని ముందే అనుకున్నారా? బ్రహ్మానందం: మనమెవరమండీ అనుకోవడానికి! ఓసారి తన ఫ్రెండ్ శర్వానంద్‌తో కలిసి వైజాగ్ వెళ్తానంటే పంపించాను. తీరా వీళ్లు వెళ్లింది సత్యానంద్‌గారి దగ్గరకు. ఆయన నాకు ఫోన్ చేసి మీ వాడిలో మంచి ఆర్టిస్టు ఉన్నాడని చెబితే, ఏ గురువైనా తన శిష్యుడి గురించి అలాగే చెబుతాడులే అనుకున్నా. తర్వాత తర్వాత వాడిలో సీరియస్‌నెస్ చూసి ఒప్పుకున్నా. అయినా కెమెరా ముందుకు వెళ్లేంత వరకే నా పరపతి ఉపయోగపడుతుంది. ఒకసారి కెమెరా ముందుకు వెళ్లాక ఎవరి సత్తా వాళ్లు చూపించాల్సిందే. అక్కడ ట్యాగ్ లైన్లు పనిచేయవు. ‘బసంతి’ పై బాగా ఆశలు పెట్టుకున్నట్టున్నారు? బ్రహ్మానందం: వీడు యాక్ట్ చేశాడని కాదు. కథలో ఉన్న దమ్ము అలాంటిది. డెరైక్టర్ చైతన్య బాగా డీల్ చేశాడు. మునుపు అతను తీసిన ‘బాణం’కు కూడా మంచి ప్రశంస వచ్చింది. గౌతమ్: కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇప్పటికీ ఆ ఎగ్జైట్మెంట్ పోలేదు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఎదురు చూస్తున్నాను. గతంలో చేయనిది, ‘బసంతి’కి మాత్రం మీ పరపతి అంతా ఉపయోగించినట్టున్నారు..? బ్రహ్మానందం: మంచి సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాను నేను. ఇంతకుముందు ఒకతను తన ఊరివాళ్లనే ఆర్టిస్టులుగా పెట్టి ఆ ఊరి గురించి సినిమా తీస్తే, అతన్ని ఎంకరేజ్ చేశాను. ‘బసంతి’ విషయానికొస్తే - ఈ సినిమా నుంచి సమాజం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ దర్శకునిపై కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే నేను అడగ్గానే చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్, మహేష్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్, బన్నీ, రాజమౌళి, త్రివిక్రమ్, వినాయక్, శ్రీను వైట్ల, సురేందర్‌రెడ్డి, జానీలీవర్ లాంటివాళ్లు సినిమా గురించి నాలుగు మాటలు చెప్పారు. నేను కూడా సాధారణంగా ప్రివ్యూలు చూడను. కానీ ఇది చూశాను. అసలు సినిమా చూస్తున్న ఫీలింగే కలగలేదు. అంత బాగా డెరైక్ట్ చేశాడు చైతన్య. గౌతమ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. (నవ్వుతూ) నా జీన్స్ కొంతైనా ఉంటాయి కదండీ! - పులగం చిన్నారాయణ ‘నర్తనశాల’లో ఓ చిన్న ఎక్స్ప్రెషన్తో వందపేజీల మేటర్ చెప్పిన మహానటుడు ఎస్వీరంగారావుగారు. ఆయన సినిమాలు చూడు...నటన అంటే ఏంటో తెలుస్తుంది’’ అంటూ ఉంటారు నాన్న ఎప్పుడూ! జంధ్యాలగారి దర్శకత్వంలో నాన్న నటించిన సినిమాలన్నీ ఇష్టమే. ముఖ్యంగా ‘అహ నా పెళ్లంట’! ఎప్పుడు చూసినా నవ్వు వస్తూనే ఉంటుంది. ‘మనీ’లో ఖాన్‌దాదా పాత్ర కూడా నా ఫేవరెట్! -
‘బసంతి’ ఆడియో సీడీని ఆవిష్కరించిన పవన్
-
‘బసంతి’ ఆడియో సీడీని ఆవిష్కరించి పవన్‌కల్యాణ్
-
చైతన్య, గౌతమ్‌లకు బసంతితో మంచి బ్రేక్ రావాలి - పవన్‌కల్యాణ్
‘‘మొన్ననే ‘బాణం’ డీవీడీ చూశా. తెగ నచ్చేసింది. చైతన్య బాగా తీశాడు. తన రెండో సినిమా ‘బసంతి’ కూడా మంచి విజయం సాధించి, దర్శకుడు చైతన్యకు, హీరో గౌతమ్‌కి మంచి పేరు తీసుకురావాలి’’ అని పవన్‌కల్యాణ్ ఆకాంక్షించారు. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా ‘బాణం’ఫేం దంతులూరి చైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘బసంతి’. అలీషాబేగ్ కథానాయిక. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. పవన్‌కల్యాణ్ బిగ్ సీడీని, ఆడియో సీడీని ఆవిష్కరించి టి.సుబ్బిరామిరెడ్డి, గౌతమ్‌లకు అందించారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ-‘‘ఈ కథ చాలా రోజుల క్రితం విన్నాను. చాలా నచ్చింది. రిలీజ్‌కి ముందే పాటలు కూడా విన్నాను. అన్నీ హృదయాన్ని తాకాయి. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలి. దర్శకునిగా చైతన్యకు ఈ సినిమా బ్రేక్ అవ్వాలి’’ అని అభిలషించారు. ‘‘మణిశర్మగారి పాటలు వింటూ పెరిగాను. హీరో అయ్యాక... ఆయనతో పనిచేసే ఛాన్స్ కోసం ఎదురు చూశాను. ఆ అవకాశం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. ఈ సినిమాకు మణిగారిచ్చిన అయిదు పాటలూ నాకు ఫేవరెట్సే. సిన్సియారిటీ, డెడికేషన్, హార్డ్ వర్క్, సినిమా పట్ల పేషన్... ఇవన్నీ ఉన్న దర్శకుడు చైతన్య. ఈ సినిమా ద్వారా ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నేనిక్కడ నిలబడటానికి కారణం మా నాన్న. ఆయన రుణం తీర్చుకోలేనిది. ఈ రోజుని జీవితాంతం గుర్తుంచుకుంటాను. కారణం పవన్‌కల్యాణ్‌గారు ఈ వేడుకకు రావడమే. మా లాంటి యువహీరోలందరికీ స్ఫూర్తి ఆయన’’ అని గౌతమ్ చెప్పారు. ఇంకా బ్రహ్మానందం, జానిలీవర్, శేఖర్ కమ్ముల, మంచు విష్ణు, దేవకట్టా, భీమినేని, సునిల్, కేఎల్ దామోదరప్రసాద్, వివేక్ కూచిభోట్ల, వీరుపోట్ల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా విజయం సాధించాలని వీడియో ద్వారా చిరంజీవి ఆకాంక్షించారు. -
బసంతి కళాశాలలో ఏం జరిగింది?
‘షోలే’ సినిమాలో హీరోయిన్ హేమమాలిని పాత్ర పేరు ‘బసంతి’. ఆ సినిమా గుర్తున్నంత కాలం... ఈ బసంతి కూడా గుర్తుండిపోతుంది. ఇప్పుడీ ‘బసంతి’ టైటిల్‌తో దర్శకుడు చైతన్య దంతులూరి ఓ సినిమా చేస్తున్నారు. అయితే బసంతి అనేది ఇందులో హీరోయిన్ పేరు కాదట. ఓ కళాశాల పేరట. ఈ కాలేజీ నేపథ్యానికి ఉగ్రవాద సమస్యను మిళితం చేసి ఈ కథను అల్లుకున్నారట. ఆ కళాశాలలో ఏం జరిగిందన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశమట. పసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఇందులో విద్యార్థిగా హీరోచిత పాత్ర చేస్తున్నారు. అలీషా బేగ్ నాయిక. స్టార్ట్ కెమెరా పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలందిస్తున్నారు. ఈ నెల 25న పాటలను విడుదల చేయబోతున్నారు. సహనిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. కృష్ణ చైతన్య, శ్రీమణి సాహిత్యం ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు. -
ఉగ్రవాద బసంతి...
కళాశాల నేపథ్యంలో ఇప్పటివరకూ చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ నేపథ్యానికి ఉగ్రవాద సమస్యను జత చేసి ఎవ్వరూ సినిమా చేయలేదు. ‘బసంతి’ చిత్రం ఆ తరహాలోనే రూపొందుతోంది. ‘బాణం’ చిత్రంలో నక్సలిజం సమస్యని తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణగా సున్నితంగా తెరకెక్కించిన చైతన్య దంతులూరి ‘బసంతి’ని స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఇందులో కథానాయకుడు. అలీషా బేగ్ నాయిక. చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చైతన్య దంతులూరి మాట్లాడుతూ -‘‘కథా కథనాలు, సంభాషణలు, సంగీతం, ఛాయాగ్రహణం నవ్యరీతిలో ఉంటాయి. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ సినిమా తనకు మంచి బ్రేక్‌నిస్తుందని గౌతమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ బండారి, పి.కె.వర్మ, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.