ఇప్పటికీ బసంతి అనే పిలుస్తున్నారు
ముంబై : షోలే లాంటి గొప్ప చిత్రంలో తాను నటించడం గర్వంగా ఉందని బాలీవుడ్ అందాల తార, బీజేపీ ఎంపీ హేమామాలిని అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీకి షోలే చిత్రం విడుదలై 40 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా హేమామాలిని శనివారం తన మదిలో నిక్షిప్తమైన 'షోలే' జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఇప్పటికీ తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు, అభిమానులు తనను చుట్టుముట్టి బసంతి అని పిలుస్తారని ఆమె గుర్తు చేసుకున్నారు. షోలే చిత్రం విడుదలై 40 ఏళ్లు గడిచిన ప్రేక్షక దేవుళ్ల మదిలో ఇప్పటికీ బలంగా నిలిచి ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తనను ఈ చిత్రం మరో శకాని తీసుకువెళ్తుందని హేమామాలిని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శనివారం హేమమాలిని ట్విట్టర్లో తెలిపారు.
ప్రముఖ దర్శకుడు రమేశ్ సిప్పీ దర్శకత్వంలో తెరకెక్కిన షోలే చిత్రం 1975 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, జయబాదురి సంజీవ్ కుమార్తోపాటు అంజాద్ ఖాన్ నటించారు. ఈ చిత్రంలో జై పాత్రలో అమితాబ్ బచ్చన్ ... వీరూ పాత్రలో ధర్మేంద్ర ... ఠాకూర్ బల్దేవ్ సింగ్ పాత్రలో సంజీవ్ కుమార్... బసంతి పాత్రలో హేమమాలిని... బందిపోటు గబ్బర్ సింగ్ పాత్రలో అంజాద్ ఖాన్ ఒదిగిపోయి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని సంభాషణలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యం చేస్తున్నాయి... చేస్తునే ఉంటాయి.