ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడడం లేదు. భారీ బడ్జెట్ సినిమాలకు సైతం బాక్సాఫీస్ వద్ద అభిమానుల నుంచి ఆదరణ కరువవుతోంది. కానీ సినిమా హిట్ అయిందంటే చాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీల ప్రభావంతో ఎంత హిట్ సినిమా అయినా నెల రోజుల్లోపే స్ట్రీమింగ్‌కు వస్తుండడంతో థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కలెక్షన్ల పరంగా ఓకే అనుకున్నప్పటికీ తొందరగానే థియేటర్ల నుంచి కనుమరుగవుతున్నాయి.
కానీ.. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్, జవాన్, కేజీఎఫ్-2 లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఆ ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ ఆ రికార్డ్‌ను అధిగమించలేకపోయాయి. నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన ఆ రికార్డ్‌ను ఇప్పటివరకు ఏ చిత్రం దాటలేకపోయింది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.
అప్పట్లోనే అంటే.. నాలుగు దశాబ్దాల క్రితం సినిమా నెలకొల్పిన రికార్డ్ మాత్రం ఇప్పటిదాకా చెక్కు చెదరలేదు. థియేటర్లలో అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రంగా నిలిచింది ఆ మూవీనే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 కోట్ల టిక్కెట్లు అమ్ముడైన సినిమాగా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక టికెట్స్ అమ్ముడైన మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. అదే అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని నటించిన షోలే మూవీ. రమేశ్ సిప్పీ డైరెక్షన్‌లో 1975లో వచ్చిన ఈ సినిమా క్రేజీ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక టికెట్స్ విక్రయించిన సినిమాగా రికార్డులకెక్కింది.
అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన ఇండియన్ సినిమా
షోలే చిత్రాన్ని మిగతా ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ మంది థియేటర్లలో వీక్షించారు. బాక్సాఫీస్ వద్ద అందిన సమాచారం ప్రకారం 1975-80 మధ్య కాలంలో కేవలం భారతదేశంలోనే రికార్డు స్థాయిలో 18 కోట్ల టిక్కెట్లను విక్రయించారు. అంతే కాకుండా ఈ సినిమా 60 థియేటర్లలో స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంది. బొంబాయి మినర్వా థియేటర్‌లో ఏకంగా ఐదేళ్లపాటు ప్రదర్శించారు. ఈ మూవీ ఓవర్సీస్‌లో దాదాపు 2 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అప్పటోనే ఈ చిత్రం సోవియట్ రష్యాలో విడుదల కాగా..4.8 కోట్ల మంది ప్రేక్షకులు ఆదరించారు. ఇండియాతో పాటు ఓవర్‌సీస్ కలిపితే మొత్తం ఈ చిత్రం 25 కోట్ల టికెట్స్ అమ్ముడయ్యాయి.
షోలే ఫ్లాప్ టాక్..
అయితే థియేట్రికల్ రన్ ముగిసే సరికి ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల వసూళ్లు సాధించింది. మొఘల్-ఎ-ఆజామ్, మదర్ ఇండియా రికార్డులను అధిగమించింది. మొదట ఈ చిత్రానికి హిట్ టాక్ రాలేదు. మొదటి రెండు వారాల్లో ఫ్లాప్ మూవీగా ముద్ర వేశారు. కానీ చివరికీ అన్నింటిని అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించింది.
బాహుబలి, దంగల్, ఆర్‌ఆర్‌ఆర్‌లు, కేజీఎఫ్ సినిమాలు సైతం షోలేను దాటలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల కలెక్షన్స్ వచ్చినప్పటికీ టికెట్స్ అమ్మకం విషయంలో అధిగమించలేకపోయాయి. బాహుబలి -2 ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 20 కోట్ల ప్రేక్షకులు వీక్షించగా.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ చాప్టర్ -2 చిత్రాలకు పది కోట్ల మంది థియేటర్లకు వచ్చారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం దంగల్ కూడా 10 కోట్ల మంది మాత్రమే థియేటర్లలో వీక్షించారు. గతేడాది రిలీజైన షారూక్ ఖాన్ జవాన్ కేవలం రూ.4 కోట్ల మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ రోజుల్లో చాలా సినిమాలు కోటి టిక్కెట్ల అమ్మకాలు కూడా దాటలేకపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment