ఒక పర్‌ఫెక్షనిస్ట్ చెక్కిన సినీ శిల్పం... షోలే రమేశ్ సిప్పికి నేడు 74వ జన్మదినం జరుపుకొని 75 లోకి అడుగుపెడుతున్నాడు. ఇంకో నాలుగేళ్లకు షోలే వచ్చి 50 ఏళ్లు అవుతుంది. రమేష్ సిప్పి, షోలే, భారతీయ కమర్షియల్ సినిమా వేరు వేరు కాదు. వాటిని ఒక స్థాయికి తీసుకెళ్లి పెద్ద సినిమాల రథానికి బావుటా కట్టి పరిగెత్తించినవాడు అతడు. సగటు ప్రేక్షకులను గట్టి కథతో రంజింప చేయవచ్చని నమ్మి అతడు తీసి షోలే నేటికీ కోట్లాది ప్రేక్షకులకు ఆరాధ్య చిత్రం.
దర్శకుడు రమేశ్ సిప్పి పూనుకోకపోతే, ధైర్యం చేయకపోతే, హ్యూజ్‌గా ఇమేజిన్ చేయకపోతే భారతీయులు గర్వంగా చెప్పుకోవడానికి, ఆరాధించడానికి, పదే పదే చూడటానికి ‘షోలే’ ఉండేది కాదేమో. ‘సుపుత్రా కొంప పీకరా’ అని సామెత. కాని రమేష్ సిప్పీ ‘సుపుత్రా గంపకెత్తరా’ అన్నట్టు తండ్రి జి.పి.సిప్పీ చేత భారీ పెట్టుబడి పెట్టించి, ‘షోలే’ తీయించి దాని మీద తరతరాలు డబ్బు గంపకెత్తేలా చేశాడు. 1975లో మూడు కోట్లతో తీసిన సినిమా అది. కాని ఎంత వసూలు చేసిందో తెలుసా ఆ రోజుల్లో? 35 కోట్లు. అంటే ఇవాళ్టి లెక్కలో 800 కోట్ల రూపాయలు. అదీ ఫస్ట్ రీలీజ్‌లో. ఆ తర్వాత షోలే సంవత్సరాల తరబడి రీ రిలీజ్ అవుతూనే ఉండింది. కోట్లు సంపాదిస్తూనే ఉండింది. సిప్పీలకు చిల్లర ఖర్చు కావాల్సినప్పుడల్లా షోలే రిలీజ్ చేస్తుంటారన్న జోక్ కూడా ఉంది.
రమేశ్ సిప్పి తండ్రి జి.పి.సిప్పిని చూసి సినిమాల్లోకి వచ్చాడు. జావేద్ అఖ్తర్‌లతో స్నేహం కట్టి ‘సీతా ఔర్ గీతా’ తీశాడు. ఆ సినిమా హిట్ అయ్యాక ‘అబ్బాయ్... ఏదైనా పెద్ద సినిమా తీయరా’ అని తండ్రి కోరితే అకిరా కురసావా ‘సెవన్ సమురాయ్’, హిందీలో వచ్చిన ‘మేరా గావ్ మేరా దేశ్’ సినిమాల స్ఫూర్తితో జావేద్ అఖ్తర్‌లతో కలిసి షోలే కథ తయారు చేసుకున్నాడు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ‘దొంగను పట్టుకోవడానికి దొంగలను నియమించడం’ దీని కథ. ఆ దొంగ గబ్బర్ సింగ్, అతణ్ణి పట్టుకునే దొంగలు వీరూ, జయ్.
రమేశ్ సిప్పీ షోలే కోసం అంతముందు లేని చాలా మార్పులను సినిమాల్లోకి తెచ్చాడు. సినిమాస్కోప్, సెవెంటి ఎంఎం. స్టీరియోఫొనిక్... ఇవన్నీ ఆయన తప్పనిసరి అనుకున్నాడు. గతంలో బందిపోటు సినిమాలంటే గుహలు, చంబల్ లోయలు, నల్లబట్టలు, పెద్ద పెద్ద తిలకాలు ఉండేవి. సిప్పి ఆకుపచ్చ మైదానాలు, కొండగుట్టలు ఉన్న కర్ణాటక ప్రాంతం ఎంచుకున్నాడు. స్టంట్స్ కోసం ప్రత్యేకంగా విదేశీ నిపుణులను తీసుకొచ్చాడు. ఆర్.డి.బర్మన్ రీరికార్డింగ్ ఈ సినిమాకు అమోఘంగా కుదిరింది. షోలే దాదాపు రెండేళ్లు తీశారు. ఆ రోజుల్లో జితేంద్ర వంటి హీరోలు ఇంత వ్యవధిలో మూడు సినిమాలు చేసేవారు. కాని రమేశ్ సిప్పి తన పర్‌ఫెక్షనిజమ్ పిచ్చితో తాను నచ్చిన విధంగా షాట్ వచ్చినప్పుడే ఓకే చేశాడు. సినిమా మొదలులో వచ్చే ట్రైన్ రాబరీ కోసం మొత్తం 49 రోజులు పని చేశారు. కుటుంబాన్ని గబ్బర్‌సింగ్ చంపేశాక ఠాకూర్‌గా సంజీవ్ కుమార్ వచ్చి వారి శవాలను చూసే సీన్ సినిమాలో రెండు మూడు నిమిషాలు ఉంటుంది. కాని దానిని 7 రోజులు తీశారు. ‘రమేశ్ సిప్పీ ఏం చేయబోతున్నాడో’ అని అందరూ భయపడే స్థాయిలో సినిమా తీశాడు.
రమేశ్ సిప్పి ఎంత పర్‌ఫెక్షనిస్ట్ అంటే షోలే లో ‘స్టేషన్ సే గాడీ జబ్’ పాటలో హేమమాలిని టాంగా నడుపుతూ ఉంటే ధర్మేంద్ర ఆమెను టీజ్ చేస్తూ పాడుతూ ఉంటాడు. ఒక షాట్‌లో దూరంగా ట్రైన్ వస్తూ ఉంటే షాట్ తీయాలని అనుకున్నారు. ట్రైన్ వచ్చే టైము తెలుసుకొని షాట్ కోసం రెడీగా ఉన్నారు అంతా. ఆ షాట్ ఫెయిల్ అయితే మళ్లీ రేపు ట్రైన్ వచ్చే వరకూ ఆగాలి. ట్రైన్ వస్తున్నట్టు దూరం నుంచి కూత వినిపిస్తూ ఉంది. అందరూ షాట్‌కి రెడీ అయ్యారు. కాని రమేశ్ సిప్పికి సడన్‌గా హేమమాలిని తలలో పూలు లేవని గుర్తుకొచ్చింది. కంటిన్యుటీ ప్రకారం పూలు ఉండాలి. అసిస్టెంట్ వైపు చూసేసరికి అతని పై ప్రాణం పైనే పోయింది. కాని ప్రాణాలకు తెగించి పరిగెత్తి హేమమాలిని తలలో పూలు పెట్టి దూరంగా గెంతి వెళ్లిపోతే సరిగ్గా షాట్ మొదలెట్టి సరిగ్గా పూర్తి చేశారు.
షోలే రిలీజయ్యాక మొదటి వారం ఫ్లాప్ టాక్ వచ్చింది. సినిమాని ఏం చేయాలా అని రమేశ్ సిప్పి క్లయిమాక్స్ మార్చే ఆలోచనలు చేశాడు. కాని ఎందుకైనా మంచిదని దానికి ముందు థియేటర్‌కు వెళ్లి ‘సినిమా ఎలా ఉంది’ అని యజమానిని అడిగితే అతడు లేచి క్యాంటిన్ వైపు చూపుతూ ‘చూడండి... ఎలా ఈగలు తోలుకుంటుందో’ అన్నాడు. రమేశ్ సిప్పి నీరుగారిపోయాడు. ‘అసలు జనం సిగరెట్లు బీడీలు టీ కోసం కూడా బయటకు రావడం లేదండీ’ అన్నాడు అసలు సంగతి వివరిస్తూ. అప్పటికి గాని రమేశ్ సిప్పికి తన సినిమాలో సూపర్‌హిట్ లక్షణాలు కనిపించలేదు. రమేశ్ సిప్పి షోలే తర్వాత ‘షాన్’, ‘సాగర్’, ‘శక్తి’ వంటి చెప్పుకోదగ్గ సినిమాలు తీసిన ‘షోలే’లో జరిగిన మేజిక్ రిపీట్ కాలేదు. అయినా సరే ‘షోలే’ చాలు మనకి. రమేశ్ సిప్పిని ప్రశంసించేందుకు ప్రతి సందర్భం చాలు. రమేశ్ సిప్పి జిందాబాద్.
Comments
Please login to add a commentAdd a comment