ఉగ్రవాద బసంతి...
కళాశాల నేపథ్యంలో ఇప్పటివరకూ చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఈ నేపథ్యానికి ఉగ్రవాద సమస్యను జత చేసి ఎవ్వరూ సినిమా చేయలేదు. ‘బసంతి’ చిత్రం ఆ తరహాలోనే రూపొందుతోంది. ‘బాణం’ చిత్రంలో నక్సలిజం సమస్యని తండ్రీకొడుకుల మధ్య సంఘర్షణగా సున్నితంగా తెరకెక్కించిన చైతన్య దంతులూరి ‘బసంతి’ని స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఇందులో కథానాయకుడు. అలీషా బేగ్ నాయిక.
చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. చైతన్య దంతులూరి మాట్లాడుతూ -‘‘కథా కథనాలు, సంభాషణలు, సంగీతం, ఛాయాగ్రహణం నవ్యరీతిలో ఉంటాయి. ఈ నెలలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ సినిమా తనకు మంచి బ్రేక్‌నిస్తుందని గౌతమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ బండారి, పి.కె.వర్మ, సంగీతం: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.