సినిమా రివ్యూ: బసంతి
సినిమా రివ్యూ: బసంతి
Published Fri, Feb 28 2014 3:45 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
2004లో పల్లకిలో పెళ్లి కూతురు చిత్రం ద్వారా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన గౌతమ్, 'బాణం' చిత్రంతో విమర్శకుల్ని ఆకట్టుకున్న చైతన్య దంతులూరి కలయికలో 'బసంతి' చిత్రం రూపొందింది. 'బసంతి' చిత్ర విడుదలకు ముందే అగ్రహీరోల ప్రమోషన్ తో అదరగొట్టడం, మణిశర్మ సంగీతం 'బసంతి' మీద ఆశలు పెంచుకోవడానికి కారణమయ్యాయి. గౌతమ్ కి ఈ చిత్రం మూడవది. అయితే చైతన్య దంతులూరికి ఈ చిత్రం ద్వితీయ విఘ్నంగా మారిన నేపథ్యంలో 'బసంతి' ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
అర్జున్(గౌతమ్) జీవితం మీద ఎలాంటి క్లారిటీ లేకుండా మిత్రులతో సరదాగా కాలం గడిపే బసంతి కాలేజ్ స్టూడెంట్. తన మిత్రుడి చెల్లెలు వివాహంలో నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ కూతురు రోష్ని(అలీషా బేగ్)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. రోష్నిని గౌతమ్ అనుకోకుండా ఓ సంఘటనతో కలుస్తాడు. తర్వాత వారిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో జరిగే జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనే విదేశీ ప్రతినిధులను చంపేందుకు ఉగ్రవాదులు పేలుళ్లకు కుట్ర పన్నుతారు. ఆ కుట్రను పోలీసులు భగ్నం చేసి దాడులకు దిగుతారు. పోలీసుల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉగ్రవాదులు బసంతి కాలేజిలోకి వెళ్లి, కాలేజి విద్యార్థులను బందీలుగా పట్టుకుంటారు. ఆ బందీలలో కమిషనర్ కూతురు కూడా ఉంటుంది. రోష్ని ఉగ్రవాదుల చెరలో ఎలా చిక్కుకుంది? ఉగ్రవాదుల చెర నుంచి రోష్నిని గౌతమ్ ఎలా రక్షించుకున్నాడు? అందుకు ఉగ్రవాదులు విధించిన కండీషన్స్ ఏంటీ? చివరకు అర్జున్, రోష్నీల కథ సుఖాంతమైందా? ఇలా కథలో భాగంగా వచ్చే పలు ప్రశ్నలకు సమాధానమే 'బసంతి' చిత్రం.
అర్జున్ గా గౌతమ్ ఓ అసాధారణ కార్యక్రమాన్ని భుజాన వేసుకున్న ఓ సాధారణ కుర్రాడిగా కనిపించే ప్రయత్నం చేశాడు. కానీ అర్జున్ పాత్ర తనకు మించిన భారమే అనే ఫీలింగ్ ను కలిగించాడు. అన్ని ఎమోషన్స్ కు ఒకే ఫీలింగ్ పలికించాడనే విమర్శ ప్రధానంగా వినిపించింది. బ్రహ్మనందం ఇమేజ్ తో తెలుగు తెరకు పరిచయమైన గౌతమ్ కు 'బసంతి' మూడవ చిత్రం. తన మూడవ చిత్రం ద్వారా సామర్ధ్యానికి మించి సాహసం చేశాడమో అనే ఫీలింగ్ కలిగించింది. తెలుగు తెరపై నటుడిగా, స్టార్ గా క్రెడిట్ ను సంపాదించుకోవాలంటే గౌతమ్ చాలా కష్టపడాల్సిందేన్న విషయం ఒకటి అర్ధమైంది. మంచి ఫెర్మార్మెన్స్ కు చాన్స్ ఉన్న రోష్ని పాత్ర అలీషా బేగ్ కు లభించింది. అయితే అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో అలీషా విఫలమైంది.
గౌతమ్ తండ్రిగా తనికెళ్ల భరణి, రోష్నికి తండ్రిగా షియాజే షిండేలు తమ పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. గౌతమ్ స్నేహితుడి గా రణధీర్, ధన్ రాజ్ లు, మిగతా పాత్రలలో కనిపించిన వారు ఓకే అనిపించారు.
'బాణం' తర్వాత సత్తా ఉన్న యువ దర్శకుడిగా చైతన్య దంతులూరిపై అన్నివర్గాల్లోనూ ఓ అభిప్రాయం నెలకొంది. దాంతో రెండో చిత్రం బసంతిని స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారనే వార్తతో అంచనాలు రెండింతలు పెరిగాయి. అయితే బసంతితో చైతన్య ఓ రకంగా ప్రేక్షకులకు అసంతృప్తి, నిరాశను పంచారనే చెప్పవచ్చు. కథ ఎంపిక ప్రధాన లోపమని ఎక్కువ మంది వెల్లడించిన అభిప్రాయం. రక్తి కట్టించే విధంగా కథనం లేకపోవడం మరో మైనస్ పాయింట్. ఉగ్రవాదం, ప్రేమ అనే యాంగిల్ లో వచ్చే చిత్రాలపై భారీ అంచనాలు ఉంటాయన్న సంగతికి దర్శకుడికి తెలిసే ఉంటుంది. వాటికి ధీటుగా 'బసంతి'ని మలచకపోవడంతో ఆకట్టుకోలేకపోయిందనే టాక్ తొలి ఆటకే నెలకొంది. సినిమా ద్వితీయార్ధం ఆ మధ్యలో వచ్చిన 'గగనం' చిత్రం మాదిరిగా ఉండటం ఆలరించలేకోయిందనే చెప్పవచ్చు.
ఇక ఈ చిత్రంలో ప్రధానంగా ఆకట్టుకున్న కొన్ని అంశాల గురించి ప్రస్తావించుకుందాం. చక్కని డైలాగ్స్, ఆకట్టుకునే ఫొటోగ్రఫీ, పేలవమైన కథ, కథనాన్ని మరుగున పరిచే విధంగా చిత్రానికి కొంత ఊపిరి పోసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటి అంశాలు బసంతి చిత్రానికి ఎస్సెట్ గా నిలిచాయి. పాజిటివ్ పాయింట్స్ కంటే నెగిటివ్ పాయింట్సే ఎక్కువగా కనిపించే ఈ చిత్రం ఓ మోస్తరు విజయం సాధించినా.. చైతన్య దంతులూరి ద్వితీయ విఘ్నాన్ని అధిగమించినట్టే అని భావించవచ్చు.
-రాజబాబు అనుముల
Advertisement