
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ చాన్నాళ్ల తర్వాత నటుడిగా చేసిన సినిమా 'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్). కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి సంయక్తంగా నిర్మించారు. పవన్ కేతరాజు దర్శకుడు. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించారు. తాజాగా ఏప్రిల్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?
కథేంటి?
కిశోర్(ఎస్పీ చరణ్), సిద్ధూ (శ్రీ హర్ష) తండ్రీ కొడుకులు. అనాథలకు ఆపదొస్తే సాయం చేయడంలో మిగతావారి కంటే మందుంటారు. అనాథ శవాలకు సొంత డబ్బుతో కిశోర్ దహన సంస్కారాలు జరిపిస్తుంటాడు. ఇందుకు అవసరమైన డబ్బు కోసం గుర్రపు పందెలు కాస్తుంటాడు. ప్రతిసారి ఇతడే బెట్ నెగ్గుతుంటాడు.
అయితే కిశోర్ చేసే అనాథ శవాల దహన సంస్కారాల వెనుక పెద్ద స్కామ్ ఉందని వార్తలొస్తాయి. దీని వెనుక బడా బిజినెస్ మ్యాన్ కబీర్ (నవాబ్ షా) ఉంటాడు. కిషోర్, సిద్ధూను ఇతడు ఎందుకు టార్గెట్ చేశాడు? తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో మైథాలజికల్ అంశాలు చూపిస్తున్నారు. 'లవ్ యువర్ ఫాదర్' కూడా ఆ లిస్టులోకి వచ్చే సినిమా. కథలో ఇదే మేజర్ పార్ట్. దాన్ని డామినేట్ చేసేలా ఎక్కువ స్క్రీన్ టైమ్ కాలేజీ ఎపిసోడ్ తీసుకోవడంతో ఇంటర్వెల్ ముందు అసలు కథలో కీలకమైన ఘట్టం మొదలు అవుతుంది. సెకండాఫ్ కూడా ఫాంటసీ పాయింట్ స్టార్ట్ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్ ఫ్లోని కొంత డైవర్ట్ చేసినా నవ్విస్తాయి. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది.
రెగ్యులర్ అన్పించే కామెడీ సీన్స్, కాలేజీ ఎపిసోడ్స్ తర్వాత వచ్చే డివోషనల్ సీన్స్ హై ఇస్తాయి. మధ్య మధ్యలో కొంత ల్యాగ్ ఉన్నా అందర్నీ మెప్పించే డివోషనల్ పాయింట్ కోసం పర్లేదు. కథలో కీలకమైన రివేంజ్ ఎపిసోడ్ ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది. కథలో బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది.
మణిశర్మ సంగీతమందించిన శివుని నేపథ్యంలో పాట, నేపథ్య సంగీతం బాగున్నాయి. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు స్థాయికి తగ్గటున్నాయి. డైలాగ్స్ మీద వర్క్ సరిగా చేయలేదు. కామెడీపై కేర్ తీసుకుంటే సినిమా ఇంకా బాగా వచ్చేది.
తండ్రిగా ఎస్పీ చరణ్ నటన బాగుంది. హీరోగా ఫస్ట్ సినిమాకు శ్రీహర్ష డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరోయిన్ కషికా కపూర్ ఓకే. మిగతా పాత్రధారులు న్యాయం చేశారు. కొంత ల్యాగ్, రొటీన్ సీన్స్ ఉన్నా డివోషనల్ పాయింట్, క్లైమాక్స్ ట్విస్ట్ పర్లేదనిపించేలా ఉన్నాయి.