
థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. కొత్త దర్శకులు ఇండస్ట్రీలో తొందరగా పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి సినిమాలను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూ ఉంటారు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కూడా ‘ది సస్పెక్ట్’ పేరుతో మిస్టరీ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. టెంపుల్ టౌన్ టాకీస్‌పై కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 21న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..
కథ
ప్రత్యూష(షిరిగిలం రూప) దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును ఇన్‌స్పెక్టర్ అర్జున్(రుషి కిరణ్) విచారిస్తాడు. అతనికి సహాయకునిగా సదాశివ(శివ యాదవ్) అంట్ టీమ్ సహకరిస్తూ ఉంటుంది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అర్జున్‌కు ఎదురయ్యే ప్రతి వ్యక్తి సస్పెక్ట్‌గానే కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తన ప్రేయసి మీరా (శ్వేత)ను కూడా అనుమానించాల్సి వస్తుంది. అలాగే పోలీసు ఉన్నతాధికారిని, తన స్నేహితులను ఇలా ప్రతి ఒక్కరినీ సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. మరి అసలైన హంతకుడిని అర్జున్ పట్టుకుంటాడా? ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? ప్రత్యూషను ఎందుకు చంపారు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ
ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఒక చిన్న లైన్ తీసుకుని దాని చుట్టూ ఆసక్తికరమైన కథనాన్ని అల్లుకుంటున్నారు. ఆ కథనం మెప్పిస్తేనే సినిమా సక్సెస్ అవుతుంది. లేదంటే బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడుతుంది. తాజాగా ‘ది సస్పెక్ట్’పేరుతో తెరకెక్కిన మూవీ ఆద్యంతం ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేసేందుకు ప్రయత్నించింది. చివరి వరకూ హంతకులెవరన్నది ఆడియన్స్ గుర్తు పట్టలేనంత సస్పెన్స్‌తో సినిమాను ముందుకు నడిపించారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులకు ఎదురయ్యే అనేకమంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోణంలో సస్పెక్ట్ గానే కనిపిస్తుంటారు. తీరా వారు కాదని తెలుస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో అసలు హంతకులు ఎవరనేది తెలిసినప్పుడు షాకవుతారు. ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఎవరినీ కించపరిచి మాట్లాడకూడదు, ఎగతాళి చేయకూడదన్న మెసేజ్ ఇచ్చారు.
ముఖ్యంగా విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే... వారి మనసుమీద ఎలాంటి ప్రభావం చూపి... ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయనేది చక్కగా చూపించారు. ఓపక్క మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా మరోవైపు హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్.. వారి లవ్ బ్రేకప్, మళ్లీ కలుసుకోవడం చూపిస్తారు. ఇదంతా చూసే జనాలకు కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. సెకెండాఫ్‌లో సినిమా ఊపందుకుంటుంది. అక్కడక్కడా సన్నివేశాలు బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తాయి.
కొత్తవారైన హీరో రుషి కిరణ్... ఇన్‌స్పెక్టర్ అర్జున్ పాత్రలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కొన్నిచోట్ల మాత్రం అతడి నటన సహజంగా అనిపించదు. కొన్ని యాక్షన్ సీన్స్ బాగా చేశారు. అతనికి జంటగా నటించిన శ్వేత గ్లామరస్‌గా కనిపించింది. ప్రత్యూష పాత్రలో రూప కూడా పర్వాలేదనిపించింది. లావణ్య పాత్రలో రజిత బాగా చేసింది. మిగతా అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు రాధా కృష్ణ ఎంచుకున్న ప్లాట్ బాగుంది. దాని చూట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం కాస్త గందరగోళంగా ఉంది. కొన్ని సీన్లు బోరింగ్‌గా అనిపించినా సెకండాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ ఊపందుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ రాఘవేంద్ర అందించిన విజువల్స్ పర్వాలేదనిపించాయి. ప్రజ్వల్ క్రిష్ బీజీఎం బాగుంది. పాటలు బాగోలేవు. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా చేయాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
Comments
Please login to add a commentAdd a comment