
హీరో నితిన్‌కు అడ్వాన్స్‌గా రూ.75 లక్షలిస్తే చివరకు ఆ సినిమానే చేయం అని చేతులెత్తేశాడు అంటున్నాడు నిర్మాత సత్యనారాయణ రెడ్డి. ఈయన.. ఢీ, భగీరథ, బన్నీ వంటి చిత్రాలను నిర్మించాడు. ఈయన కుమారుడు వేణు అలియాస్ వశిష్ట (Mallidi Vassishta) డైరెక్టర్‌గా బింబిసారతో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర మూవీ చేస్తున్నాడు.
వశిష్ట ఇన్ని కష్టాలు పడ్డాడా?
అయితే ఈ విజయాలకు ముందు వశిష్ట ఎన్నో కష్టాలు పడ్డాడు. వాటిని తండ్రి సత్యనారాయణ (Mallidi Satyanarayana Reddy) తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'నితిన్ 'ఇష్క్' సినిమా సమయంలో ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి చాలా సమస్యల్లో ఉన్నారు. అప్పుడు నేను ఆ సినిమాను కొని వైజాగ్‌లో డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆయనకు ఎప్పుడైనా అవసరముంటే డబ్బులిచ్చేవాడిని. అలా మేము క్లోజ్ అయ్యాం.
రూ.75 లక్షలు అడ్వాన్స్
నా కుమారుడు వేణు (వశిష్ట)కు డైరెక్షన్ అంటే ఇష్టం ఉందని తెలిసి.. నితిన్ (Nithiin)తో సినిమా చేద్దాం అన్నాడు. మావాడిని నితిన్‌కోసం కథ రాసుకోమన్నాను. మేము ఓ నిర్మాతను సెట్ చేసుకున్నాం. ఆయనతో నితిన్‌కు అడ్వాన్స్‌గా రూ.75 లక్షలు, కెమెరామెన్ ఛోటాకు రూ.10 లక్షలు ఇప్పించాం. దాదాపు ఆ ప్రాజెక్ట్ మీద రెండుకోట్లు ఖర్చుపెట్టాం. కానీ వాళ్లకు మావాడు చెప్పిన కథ నచ్చలేదు. వేరేవాళ్లు రాసుకున్న కథను వశిష్టతో డైరెక్షన్ చేయిద్దామని ఫిక్స్ చేశారు.
(చదవండి: అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. వెళ్లిపోతానంటూ)
వాడికి పెద్ద రేంజ్ ఉందటగా!
ఇంతలో అఆ సినిమా రిలీజై పెద్ద హిట్టయింది. అఆ తర్వాత కొత్త డైరెక్టర్‌తో సినిమా చేస్తే మావాడి రేంజ్ పడిపోతుంది అని సుధాకర్ అన్నాడు. వాడికి పెద్ద రేంజ్ ఉంది కదా.. అది పడిపోతుందట.. అందుకని తర్వాత చేద్దాం అన్నారు. డబ్బులిచ్చిన నిర్మాతను పిలిపించి మాతో సినిమా చేయడం లేదని చెప్పేశారు. కాకపోతే నితిన్ హీరోగా పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేస్తున్నాం. మీరే నిర్మాతగా ఉండండి అన్నారు. అప్పుడా నిర్మాత.. నేను మీతో పార్ట్‌నర్‌షిప్ చేయడానికి రాలేదు, నా డబ్బు నాకిచ్చేయండి అన్నారు. అలా మోసపోయి అక్కడి నుంచి బయటకు వచ్చేశాం.
కొత్త డైరెక్టర్‌తో ఎందుకని..
మా వాడికి అల్లు శిరీష్ (Allu Sirish) క్లోజ్‌ఫ్రెండ్. మంచి కథ రాసుకోరా.. నేనే చేస్తా అని శిరీష్ ముందుకొచ్చాడు. సినిమా ముహూర్తం కూడా భారీగా జరిగింది. సరిగ్గా అప్పుడే శ్రీరస్తు.. శుభమస్తు సినిమా వచ్చి హిట్టయింది. దాంతో ఇలాంటి విజయం తర్వాత కొత్త డైరెక్టర్‌తో చేయడం ఎందుకు? అని శిరీష్ ఆలోచనలో పడ్డాడు. మాతో సినిమా చేయనన్నాడు. అల్లు అరవింద్ ఫీలయ్యాడు. నీకు ఎవరు కావాలో చెప్పు.. హీరోగా తీసుకొస్తా అని అరవింద్ మావాడిని అడిగాడు.
హీరోగా ట్రై చేయమన్నా
కానీ అప్పటికే వాడు చాలా బాధలో ఉన్నాడు. అది చూసి డైరెక్షన్ వదిలెయ్.. హీరోగా చేయరా అన్నాను. వాడిని హీరోగా లాంచ్ చేస్తూ సినిమా మొదలుపెట్టాం. కానీ, అది వర్కవుట్ కాదనుకున్నాడు. ఆ సినిమా వదిలేసి మళ్లీ డైరెక్షన్ మీదే పడ్డాడు' అని చెప్పుకొచ్చాడు. ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వశిష్ట ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా తీస్తుండటం మెచ్చుకోదగ్గ విషయం.
చదవండి: గొప్ప నటి.. చివరి రోజుల్లో రూ.50 కోసం చేయి చాచింది.. విజయ