బ్రహ్మానందం మంచి లెక్చరర్... గొప్ప కమెడియన్...
అంతకు మించి గ్రేట్ ఫాదర్!
అవును...
పిల్లల్ని ఎలా పెంచాలో బ్రహ్మానందం దగ్గర క్లాసులు తీసుకోవచ్చు.
ఆయన తన కొడుకుల్ని
క్లాసులు పీకకుండానే ఏ క్లాస్‌గా పెంచారు.
‘వీళ్లే నా ప్రాపర్టీ’ అని చెప్పుకుంటారు మురిపెంగా.
ఆయన కొడుకులూ అంతే.
నాన్నే తమకు ఇన్‌స్పిరేషన్ అని చెబుతారు గర్వంగా.
‘బసంతి’ సినిమాతో సక్సెస్ కొట్టి
నాన్నకు మంచి గిఫ్ట్ ఇస్తానంటున్నాడు పెద్ద కొడుకు గౌతమ్.
వీళ్లిద్దరూ మాట్లాడుతుంటే ఇద్దరు స్నేహితులు
మాట్లాడుకుంటున్నట్టే అనిపిస్తుంది. మీరే చదవండి!
నటుడు బ్రహ్మానందం గురించి ప్రపంచమందరికీ తెలుసు. తండ్రిగా బ్రహ్మానందం గురించి తెలుసుకోవాలని ఉంది...
బ్రహ్మానందం: నాకు ఇద్దరబ్బాయిలు. పెద్దబ్బాయి గౌతమ్. వయసు 26. ‘బసంతి’ సినిమాలో హీరోగా చేశాడు. విడుదలకు సిద్ధంగా ఉంది. చిన్నోడు సిద్దార్థ. వయసు 24. వీడు కూడా ఈ ఫీల్డ్‌లోనే స్థిరపడే ఉద్దేశంలో ఉన్నాడు.
(నవ్వుతూ) సార్... మేమడిగింది వాళ్ల బయోడేటా కాదు. వాళ్లతో మీకున్న అనుబంధం గురించి!
బ్రహ్మానందం: అవునా! గౌతమ్ ఉన్నాడుగా వాడినడగండి...
గౌతమ్: ఏ విషయంలోనైనా నాన్నే నాకు ఇన్‌స్పిరేషన్. నిజం చెప్పాలంటే... నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఫస్ట్ పేరు నాన్నదే ఉంటుంది. మేం ఏదైనా ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. (నవ్వుతూ) నో దాపరికమ్స్!
లెక్చరర్‌గా చేశారు కాబట్టి పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలనే థాట్స్ ఎక్కువుంటాయి అని అనుకోవచ్చా?
బ్రహ్మానందం: లేదండీ, నేనందుకు పూర్తి విరుద్ధం! ఇన్నేళ్లలో పిల్లల్ని కొట్టింది ఎప్పుడూ లేదు. చాలామందికి ఈ మాట నమ్మకం కలగకపోవచ్చు. (నవ్వుతూ) అయినా ఇలా చెప్పడం వల్ల నాకేమీ ‘గొప్ప తండ్రి’ అనే సర్టిఫికెట్, మెడల్స్ ఇవ్వరుగా!
గౌతమ్: నిజమే... నాన్న ఎప్పుడూ ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు!
బ్రహ్మానందం: ఒక్క చదువు విషయంలో మాత్రం కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండేవాణ్ణి. ఎందుకంటే చదువు ఉపయోగం ఏంటో నాకు బాగా తెలుసు.
క్లాసులు పీకడాల్లాంటివి ఉండేవా?
బ్రహ్మానందం: ఎప్పుడూ లేదు. అయినా నేను ఇంటికి రాగానే వాళ్లు గజగజా వణికిపోవాలనే ఫీలింగ్స్ నాకస్సలు లేవు. అందరం సరదాగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని జోక్స్ వేసుకుంటూ భోంచేస్తాం. నా గతం గురించి, నేను పడ్డ కష్టాల గురించి, షూటింగ్‌లలో జరిగే సంఘటనల గురించి అప్పుడప్పుడూ చెబుతుంటాను.
గౌతమ్: నాన్న ఫ్లాష్‌బ్యాక్ విన్నప్పుడల్లా కదిలిపోతుంటాను. ‘ఎన్ని కష్టాలు పడి పైకొచ్చారు నాన్న’ అని! చెప్పులు కొనమంటేనే తాతయ్య తెగ కొట్టేసేవారట. నాన్న అంచెలంచెలుగా ఎదిగిన తీరు నాకో వ్యక్తిత్వ వికాస పాఠంలా అనిపిస్తుంది!
ఆయన షూటింగ్స్‌లో బిజీ కదా.. మిస్సయిన ఫీలింగ్ ఎప్పుడైనా ఉండేదా?
గౌతమ్: నేను చెన్నైలో ఫిఫ్త్ క్లాస్ వరకూ చదువుకున్నాను. నాన్న ఎక్కువగా హైదరాబాద్‌లో షూటింగ్స్‌లో ఉండేవారు. అప్పుడు మాత్రం మిస్సయిన ఫీలింగ్ ఉండేది. ఆ తర్వాత మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. అప్పటినుంచీ బెంగ లేదు. ఎందుకంటే ఆయన షూటింగ్ అవగానే మాతోనే టైమ్ స్పెండ్ చేసేవారు.
బ్రహ్మానందంగారి అబ్బాయిగా కాలేజ్‌లో, ఫ్రెండ్స్ సర్కిల్‌లో మీపై ఓ స్పెషల్ అటెన్షన్ ఉండేదా?
గౌతమ్: నేనెప్పుడూ అలాంటి అటెన్షన్ కోరుకోలేదు. అందరితో కలిసిపోయి ఉండటమే నాకిష్టం. అందరితో పాటే అల్లరి చేసేవాణ్ణి. ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలకూ, షికార్లకూ వెళ్లేవాణ్ణి. నాన్న కామెడీని వాళ్లతో పాటే నేనూ ఆస్వాదించేవాణ్ణి.
ఇంతకూ మీ నాన్నగారి జీవితం నుంచి మీరేం తెలుసుకున్నారు?
గౌతమ్: నాన్న ఎప్పుడూ చెబుతుంటారు... ‘‘గమ్యంతో పాటు గమనాన్ని కూడా ఆస్వాదించాలని! తరచు ఇంకోమాట కూడా చెబుతుంటారు... గోల్స్ ఎప్పుడూ పెట్టుకోవద్దు... పనిచేస్తూ ఉంటే ఆటోమేటిగ్గా లక్ష్యాన్ని చేరుకుంటావు’’ అని! అది నేను పూర్తిగా ఫాలో అవుతాను.
నాన్నగారి నుంచి ప్రధానంగా నేర్చుకున్న అంశం?
గౌతమ్: సమయపాలన! ఎవరికైనా ఆరుగంటలకు వస్తానని చెబితే అయిదు నిమిషాలు ముందే ఉంటారు.
బ్రహ్మానందం: ఇదంతా నా గొప్పతనమని అంటే మాత్రం ఒప్పుకోను. పరిస్థితులే నన్నిలా తీర్చిదిద్దాయి. ఓ పేదవిద్యార్థి స్థాయి నుంచి లెక్చరర్‌గా ఎదిగాను. ఏమాత్రం ఆలస్యంగా కాలేజీకి వెళ్లినా ఉద్యోగం తీసేస్తారనే భయం. ఆ భయం నుంచే బాధ్యత పుట్టింది.
మీరంటే చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చారు. మీ పిల్లల్ని కూడా అలానే ఉండమనడం కరెక్టేనా?
బ్రహ్మానందం: నేనేదీ బలవంతంగా రుద్దను. ఇలా ఉండాలి... అలా ఉండాలని రూల్స్ పెట్టను. స్వేచ్ఛ ఇస్తూనే జీవితం గురించి అవగాహన పెంచాను. నాకు నా మీదే ఎక్స్‌పెక్టేషన్లు లేవు, వాళ్లమీదేం ఉంటాయి? వీళ్లు సినిమా ఫీల్డ్‌కి రాకపోయినా, పెద్ద చదువు చదవలేకపోయినా ఎక్కడైనా, ఎలాగైనా బతికేయగలరు... ఎందుకంటే వాళ్ల దగ్గర అంత సంపద ఉంది! ఇక్కడ సంపద అంటే డబ్బు కాదు. వ్యక్తిత్వం, మంచితనం!
డబ్బు విషయంలో మీరు చాలా స్ట్రిక్ట్ అటగా?
బ్రహ్మానందం: డబ్బు లేని స్థితి ఏమిటో బాగా తెలిసినవాణ్ణి నేను. అందుకే డబ్బుని గౌరవిస్తాను. వందమందిని కూర్చోబెట్టి లిక్కర్ పార్టీ ఇచ్చేకన్నా, ఆపదలో ఉన్నవాణ్ణి ఆ డబ్బుతో ఆదుకోవడం ఉత్తమమనేది నమ్ముతాను. 26 మందికి పెళ్లిళ్లు చేశాను, బోలెడంత మందిని చదివించానని చెప్పుకోవడం నాకే ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలకు డబ్బు విలువ కచ్చితంగా తెలిసేట్టు చేయాలి. ఇది మీ డబ్బు. అవసరాలు... అత్యవసరాలు... ఆడంబరాలు ఏవో తేల్చుకుని ఏదైనా కొనుక్కోమంటాను. చైనీస్‌లో ఓ సామెత ఉంది... ఆకలితో ఉన్నవాడికి ఒక చేపనిస్తే, వాడికి ఓరోజు ఆకలి తీరుతుంది. అదే అతనికి చేపలు పట్టడమే నేర్పిస్తే... జీవితకాలం అతని ఆకలి తీరుతుంది కదా! అని.
సరే... మీ చిన్నబ్బాయ్ గురించి చెప్పండి!
బ్రహ్మానందం: గౌతమ్ కామ్‌గా ఉంటాడు కానీ, సిద్ధుకి మాత్రం ఫుల్ కామెడీ టింజ్ ఉంది! నేనెప్పుడైనా కొంచెం కోపం మీద ఉన్నానంటే వాళ్లమ్మ దగ్గరకెళ్లి, ‘‘మీ ఆయన బీపీలో ఉన్నట్టున్నాడు; జాగ్రత్తగా చూసుకో; మేం బయటికెళ్తాం’’ అనేసి చల్లగా జారుకుంటాడు. ఏమైనా దేవుడు నాకు చాలా మంచి పిల్లలనిచ్చాడు.
గౌతమ్: నాకున్న బెస్ట్ క్రిటిక్స్‌లో సిద్ధ్దూ ఒకడు. ఏదైనా మొహం మీదే చెప్పేస్తాడు. నాకేదైనా సజెషన్ కావాలన్నా, ఫస్ట్ వాణ్ణే అడుగుతాను.
బ్రహ్మానందం: పిల్లలే నాకు పెద్ద ఎస్సెట్ అండీ! ఎంత సంపద, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా, పిల్లలు సరిగ్గా లేకపోతే ఏం ఆనందం ఉంటుంది చెప్పండి?
సిద్దూ కూడా హీరోగా వస్తున్నాడట?
బ్రహ్మానందం: ఏమో! లాస్ట్ ఇయర్ ఏమో ఎమ్‌టెక్ చేస్తానన్నాడు... ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ డెరైక్ట్ చేస్తానన్నాడు... ఇప్పుడేమో యాక్టింగ్ అంటున్నాడు.
మీ అబ్బాయిల పేర్లు గౌతమ్, సిద్దార్థ అని పెట్టారు..?
బ్రహ్మానందం: నాకు మొదటినుంచి బుద్ధిజం అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే గౌతమ బుద్ధుని ఫిలాసఫీని బాగా చదివాను. ఆ ఇష్టంతోనే పేర్లు పెట్టాను.
సరే గౌతమ్ లవ్‌స్టోరీ దగ్గరకు వద్దాం. ఈ విషయం చెప్పినపుడు మీరెలా రియాక్టయ్యారు?
బ్రహ్మానందం: వాడు భయపడుతూ, ఇబ్బందిపడుతూ నా దగ్గరకొచ్చి ‘‘నేను ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్నా’’ అని చెప్పాడు. ‘‘ఎవరా అమ్మాయి? తను ఎప్పటినుంచీ తెలుసు?’’ అంటూ రెండు మూడు ప్రశ్నలడిగాను. అన్నిటికీ భయంగానే సమాధానం చెప్పాడు. వాడి సమాధానాల్లో నాకు నిజాయితీ కనిపించింది. అందుకే వెంటనే ‘ఓకే’ చెప్పేశాను.
గౌతమ్: నాన్న అంత త్వరగా ఓకే చెప్తారని అస్సలు ఊహించలేదు. వెంటనే ఏడ్చేశాను. ఆ రోజు సాయంత్రమే వాళ్లని పిలిచి ముహూర్తాలు పెట్టించేశారు.
బ్రహ్మానందం: పిల్లల సంతోషమే కదండీ మనకు ముఖ్యం. వాళ్లు ఏడుస్తూ ఉంటే మనం తట్టుకోగలమా? వాడికి ఆ అమ్మాయి నచ్చింది. తనతో జీవితం బావుంటుందని నమ్మాడు. నేను వాడి ప్రేమను నమ్మాను. వాడు టీనేజ్ కుర్రాడయితే, రాంగ్ డెసిషన్ అని భయపడేవాణ్ణి. వాడికి మెచ్యూర్టీ వచ్చింది. జీవితం మీద క్లారిటీ ఉంది. ఇంకెందుకు భయపడటం!
మీది కూడా ప్రేమ వివాహమే కదా!
బ్రహ్మానందం: పెద్దలు కుదిర్చిన, ఇష్టంతో కూడిన వివాహం మాది. మా గురువుగారికి లక్ష్మి దగ్గరి బంధువు. బ్రహ్మానందం మంచి కుర్రాడని వాళ్లే సంబంధం కుదిర్చారు. అయితే మా ఇంట్లో వాళ్లు మా పెళ్లికి ఒప్పుకోలేదు.
గౌతమ్‌ని సినిమాల్లోకి తీసుకురావాలని ముందే అనుకున్నారా?
బ్రహ్మానందం: మనమెవరమండీ అనుకోవడానికి! ఓసారి తన ఫ్రెండ్ శర్వానంద్‌తో కలిసి వైజాగ్ వెళ్తానంటే పంపించాను. తీరా వీళ్లు వెళ్లింది సత్యానంద్‌గారి దగ్గరకు. ఆయన నాకు ఫోన్ చేసి మీ వాడిలో మంచి ఆర్టిస్టు ఉన్నాడని చెబితే, ఏ గురువైనా తన శిష్యుడి గురించి అలాగే చెబుతాడులే అనుకున్నా. తర్వాత తర్వాత వాడిలో సీరియస్‌నెస్ చూసి ఒప్పుకున్నా. అయినా కెమెరా ముందుకు వెళ్లేంత వరకే నా పరపతి ఉపయోగపడుతుంది. ఒకసారి కెమెరా ముందుకు వెళ్లాక ఎవరి సత్తా వాళ్లు చూపించాల్సిందే. అక్కడ ట్యాగ్ లైన్లు పనిచేయవు.
‘బసంతి’ పై బాగా ఆశలు పెట్టుకున్నట్టున్నారు?
బ్రహ్మానందం: వీడు యాక్ట్ చేశాడని కాదు. కథలో ఉన్న దమ్ము అలాంటిది. డెరైక్టర్ చైతన్య బాగా డీల్ చేశాడు. మునుపు అతను తీసిన ‘బాణం’కు కూడా మంచి ప్రశంస వచ్చింది.
గౌతమ్: కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇప్పటికీ ఆ ఎగ్జైట్‌మెంట్ పోలేదు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని ఎదురు చూస్తున్నాను.
గతంలో చేయనిది, ‘బసంతి’కి మాత్రం మీ పరపతి అంతా ఉపయోగించినట్టున్నారు..?
బ్రహ్మానందం: మంచి సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడూ ముందుంటాను నేను. ఇంతకుముందు ఒకతను తన ఊరివాళ్లనే ఆర్టిస్టులుగా పెట్టి ఆ ఊరి గురించి సినిమా తీస్తే, అతన్ని ఎంకరేజ్ చేశాను. ‘బసంతి’ విషయానికొస్తే - ఈ సినిమా నుంచి సమాజం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ దర్శకునిపై కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకే నేను అడగ్గానే చిరంజీవిగారు, పవన్‌కల్యాణ్, మహేష్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్, బన్నీ, రాజమౌళి, త్రివిక్రమ్, వినాయక్, శ్రీను వైట్ల, సురేందర్‌రెడ్డి, జానీలీవర్ లాంటివాళ్లు సినిమా గురించి నాలుగు మాటలు చెప్పారు. నేను కూడా సాధారణంగా ప్రివ్యూలు చూడను. కానీ ఇది చూశాను. అసలు సినిమా చూస్తున్న ఫీలింగే కలగలేదు. అంత బాగా డెరైక్ట్ చేశాడు చైతన్య. గౌతమ్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. (నవ్వుతూ) నా జీన్స్ కొంతైనా ఉంటాయి కదండీ!
- పులగం చిన్నారాయణ
‘నర్తనశాల’లో ఓ చిన్న ఎక్స్‌ప్రెషన్‌తో వందపేజీల మేటర్ చెప్పిన మహానటుడు ఎస్వీరంగారావుగారు. ఆయన సినిమాలు చూడు...నటన అంటే ఏంటో తెలుస్తుంది’’ అంటూ ఉంటారు నాన్న ఎప్పుడూ!
జంధ్యాలగారి దర్శకత్వంలో నాన్న నటించిన సినిమాలన్నీ ఇష్టమే. ముఖ్యంగా ‘అహ నా పెళ్లంట’! ఎప్పుడు చూసినా నవ్వు వస్తూనే ఉంటుంది. ‘మనీ’లో ఖాన్‌దాదా పాత్ర కూడా నా ఫేవరెట్!
నాన్న జీవితం...ఓ వ్యక్తిత్వ వికాస పాఠం!
Published Sat, Feb 22 2014 11:06 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
Advertisement
Advertisement