
దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ (Raja Gautam) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మా ఆనందం. ఈ మూవీలో వీరిద్దరూ తాతామనవళ్లుగా యాక్ట్ చేశారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించగా ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించాడు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూద సినిమాల ఫేమ్ రాహుల్ యాదవ్ నక్కా నిర్మించాడు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆహాలో రేపటి (మార్చి 14) నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
కథేంటంటే?
బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం (రాజా గౌతమ్) ఓ థియేటర్ ఆర్టిస్ట్. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలన్నది తన లక్ష్యం. ఈ ప్రయత్నాల్లో ఉండగా ఢిల్లీలో ఓ నాటకం వేసే ఛాన్స్ దొరుకుతుంది. అయితే అక్కడ పాల్గొనాలంటే రూ.6 లక్షలు ఇవ్వాలని ఆ వేడుక నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు.
దానికోసం ప్రయత్నాలు చేసే క్రమంలో వృద్ధాశ్రమంలో ఉన్న తాత ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) తన దగ్గర ఆరెకరాల భూమి ఉందని చెప్తాడు. అది ఇవ్వాలంటే ఓ కండీషన్ పెడతాడు. మరి బ్రహ్మకు ఆ భూమి దక్కిందా? అతడిన ఎంతో ప్రేమించే తార (ప్రియ వడ్లమాని) తనను వదిలి ఎందుకు వెళ్లిపోయింది? చివరకు కలిశారా? బ్రహ్మ నటుడయ్యాడా? లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!