పనిఒత్తిడి ఉందని సర్వేలో చెప్పిన వాళ్లందర్నీ తొలగించిన వైనం
అంకుర సంస్థ తీరుపై సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శలు
సంస్థలో సరదాగా అంతర్గత సర్వే అంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఖచ్చితంగా స్పందిస్తారు. సర్వేలో అడిగే ప్రశ్నలు వివాదాస్పదమైనవి కాకుండా సాధారణంగా ఉంటే ఏ ఉద్యోగి అయినా స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా సమాధానమిస్తారు. తమ అభిప్రాయాలను సంస్థ యాజమాన్యంతో పంచుకుంటారు.
అలా ఉద్యోగులు చెప్పిన విషయాలే తమ ఉద్యోగం ఊడటానికి కారణమని సదలు ఉద్యోగులు తెల్సుకుని షాక్‌కు గురయ్యారు. ఉద్యోగుల్ని తొలగించే ఉద్దేశ్యం ఉంటే నేరుగా ఆ ఉద్యోగులకు చెప్పాలిగానీ ఇలా సర్వే వంకతో ఉద్యోగం నుంచి తొలగించడమేంటని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నోయిడా కేంద్రంగా పనిచేసే ఒక అంకుర సంస్థ చేసిన నిర్వాకం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.
యస్ అని చెబుతున్నారా?
పనివేళల్లో పని కారణంగా మీరు ఒత్తిడికి గురి అవుతున్నారా? అంటూ ‘యస్‌మేడమ్’అనే అంకురసంస్థ తన ఉద్యోగులతో అంతర్గత ఈమెయిల్ సర్వే చేపట్టింది. ఈ సంస్థ ఇంటి వద్ద హెయిర్ కటింగ్, మసాజ్, ఇతరత్రా బ్యూటీ, వెల్‌నెస్ సేవలను అందిస్తోంది. ఈ సర్వేలో భాగంగా చాలా మంది ఉద్యోగులు తమ తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేశారు.
వీటిని సేకరించిన సంస్థ.. ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాం అని సమాధానం చెప్పిన వారందరినీ తొలగిస్తున్నట్లు వాళ్లకు విడిగా ఈమెయిల్ సందేశాలు పంపింది. ఇతర ఉద్యోగులకు వివరణ సందేశాలు పంపింది. ‘‘ఒత్తిడి ఉందా అని మేం అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చి సర్వేలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీ స్పందనకు మేం చాలా విలువ ఇస్తున్నాం. పనిచేసేటప్పుడు ఒక్కరు కూడా ఒత్తిడిగా ఫీల్ అవ్వకూడదు అనేది సంస్థ సిద్ధాంతం.
ఈ మేరకు ఉద్యోగుల విషయంలో సంస్థ ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. తదుపరి వివరాలు త్వరలో తెలియజేస్తాం’’అని కంపెనీ పేర్కొంది. కంపెనీ మానవవనరుల విభాగ సారథి అషు అరోరా ఝా పేరిట వచ్చిన ఈమెయిల్ సందేశాలను చూసి సదరు ఉద్యోగులు అవాక్కయ్యారు. ‘‘ఒత్తిడిగా ఉందని చెబితే పిలిచి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపాలిగానీ ఇలా ఏకంగా ఉద్యోగం ఊడపీకేస్తారా? అంటూ జాబ్ కోల్పోయిన ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు.
సర్వేలో ‘యస్’అని చెప్పిన దాదాపు 100 మందిని సంస్థ తొలగించిందని తెలుస్తోంది. ఇండిగో డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ డైరెక్టర్ శితిజ్ డోగ్రా చేసిన ఒక పోస్ట్‌తో ఈ ‘ఉద్యోగుల ఉద్వాసన పర్వం’వెలుగులోకి వచ్చింది. ‘‘నిజాయతీగా సమాధానం చెబితే సంస్థ ఇలాంటి మతిలేని నిర్ణయం తీసుకుంటుందా?’’అని చాలా మంది నెటిజన్లు సంస్థ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఘటనపై ఆలిండియా ఎంప్లాయీ అసోసియేషన్ స్పందించింది.
‘‘కార్మిక వ్యవస్థలోని లోపాలను కొన్ని సంస్థలు పూర్తిగా దురి్వనియోగం చేస్తున్నాయి. ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చే స్తోమత లేకపోతే ముందుగా అసలు ఉద్యోగాల్లోకి తీసుకోకండి. ఆరోగ్యకరమైన ఉద్యోగ వాతావరణాన్ని కల్పించలేకపోతే ఎవరికీ ఉద్యోగం ఇవ్వకండి. పిచ్చిపిచ్చి కారణాలు చెప్పి ఉద్యోగులను మానసికంగా వేధించకండి’’అని వ్యాఖ్యానించింది.
‘‘హేతుబద్దత లోపించిన అనైతిక నిర్ణయం ఇది. ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునేందుకు సంస్థలు ఇలాంటి చవకబారు నిర్ణయాలు తీసుకుంటారని ఇప్పుడే చూస్తున్నాం. ఉద్యోగలు పనిసమయాల్లో ఒత్తిడిగా ఫీల్ అయ్యారోలేదో తెలీదుగానీ ఈ వార్త తెల్సి నిజంగా చాలా ఒత్తిడికి గురై ఉంటారు. ఇది అందరూ ఒత్తిడిగా ఫీల్ అయ్యే ఘటన’’అని పలువురు పెదవి విరిచారు.
Comments
Please login to add a commentAdd a comment