విపరీతంగా ఆలోచించినప్పుడు బుర్ర వేడెక్కిపోయింది అంటుండటం సాధారణం. మరి అంతకంటే ఎక్కువ తీవ్రతతో కూడిన ఒత్తిడితో పని చేస్తుంటే దాన్ని కాలిపోవడంతో పోల్చవచ్చా అంటే అవునంటున్నారు వైద్యనిపుణులు. నియంత్రణ ఏమాత్రం లేకుండా, తీవ్ర ఒత్తిడితో పనిచేస్తే కలిగే దుష్ప్రభావాలను ‘‘బర్న్ ఔట్ సిండ్రోమ్’’గా చెబుతున్నారు. దీనికి ఒకింత తీవ్రత ఎక్కువగా ఉన్న మరో స్థితి కూడా ఉంది. దాని పేరే ‘మూన్‌లైటింగ్’ ఎఫెక్ట్.
ఈ మాటలిప్పుడు మరింత ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఉంది. కోవిడ్ సమయంలో లాక్‌డౌన్ విధించడంతో కొన్ని వృత్తులవారు... ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఆమాటకొస్తే డాక్టర్లు, నర్సుల వంటి వారూ ఈ ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’, ‘మూన్ లైట్ ఎఫెక్ట్’ బారిన పడ్డట్లుగా అధ్యయనాల్లో తేలడంతో వాటి ప్రభావమిప్పుడు చర్చనీయాంశమైంది. ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’, ‘మూన్ లైట్ ఎఫెక్ట్’పై అవగాహన కల్పించే కథనమిది.
లాక్‌డౌన్ లేని సమయంలో సాఫ్ట్‌వేర్ వృత్తుల వారు ఎవరి ఆఫీసుల్లో వారు.. వారి సంస్థకు చెందిన పనులు చేసుకునేవారు. లాక్‌డౌన్ విధించాక ఇంట్లోనే ఉండి పనిచేసుకోవచ్చనే వెసులుబాటు రావడంతో.. కొంతమంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ ఒకటి కంటే ఎక్కువ సంస్థల నుంచి పనులు స్వీకరించి పనిచేయడం మొదలుపెట్టారు. మామూలుగానే ఒత్తిడితో కూడిన వృత్తి.. దానికి తోడు మరిన్ని సంస్థలకు పనిచేయాల్సి రావడంతో ఏర్పడ్డ అదనపు ఒత్తిడి కారణంగా ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’కు గురికావడం ఎక్కువయ్యింది.
ఒక సంస్థకు తెలియకుండా మరొక సంస్థలో పనిచేస్తూ.. ఒకటి కంటే ఎక్కువ సంస్థలకు చెందిన కార్యకలాపాలు నిర్వహించడంతో.. అనూహ్యంగా పెరిగిపోయిన తీవ్రమైన ఒత్తిడిని ‘మూన్‌లైట్ ఎఫెక్ట్’గా వైద్యులు పేర్కొంటున్నారు. వీటివల్ల మెదడులో అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగాలనూ, ఉపాధిని కోల్పోవడమూ జరిగిందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
చదవండి: ఇలా చేస్తే పురుగులు పడిపోతాయి! అప్పుడు ఎంచక్కా...
లక్షణాలు
►తీవ్రమైన నిస్సత్తువ, పని పైన ఆసక్తి లేకపోవడం
►పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం
►వృత్తికి సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రతికూల ధోరణి (నెగెటివిజమ్)
►భవిష్యత్తు గురించి నిరాశాజనకంగా ఆలోచించడం
►తనను తాను ప్రోత్సహించుకుని, పని చేయడానికి పురిగొల్పుకునే ధోరణి (మోటివేటెడ్‌గా) లేకపోవడం.
‘బర్న్‌ఔట్’ తాలూకు తీవ్రతలూ – దశలు...
ఈ దుష్ప్రభావల తీవ్రత... ఒకేసారి కాకుండా దశలవారీగా కనిపిస్తుంది. అవే...
1. హనీమూన్ ఫేజ్ : పని పెరిగినప్పటికీ అదనపు ఆదాయం సమకూరుతుండటం, డబ్బు కళ్లబడుతుండటంతో మొదట్లో చాలా ప్రోత్సాహకరంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. అందుకే దీన్ని ‘హనీమూన్ ఫేజ్’గా చెబుతారు.
2. అర్లీ స్ట్రెస్ ఫేజ్ : ఒత్తిడి తాలూకు మొదటి దశ ఇది.
3. క్రానిక్ స్ట్రెస్ ఫేజ్ : ఒత్తిడి మొదటి దశ దాటిపోయి... ఎల్లప్పుడూ అదే ఒత్తిడితో ఉండటం జరుగుతుంది. అందుకే దీన్ని ‘క్రానిక్ స్ట్రెస్ ఫేజ్’గా చెబుతారు.
4. ఎస్టాబ్లిష్‌డ్ బర్న్ ఔట్ : నిత్యం ఒత్తిడి కారణంగా కనిపించే దుష్ప్రభావాలు స్పష్టంగా వెల్లడవుతూ ఉండటం (ఎస్టాబ్లిష్ అవుతుండటం) వల్ల దీన్ని ఈ పేరుతో పిలుస్తారు.
ఇదీ చదవండి: పిల్లల్ని పెంచేపుడు ఏం తప్పులు చేస్తున్నాం? అసలు ఎలా పెంచాలి?
5. హ్యాబిచ్యువల్ బర్న్ ఔట్ : నిత్యం కనిపించే ఒత్తిడికి పూర్తిగా అలవాటు పడిపోయి, దాన్లోంచి తప్పించుకోలేక, ఒప్పుకున్న పనినుంచి తప్పుకోలేక ఒకరకమైన నిస్పృహకూ, నిరాసక్తతకూ లోనుకావడాన్ని ‘హ్యాబిచ్యువల్ బర్న్ ఔట్’ దశగా చెప్పవచ్చు. పైగా ఈ దశలన్నీ వ్యక్తుల్లో మంచి అభివృద్ధికి తోడ్పడే కీలకమైన వయసులో అంటే 30 నుంచి 35 ఏళ్ల మధ్యన కలగడంతో తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోను కావడంతో ఆ కుటుంబం అతలాకుతలం కావడం, ఛిన్నాభిన్నమైపోవడం లాంటి పరిణామాలు సంభవిస్తుంటాయి.
ఎవరిలో ఎక్కువంటే...
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే కాకుండా, కోవిడ్ సమయంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన వైద్యవర్గాలూ ‘బర్న్ ఔట్ సిండ్రోమ్’కు గురికావడం ఆసక్తికరమైన అంశం. గణాంకాల్ని చూసినప్పుడు ఈ వైద్యవర్గాల్లోనూ ఎమర్జెన్సీ వైద్య విభాగాల్లో పనిచేసేవారు 65%, కార్డియాలజీ విభాగానికి చెందిన వారు 43%, న్యూరోసర్జరీ విభాగాల్లో పనిచేసే వైద్యుల్లో 21% మంది దీని బారిన పడ్డారని తేలింది. వీళ్లే కాదు... ఫాస్ట్‌ఫుడ్ డెలివరీ వర్కర్లు, ట్రాఫిక్ పోలీసులు, ఫైర్ ఫైటర్లూ దీనికి గురవుతుంటారు. మహిళలు దీని బారిన ఎక్కువగా పడుతుంటారు. దీనికి తోడు వ్యాయామం చేయనివాళ్లూ, ఊబకాయం ఉన్నవారూ, ఒంటరివాళ్లూ, బాగా ఎక్కువగా ఆల్కహాల్ తాగేవారిలోనూ బర్న్‌ఔట్ సిండ్రోమ్ బారిన పడే అవకాశాలు మరీ ఎక్కువ.
మూన్‌లైటింగ్ ఎఫెక్ట్ అంటే... తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పెంచుకోవాలనే కోరికతో, ఎలాగూ తమపై ఆఫీసు నిఘా ఉండదు కాబట్టి పలుచోట్ల పనులను ఒప్పుకున్నవారు మరింత ఎక్కువ ఒత్తిడికి గురికావడాన్ని ‘మూన్‌లైటింగ్ ఎఫెక్ట్’ అంటారు. మామూలుగా మనం పగలు పనిచేస్తుంటాం. అదనపు పనిని ఒప్పుకున్నందున నిద్రమానేసి విశ్రాంతి లేకుండా రాత్రుళ్లూ పని చేస్తూ పోవడాన్ని ‘మూన్‌లైటింగ్’గా చెబుతున్నారు.
మొదట్లో దీన్ని ఓ వైవిధ్యమైన పరిస్థితిగా అనుకున్నప్పటికీ విస్తృత అధ్యయనం తర్వాత ‘మూన్‌లైటింగ్’ కూడా ‘బర్న్‌ఔట్’ తాలూకు మరో రూపమనీ, దానికంటే ఒకింత తీవ్రత ఎక్కువని తేలింది. దీనివల్ల ఆఫీసులో జరిగే తప్పులే కాకుండా... భవిష్యత్తులో హైబీపీ, గుండెజబ్బులకూ, డిప్రెషన్‌కూ దారితీయవచ్చని పరిశోధనల్లో తేలింది.
విముక్తి ఎలా... ఈ సమస్యల నుంచి బయటపడటం కూడా తేలికే. అవసరమైనంత విశ్రాంతి తీసుకోవడం, వీలైనంతవరకు మధ్యాహ్నాలు ఓ అరగంట నిద్ర (పవర్‌న్యాప్), రాత్రుళ్లు కంటి నిండా కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వీలైనంతవరకు చక్కెర పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.
అన్నిటికంటే ముఖ్యంగా ఆల్కహాల్‌కూ, నిద్రపట్టనప్పుడు స్లీపింగ్ పిల్స్ వాడేవారు వాటికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయాలి. తమ పట్ల తాము జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే కాకుండా... ఇతరులకు సహాయం చేయడంలోని ఆనందమూ వారిని బర్న్ ఔట్ నుంచి రక్షిస్తుందని అధ్యయనాలు తేల్చాయి. అప్పటికీ నిరాశ, నిస్పృహ, నిస్సత్తువ, అనాసక్తి వంటి లక్షణాలు చాలాకాలం పాటు కనిపిస్తుంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
మెదడుపైనా దుష్ప్రభావాలు
ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలో : బర్న్ ఔట్ కారణంగా మెదడులోని ప్రీ–ఫ్రంటల్ కార్టెక్స్ ప్రాంతంలోని ‘గ్రే మ్యాటర్’ బాగా పలచబారినట్లు ఇటీవలి తాజా పరిశోధనలు చెబుతున్నాయి. దీని కారణంగా జ్ఞాపకశక్తి బాగా తగ్గడం, ఏ విషయాన్నైనా సమగ్రంగా ఆకళింపు చేసుకోవడంలో లోపాలు, చేసిన తప్పిదాలే మళ్లీ మళ్లీ చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడంలో నైపుణ్యాలు తగ్గడం వంటి లోపాలు కనిపించాయి.
టెంపోరల్ లోబ్ ప్రాంతంలో : మెదడులోని మధ్య (మీడియల్) టెంపోరల్ లోబ్ అనే చోట బాదం కాయ ఆకృతిలో ‘ఎమిగ్దలా’ అనే ఓ ప్రదేశం ఉంటుంది. (నిజానికి గ్రీకు భాషలో ఎమిగ్దలే అంటే బాదం కాయ అనే అర్థం. అందుకే దానికా పేరు). భయాలూ, ఆందోళనల్లాంటి అనేక ఉద్వేగాలకు కారణమయే, ఆవిర్భవించే ప్రదేశమది. బర్న్ ఔట్‌కు లోనైన వారిని పరిశీలించినప్పుడు వాళ్లలో ‘అమిగ్దలా’ బలంగా మారినట్లు తేలింది. ఫలితంగా తమ చుట్టూ ఉన్న ప్రపంచమంతా భయంకరంగా అనిపించడం లాంటి అనుభవాలకు గురిచేస్తుందన్న మాట. ఒకవైపు గ్రేమ్యాటర్ పలచబారడం, మరోవైపు ఎమిగ్దలా బలపడటం... ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడంతో బర్న్‌ఔట్ తీవ్రత మరింతగా పెరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment