కొచ్చికి చెందిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ అనే మహిళ పనిభారం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. బాధితురాలి తల్లే స్వయంగా తన కూతురు మరణానికి పని ఒత్తిడి అంటూ ఆమె పనిచేసే ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీకి లేఖ రాయడంతో ఒక్కసారిగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చి సంచలనమయ్యింది.
ఆ ఘటన మరువక ముందే లక్నోలో జరిగిన మరో ఘటన అందర్ని ఉలక్కిపడేలే చేసింది. ప్రైవేట్ బ్యాంకులో మంచి పొజిషన్‌లో పనిచేస్తున్న సదాఫ్ ఫాతిమా విధుల నిర్వర్తిస్తూనే కుర్చీలోనే కూలబడింది. ఇటీవలే ఆమెకు ప్రమోషన్ రావడంతో పని ఒత్తిడి ఎక్కువయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వరుస ఘటనలతో మంచి పని వాతావరణం ఉద్యోగులకు కల్పించే దిశగా కొన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.
అలాగే పనిచేసే మహిళలు కూడా పనిచేసే చోట ఎదురయ్యే ఒత్తిడిని, ఇంటి బాధ్యతలను ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిపై అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని మానసిక నిపుణులు అంటున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో అన్నింటిలో తానే బెస్ట్‌గా ఉండాలనే తాపత్రయం పని ఒత్తడికి ప్రధాన కారణం అని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ పని ఒత్తిడి ఎలా హ్యాండిల్ చేసి ఆహ్లాదభరితమైన హ్యాపీ వర్క్‌ప్లేస్‌గా మార్చకోవచ్చు అనే దాని గురించి నిపుణుల మాటల్లో సవివరంగా తెలుసుకుందాం.
హ్యాపీ వర్క్‌ప్లేస్.. ఇలా!
పని ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. మీరు ఏ పని విషయంలో ఒత్తిడికి గురవుతున్నారో ముందుగా గుర్తించగలగాలి. ఈ క్రమంలో అది మీకు భారంగా, మీ ఆలోచన స్థాయికి మించినట్లుగా అనిపిస్తే నిర్మొహమాటంగా ‘నో’ చెప్పడం మంచిది. లేదంటే ఒత్తిడి తప్పదు.
పని పూర్తవ్వాలని గంటల తరబడి కూర్చోకుండా.. ప్రాధాన్యమున్న పనుల్ని ముందు పూర్తి చేసుకోవాలి. తద్వారా సమయానికి పనులు పూర్తయ్యేలా చూసుకోవచ్చు.. దీనివల్ల మన కోసం మనం కేటాయించుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఇదీ ఓ మార్గమే అంటున్నారు నిపుణులు.
నిరంతరాయంగా పనులు చేయడం కాకుండా గంట/రెండు గంటలకోసారి ఓ ఐదుపది నిమిషాలు విరామం తీసుకోవడం మంచిది. తద్వారా మనసుకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అలాగే ఈ సమయంలో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే శారీరకంగానూ అలసిపోకుండా జాగ్రత్తపడచ్చు.
ఎంత పనున్నా నిద్ర, ఆహారం విషయాల్లో అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే ఈ రెండూ కూడా ఒత్తిడిని దూరం చేసి ఆరోగ్యాన్ని చేరువ చేసేందుకు దోహదం చేస్తాయి.
పని ప్రదేశంలో అటు కొలీగ్స్‌తో, ఇటు పైఅధికారులతో ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీకు భారంగా అనిపించిన పనులు, ఇతర విషయాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడచ్చు. దీనివల్లా చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది.
యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు.. వంటివి కూడా ఒత్తిడిని చిత్తు చేసే సాధనాలే! కాబట్టి వీటిని రోజూ సాధన చేయడం మంచిది.
ఇలా ఉద్యోగులే కాదు.. సంస్థలూ తమ ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఉద్యోగులపై అదనపు పని భారాన్ని తగ్గించడంతో పాటు వేళకు పని పూర్తి చేసేలా వాళ్లను ప్రోత్సహించాలి. ఒత్తిడిని దూరం చేసేందుకు సంబంధిత నిపుణులతో ప్రత్యేక సెషన్స్ నిర్వహించడం, అప్పుడప్పుడూ వినోద కార్యక్రమాల్ని ఏర్పాటుచేయడం.. వంటివీ వారికి మేలు చేస్తాయని చెబుతున్నారు మానసిక నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment